Andhra Pradesh: ఆఫ్రికాను ఆదర్శంగా తీసుకున్న జగన్! కరకట్ట కమల్ హాసన్ ఆర్కే- మంగళగిరిలో నారా లోకేష్ సెటైర్లు
Andhra Pradesh News: తాను హైదరాబాద్ లో పుట్టి పెరిగానని, అయితే 2019లో పోటీ చేసినప్పుడే మంగళగిరిని తన స్వస్థలం చేసుకున్నానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు.
Nara Lokesh campaign In Amaravati - అమరావతి: అధికారంలోకి రాగానే అమరావతి పనులు ప్రారంభిస్తాం, రాజధానిలో పేదలకు ఇచ్చే రూ.5 వేల పింఛన్‍ను కొనసాగిస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చెప్పారు. అసైన్డ్ రైతులకు ఇవ్వాల్సిన కౌలును వడ్డీతో చెల్లిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. తాను హైదరాబాద్ లో పుట్టి, పెరిగానని.. 2019 ఎన్నికల్లో పోటీ చేసినప్పటి నుంచి మంగళగిరిని తన స్వస్థలం చేసుకున్నానని చెప్పారు. మంగళగిరి మండలం నీరుకొండలో నారా లోకేష్ ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గులకరాయి ఘటనలో ఏపీ సీఎం జగన్‍కు ఆస్కార్ అవార్డుకు బదులుగా భాస్కర్ అవార్డు ఇవ్వాలంటూ ఎద్దేవా చేశారు.
నారా లోకేష్ మాట్లాడుతూ.. ‘ఒక్కసారి ఛాన్స్ అని అడిగి వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చారు. ఎవరైనా ఆఫ్రికాను ఆదర్శంగా తీసుకుంటారా. జగన్ మాత్రమే ఆదర్శంగా తీసుకుంటాడు. మూడు రాజధానుల బిల్లుకు మొదట ఓటేసిన నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి. అందుకే ఆయనకు ముద్దుగా కరకట్ట కమల్ హాసన్ అని పేరు పెట్టాం. ఆర్కే అద్భుతమైన నటుడు. సినిమాల్లోకి వచ్చింటే బ్రహ్మనందంకు పోటీ ఇచ్చేవాళ్లు. ఇంటింటి ప్రచారానికి వచ్చే వైసీపీ నేతల్ని.. అమరావతి ప్రజల్ని ఎందుకు మోసం చేశారని ప్రశ్నించాలి.
గులకరాయి ఘటనపై లోకేష్ సెటైర్లు
‘కోడి కత్తి కేసు ఘటన జరిగింది, బాబాయ్ వివేకా హత్య జరిగింది. ఇప్పుడు గులకరాయి ఘటన జరిగింది. ఎవరో రాయి విసిరితే సీఎం జగన్ కు రాయి తగిలిందన్నారు. కానీ అదే రాయి వెల్లంపల్లి ఎడమ కన్నుకు తగిలి, మళ్లీ కుడి కన్నుకు కూడా తగిలి మరో ఇద్దరికి రాయి తగిలిందంటూ సెటైర్లు. మొదటిరోజు వెల్లంపల్లి ఎడమ కన్నుకు కట్టు కట్టారు. మరిచిపోయి రెండో రోజు కుడి కన్నుకు కట్టు కట్టడం డ్రామా కాదా? నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. కానీ బ్యాండేజీ తీసేశాక గమనిస్తే చిన్న గాయం, గుర్తు కూడా లేదు. క్రికెట్ బాల్ లాగ అంత మందికి రాయి తగిలింది. అయితే సీఎం జగన్ కు దెబ్బ తగిలిన ఆనవాళ్లు కనిపించడం లేదు. జగన్ కు ఆస్కార్ కాదు, భాస్కర్ అవార్డు ఇవ్వాలి. టాలీవుడ్ దర్శకుడు రాజమౌళికి సీఎం జగన్ తో సినిమా తీస్తే అవార్డులు పక్కా అని చెబుతా’ అన్నారు నారా లోకేష్.
రాజధాని తరలింపుపై హైకోర్టు బ్రేకులు వేయకపోతే పరిస్థితి దారుణంగా ఉండేదన్నారు. రైతులు, మహిళల్ని బూటు కాళ్లతో తన్నారు, ఇలాంటి ఘటనలు, మన కష్టాలను మరిచిపోకూడదన్నారు. ఎస్ఆర్ఎంకు అంత భూమి అవసరమా అన్నారు, ఇప్పుడు వందల కుటుంబాలకు ఉద్యోగాలు వచ్చాయన్నారు. చంద్రబాబు సీఎంగా కొనసాగింటే ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగేవని, ఇంకో నెల ఆగితే కూటమి ప్రభుత్వం వచ్చాక అందరి కష్టాలు తీరతాయని లోకేష్ భరోసా ఇచ్చారు.
నేను చేసిన దాంట్లో 10 శాతమైనా చేశారా?
తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమంతో పోల్చితే వైసీపీ నేతలు 10 శాతమైనా చేశారా అంటూ నారా లోకేష్ మండిపడ్డారు. తాను హైదరాబాద్ లో పుట్టానని, 2019 నుంచి మంగళగిరిని స్వస్థలం చేసుకుని కష్టపడ్డట్లు చెప్పారు. వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినా, మంగళగిరి ప్రజల గురించే ఆలోచించానని పేర్కొన్నారు.