Purandeshwari: జోనల్ సమావేశాల్లో చిన్నమ్మ బిజీ బిజీ, ప్రొద్దుటూరు నుంచి శ్రీకారం
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలను చేపట్టిన తరువాత దగ్గుబాటి పురంధేశ్వరి జోన్ ల వారీగా పర్యటనలకు సిద్దం అయిన సంగతి తెలిసిందే.
రాష్ట్రంలో జోనల్ వారీగా సమావేశాలను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రొద్దుటూరు నుండి సమావేశాలకు ఆమె శ్రీకారం చుట్టారు.
జోన్ ల వారీగా సమావేశాలు
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలను చేపట్టిన తరువాత దగ్గుబాటి పురంధేశ్వరి జోన్ ల వారీగా పర్యటనలకు సిద్దం అయిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఆమె ఆయాప్రాంతాల్లో పర్యటనలు చేపట్టారు. ఈ నెల 30వ తేదీ వరకు జోనల్ సమావేశాల్లో పురంధేశ్వరి బిజీ బిజీగా ఉన్నారు.
ప్రొద్దుటూరు నుండి ప్రారంభం
జోన్ ల వారీగా తలపెట్టిన సమావేశాలను రాయలసీమ ప్రాంతంలోని కడప జిల్లా పొద్దుటూరు నుండి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా ఆమె ప్రొద్దుటూరు రావటంతో పార్టీ నేతలు సాదరంగా స్వాగతం పలికారు. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గబాటి పురందేశ్వరితో పాటుగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ వంటి కీలక నేతలు కూడా హజరయ్యారు.
25న గుంటూరులో..
జోనల్ సమావేశాల్లో భాగంగా పురంధేశ్వరి ఈ నెల 25వ తేదీన కోస్టల్ ఆంధ్రా జోన్ సమావేశాన్ని గుంటూరులో నిర్వహించనున్నారు. ఆ తరువాత 26వ తేదీన గోదావరి జోన్ సమావేశం రాజమహేంద్రవరంలో, 27వ తేదీన ఉత్తరాంధ్ర జోన్ సమావేశం విశాఖలోను నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు జోనల్ సమావేశాలకు పురంధేశ్వరి హాజరయ్యి, భవిష్యత్ కార్యచరణ, ప్రకటించటంతో పాటుగా, పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేస్తారని పార్టీ వర్గాలు అంటున్నారు.
పార్టీ బలోపేతంపై..
జోనల్ సమావేశాల సమావేశాలను నిర్వహించటం ద్వారా పార్టీ నేతుల, కార్యకర్తలను మరింతగా ఉత్సాహపరచటంతో పాటుగా, భవిష్యత్ కార్యచరణపై కూడా చర్చించేందుకు పురంధేశ్వరి రూట్ మ్యాప్ ను రెడీ చేస్తున్నారు. ప్రాంతాల వారీగా ఉన్న అంశాలు, ప్రభుత్వ వైఫల్యాలు, పార్టీని ముందుకు నడిపించేందుకు అవసరం అయిన ఇతర అంశాలను కూడ పరిశీలించిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక రూట్ మ్యాప్ ను రెడీ చేసుకోవాలని నూతన అధ్యక్షురాలుగా బాధ్యతలను చేపట్టిన దగ్గుబాటి పురంధేశ్వరి భావిస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి.
పొత్తుల పై కూడా ఆరా..
ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల అంశం తెర మీదకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే జనసేన పార్టీతో ఉన్న దోస్తితో పాటుగా తెలుగు దేశం పార్టీని కూడా కలుపుకొని ఎన్నికలకు వెళతారని ప్రచారం జరుగుతుంది. ఈ అంశాలపై కూడా పార్టీ నేతల్లో ఇప్పటికే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తెలుగు దేశం పార్టీతో పొత్తు వ్యవహరంపై చాలా మంది వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వారి అభ్యంతరాలకు కారణాలు ఎంటన్న విషయాలను కూడా పురంధేశ్వరి ఆరా తీస్తారని అంటున్నారు. అంతర్గతంగా పార్టీ నేతల అభిప్రాయాలను సేకరించటం తో పాటుగా, ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్దితులు ఎంటి, ఎన్నికల సమయంలో ఎలాంటి వ్యూహాలు ఏంటి, ప్రాంతాల వారీగా ఉన్న పరిస్థితులను గురించి కూడా జోనల్ సమావేశాల వేదికగా నిర్ణయానికి వస్తారని అంటున్నారు.