చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంలో మరోసారి వాయిదా పడింది. ఇప్పటికే ఈ అంశంపై ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం ఇవాళ తుది తీర్పు వెల్లడికానుందని అంతా అనుకున్నారు కానీ మంగళవారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
చంద్రబాబుపై పెట్టిన కేసు అక్రమమని మొదటి నుంచి వాదిస్తోన్న టీడీపీ ముందు బెయిల్ పిటిషన్ వేయకుండా 17ఏపై పోరాటం చేస్తోంది. ఈ రూల్ కోర్టుల్లో నిలబడదని పోరాడుతూ వస్తోంది. ముందు ఈ పిటిషన్లను ఏసీబీ కోర్టు తర్వాత ఏపీ హైకోర్టు కొట్టేసింది. అంతరం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదించారు. ఏపీ ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గీ వాదించారు. 17ఎ సెక్షన్‌కు సంబంధించిన వివిధ అంశాలు, మరికొన్ని కేసుల్లో వచ్చిన తీర్పులను హరీష్ సాల్వే ప్రస్తావించారు.
మొదటగా హరీష్ సాల్వే వాదనలు
సోమవారం కోర్టు సమయం పూర్తయ్యే వరకూ విచారణ జరిగింది. మంగళవారం ఉదయమే విచారణ ప్రారంభమైన వెంటనే.. హరీష్ సాల్వేను ఎంత సేపు వాదనలు వినిపిస్తారని ధర్మాసనం అడిగింది. గంటసేపు అని చెప్పారు. ఆ మేరకు వాదనలు వినిపించారు. రఫేల్ కొనుగోళ్లపై యశ్వంత్ సిన్హా వేసిన పిటిషన్, అనంతరం దాఖలైన పలు కేసులపై వచ్చిన తీర్పులను ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ‘‘రఫేల్ కేసు ఆరోపణలు 2016కు సంబంధించినవి. 2019లో యశ్వంత్ సిన్హా పిటిషన్లపై తీర్పులు వచ్చాయి. చట్ట సవరణకు ముందున్న ఆరోపణలను పరిగణనలోకి తీసుకునే 2019లో కేసు కొట్టేశారు. అన్నిరకాల విధుల్లోని ప్రభుత్వ అధికారులకు సెక్షన్ 17ఎతో రక్షణ లభించింది’’అని వాదించారు. వివిధ హైకోర్టుల్లో వచ్చిన తీర్పులను ఉదహరించిన సాల్వే.. స్కిల్ కేసులో చంద్రబాబుపై నమోదైన ఎఫ్‌ఐఆర్ చట్టబద్ధం కాదన్నారు. దాన్నే సవాల్ చేస్తున్నామని . అన్నీ కలిపేసి ఒక ఎఫ్‌ఐఆర్‌ను రూపొందించారు. అందులో ఎక్కడా చంద్రబాబు పేరు లేదన్నారు.
ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గీ వాదనలు
2018కి ముందు విచారణ కొంతవరకు జరిగి నిలిచిపోయిందని.. అంతమాత్రాన విచారణ జరగనట్లు కాదని సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ వాదించారు. హైకోర్టులో విచారణ ముగిశాక పత్రాలు ఇచ్చామన్న దానిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. 2018 చట్టసవరణ తర్వాత చంద్రబాబును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినప్పటికీ దీన్ని రాజకీయ ప్రతీకార చర్యగా చూడకూడదని వాదించారు. ఆయనపై తగినన్ని ఆధారాలు దొరికిన తర్వాత 2021లో కేసు నమోదు చేశారని.. . కేసులో చంద్రబాబును ఎప్పుడు చేర్చినప్పటికీ విచారణ కొనసాగుతున్నట్లుగానే పరిగణించాలని వాదించారు. నేరం ఎప్పుడు జరిగిందో.. అప్పటి చట్టం ప్రకారమే విచారణ జరపాలని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పరిణామ క్రమంలో చట్టంలో వచ్చిన మార్పులను పాత నేరాలకు వర్తింపజేయకూడదన్నారు. చట్టసవరణలతో ఎలాంటి పరిణామాలు వచ్చాయన్నది కాదు.. ఎప్పటి నేరానికి అప్పటి చట్టమే వర్తించాలన్నారు.
ప్రభుత్వం తరపు లాయర్‌కు ధర్మాసనం పలు ప్రశ్న
ప్రభుత్వం తరపు లాయర్ ముకుల్ రోహత్గీకి పలు సందేహాలను వ్యక్తం చేసింది. 17A నేరానికి వర్తిస్తుందా ? నిందితులకు వర్తిస్తుందా? అని జస్టిస్ బేలా త్రివేది ప్రశ్నించారు. 2018లో విచారణ ప్రారంభించినప్పుడు ఏమి కనిపెట్టారు? అని ప్రశించారు. ‘అవినీతికి సంబంధించిన సెక్షన్ అమలు కాకపోతే మిగతా సెక్షన్స్ కింద ప్రత్యేక కోర్టు విచారించవచ్చా?... మిగతా సెక్షన్‌ల కింద పెట్టిన కేసులు చెల్లుతాయా ? లేదా ?’ అని జస్టిస్ బేలా త్రివేది ప్రశ్నించారు.
చంద్రబాబు లాయర్లకు ప్రశ్నలు
ఇవాళ వాదన ప్రారంభమైన తర్వాత కూడా సుప్రీం కోర్టు చంద్రబాబు లాయర్లను పలు ప్రశ్నలు సంధించింది. ఈ కేసులో బెయిల్ ప్రయత్నాలు జరుగుతున్నాయా లేదా అని క్వశ్చన్ చేసింది.