SP Balu Statue Removed: గుంటూరులో ఎస్పీ బాలు విగ్రహం తొలగింపు, ఏర్పాటు చేసి 24 గంటలు గడువకముందే !
SP Balu Statue Removed: గుంటూరు నగరంలో లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటు చేయడం వివాదానికి దారితీసింది. అనుమతులు లేవని అధికారులు చెబుతున్నారు.
SP Balasubrahmanyam Statue Removed: టాలీవుడ్ గాన గంధర్వుడు, ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూసి రెండేళ్లు గడిచిపోయాయి. ఈ క్రమంలో గుంటూరు నగరంలో లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటు చేయడం వివాదానికి దారితీసింది. గుంటూరులోని మదర్ థెరిస్సా జంక్షన్ వద్ద కళాదర్భార్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి సింగర్ ఎస్పీ బాలు విగ్రహం ఏర్పాటుచేశారు. కానీ కొన్ని గంటల వ్యవధిలోనే బాలు విగ్రహాన్ని నగరపాలక సంస్థ అధికారులు తొలగించారు.
24 గంటలు గడువక ముందే తొలగించడమా ?
కళాదర్బార్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ఎస్పీ బాలు విగ్రహాన్ని మదర్ థెరిస్సా జంక్షన్ వద్ద ఏర్పాటు చేశారు. అయితే విగ్రహం ఏర్పాటుకు ఎలాంటి అనుమతులు తీసుకోలేదన్న కారణంతో నగరపాలక సంస్థ అధికారులు సోమవారం నాడు సింగర్ బాలు విగ్రహాన్ని తొలగించారు. విగ్రహ ఏర్పాటుకు నిర్మించిన దిమ్మెను కూల్చివేసి ఎస్పీ బాలు విగ్రహాన్ని అక్కడినుంచి తరలించారు పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు. లెజెండరీ సింగర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే ఉద్దేశపూర్వకంగానే ఏపీ ప్రభుత్వం ఒక్కరోజు గడువక ముందే తొలగించిందనే విమర్శలు వస్తున్నాయి.
ఆదివారం విగ్రహం ఏర్పాటు, సోమవారం తొలగిస్తారా !
లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లాంటి వ్యక్తికి మనం ఇచ్చే గౌరవం ఇదేనా అని కళాదర్బార్ అధ్యక్షుడు పొత్తూరి రంగారావు ప్రశ్నించారు. గుంటూరులో ఆదివారం రాత్రి సింగర్ ఎస్పీ బాలు విగ్రహం ఏర్పాటు చేయగా, మరుసటి రోజే మునిసిపల్ అధికారులు తొలగించడం సరికాదన్నారు. తన గాత్రంతో తెలుగు ప్రజలను, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని అలరించారు. బాలు విగ్రహం ఏర్పాటు కోసం కొన్ని నెలలుగా, అనుమతుల కోసం తిరుగుతున్నా పర్మిషన్ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ, తెలంగాణలో ఏర్పాటు చేసిన తొలి ఎస్పీ బాలు విగ్రహం ఇదేనన్నారు. తొలి విగ్రహం ఏర్పాటు చేస్తే, గుంటూరు అధికారులు ఇలా చేయడం సరికాదన్నారు. తొలగించిన స్థానంలోనే బాలు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని, స్థానిక అధికారులను పొత్తూరి రంగారావు కోరారు. గుంటూరులో అనుమతులు లేని విగ్రహాలు ఎన్నో ఉండగా, తాజాగా ఏర్పాటు చేసిన లెజెండరీ సింగర్ ఎస్పీ బాలు విగ్రహాన్ని ఒక్కరోజు గడువక ముందే తొలగించడం సరికాదన్నారు.