Sajjala Comments: చంద్రబాబు ఈ జన్మలో మారరు, బరితెగింపుతో మేమింతే అనేలా ప్రవర్తన - సజ్జల వ్యాఖ్యలు
రాజమండ్రి నుంచి విజయవాడకు 2.30 గంటల సమయం పడుతుందని, మరి చంద్రబాబు వెళ్లడానికి 14 గంటలపాటు సమయం ఎందుకు పట్టిందని ప్రశ్నించారు.
చంద్రబాబు విడుదల కావడంపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకు ఆరోగ్య రీత్యా నాలుగు వారాల పాటు బెయిల్ ఇచ్చారని.. ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేసుకొని రమ్మని చెబితే నిన్న మధ్యాహ్నం రూట్ మ్యాప్ సెట్ చేసుకుని మరీ ఒక యాత్ర లాగా వెళ్లారని విమర్శించారు. రాజమండ్రి నుంచి విజయవాడకు 2.30 గంటల సమయం పడుతుందని, మరి చంద్రబాబు వెళ్లడానికి 14 గంటలపాటు సమయం ఎందుకు పట్టిందని ప్రశ్నించారు.
రోగి అని చెప్పిన వ్యక్తి యోగిలా, స్వతంత్య్ర సమరయోధుడిలా ఎందుకు హడావిడి చేశారని నిలదీశారు. చంద్రబాబు న్యాయస్థానాన్ని కుడా తప్పు దారి పట్టించారని అన్నారు. న్యాయస్థానం చెప్పినా కూడా వినకుండా బరి తెగింపు లక్ష్యంతో మేం ఇంతే అనేలా ప్రవర్తించారని సజ్జల రామకృష్ణా రెడ్డి ఆక్షేపించారు. ‘‘ఏది ఏమైనా చంద్రబాబు ఈ జన్మలో మారరు. రోగం ఉంది అని బయటకు వచ్చి ప్రజలను మళ్లించే విధంగా ప్రయత్నించారు’’ అని సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడారు.
దారి పొడవునా చంద్రబాబుకు విశేష ఆదరణ
రాజమండ్రి జైలులో ఉండి విడుదలైన తమ అభిమాన నేత కోసం అశేష జనవాహిని కదిలి వచ్చింది. పోలీసుల ఆంక్షలను కాదని భారీగా ప్రజలకు చంద్రబాబును చూసేందుకు తరలి వచ్చారు. అడుగడుగునా నీరాజనం పలికారు. దారి పొడవునా అందరికీ కారు నుంచే అభివాదం చేస్తూ చంద్రబాబు ముందుకు సాగారు. మంగళవారం సాయంత్ర నాలుగు గంటలకు ప్రారంభమైన చంద్రబాబు జర్నీ బుధవారం వేకువ జాము ఐదు గంటల వరకు సాగింది. అంటే దాదాపు 13 గంటల పాటు ఆయన జనాలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. సుమారు ఐదు గంటల సమయంలో ఉండవల్లిలోని తన నివాసానికి చంద్రబాబు చేరుకున్నారు. ఆయనకు భార్య భువనేశ్వరి హారతి ఇచ్చి దిష్టి తీసి లోపలికి ఆహ్వానించారు.
మంగళవారం మధ్యాహ్నం స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబుకు షూరిటీగా దేవినేని ఉమామహేశ్వరరావు, బొండా ఉమామహేశ్వరరావు సంతకాలు చేశారు. చెరో లక్ష రూపాయల బాండ్ పేపర్‌లు కోర్టుకు సమర్పించారు. అనంతరం చంద్రబాబు విడుదల ప్రక్రియ ప్రారంభమైంది. నాలుగు గంటల సమయంలో చంద్రబాబును విడుదల చేస్తూ జైలు అధికారులు ఆదేశాలు ఇచ్చారు. కోర్టు విధించిన షరతులు సీబీఎన్‌కు వివరించారు. ఆయన సంతకాలు తీసుకున్నారు.
బెయిల్ ప్రక్రియ ముగిసిన తర్వాత 4.15 ప్రాంతంలో చంద్రబాబు జైలు మెయిన్ గేట్ నుంచి బయటకు వచ్చారు. అక్కడే ఆయన కోసం కాన్వాయ్ సిద్ధంగా ఉంది. అయినా కాన్వాయ్ ఎక్కకుండా రెండ గేట్ వరకు నడుకుంటూ వచ్చారు. ఆయన బెయిల్‌పై సాయంత్రం విడుదల అవుతారని తెలుసుకున్న అభిమానులు, స్థానిక ప్రజలు, కార్యకర్తలతో రాజమండ్రి జైలు పరిసరాలు కిక్కిరిసిపోయాయి. పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా బారికేడ్‌లు పెట్టినా జనం మాత్రం ఆగలేదు. వాటిని నెట్టుకొని దూసుకొచ్చారు.
Also Read: నంద్యాల టు ఉండవల్లి వయా రాజమండ్రి- సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 31 వరకు సీబీఎన్ కేసులో ఏం జరిగింది?