Narasaraopeta 144 Section: నరసరావుపేటలో వైసీపీ శ్రేణుల దాడులపై జిల్లా ఎస్పీకి టీడీపీ నేతల ఫిర్యాదు
నరసరావుపేటలో టీడీపీ నేతలపై దాడుల గురించి సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డికి టీడీపీ నేతలు పత్తిపాటి పుల్లారావు, చదలవాడ అరవింద బాబు ఫిర్యాదు చేశారు.
పల్నాడు జిల్లా నరసరావుపేటలో వైసీపీ, టీడీపీ నేతల పరస్పర దాడులు కలకలం రేపాయి. ఈ దాడులపై సోమవారం టీడీపీ నేతలు పత్తిపాటి పుల్లారావు, చదలవాడ అరవింద బాబు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. అనంతరం పత్తిపాటి మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి దాడి జరిగిన స్థలానికి వెళ్లారని, స్వయంగా ఎమ్మెల్యే పాల్గొన్నారని ఆరోపించారు. వ్యాపారి పారిపోవడంలో అధికార పార్టీ నేతల హస్తం ఉందన్నారు. గేటెడ్ కమ్యూనిటీలోని అందరూ వ్యాపారికి అప్పులిచ్చారని, అధికార పార్టీ నాయకుల సహకారంతోనే వ్యాపారి పారిపోయాడని ఆరోపించారు.
టీడీపీ నేతలపై దాడి చేసి గాయపరిచిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పత్తిపాటి డిమాండ్ చేశారు. మంత్రి విడదల రజిని ఒత్తిడితో కనపర్రులో దివ్యాంగుడి ఇంటిని స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో గెలిచేందుకు వైసీపీ అడ్డదారులు తొక్కుతోందని, ఇందుకు పెద్ద ఎత్తున కుట్రలకు తెర తీశారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయాన్ని అడ్డుకోవడానికి టీడీపీ సానుభూతిపరులు ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపించారు.
ఎమ్మెల్యే రూ.కోటి తీసుకున్నారు: చదలవాడ
టీడీపీ సీనియర్ నేత చదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ.. ప్రశాంతంగా ఉన్న నరసరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి గొడవలు రేపుతున్నారని మండిపడ్డారు. పథకం ప్రకారం దాడులకు తెగబడుతున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే అవినీతిని ప్రశ్నిస్తుంటే తట్టుకోలేక దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. ఐపీ పెట్టిన వ్యాపారి వద్ద నుంచి ఎమ్మెల్యే గోపిరెడ్డి కోటి రూపాయలు తీసుకున్నారని చదలవాడ ఆరోపించారు. ఎమ్మెల్యేతో పాటు కిరాయి గూండాలు పట్టణంలో తిరుగుతూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలపై దాడికి ఎమ్మెల్యే గోపిరెడ్డి, రూరల్ సీఐ భక్తవత్సల రెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పట్టణంలో 144 సెక్షన్ పెట్టినందుకు ఎమ్మెల్యే సిగ్గుతో తలదించుకోవాలన్నారు.
నరసరావుపేటలో టెన్షన్ టెన్షన్..
పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఆదివారం సాయంత్రం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి చల్లా సుబ్బారావు ఇంటిపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. శనివారం చల్లా సుబ్బారావు మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డిపై అవినీతి ఆరోపణలు చేశారు. దీంతో టీడీపీ నేతపై కక్షగట్టి వైసీపీ శ్రేణులు ఆదివారం ఒక్కసారిగా చల్లా సుబ్బారావు నివాసంపై దాడికి దిగాయి. సమాచారం తెలియగానే టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున సుబ్బారావు ఇంటికి చేరుకున్నారు. వైసీపీ నేతలు, కార్యకర్తల్ని అడ్డుకునే క్రమంలో గొడవ పెరిగి పెద్దదైంది. అనంతరం ఇరు వర్గాలు రాళ్లు, కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నాయి.
వైసీపీ కార్యకర్తల దాడిలో టీడీపీ నేత చల్లా సుబ్బారావు ఇంటి కిటికీలతో పాటు ఇంట్లోని ఫర్నిచర్ ధ్వంసమయ్యాయి. ఆ ఇంటిని సుబ్బారావు ఆక్రమించుకున్నారని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తూ దాడి చేసినట్లు తెలుస్తోంది. టీడీపీ, వైసీపీ నేతల దాడుల్ని నిలువరించి, వారిని చెదరగొట్టేందుకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కానీ ఇరు వర్గాలు చేసుకున్న రాళ్ల దాడిలో పోలీసుల జీపుతో పాటు టీడీపీ నేతల వాహనాలు ధ్వంసమయ్యాయి. టీడీపీ నేత అరవిందబాబు కారు డ్రైవర్ తలకు గాయాలయ్యాయి. వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి సైతం అక్కడికి చేరుకున్నారు. గొడవ పెద్దది కావడంతో పోలీసులు మరింతగా శ్రమించి టీడీపీ, వైసీపీ శ్రేణులను అతికష్టమ్మీద చెదరగొట్టారు.