ఎవరితో కలిసి ఉన్నానో చూడకండీ- చెప్పిన పని చేయకుంటే నిలదీయండీ: పవన్
శాసన సభలో చాలా మంది ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఒక్కరు కూడా నిధుల మళ్లింపుపై బలంగా మాట్లడలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పవన్.
ఎన్ని గొప్ప చట్టాలు సంస్కరణలు తీసుకొచ్చినా ఆచరణలో పెట్టే వ్యక్తికి హృదయం లేనప్పుడు ఎన్ని చట్టాలు చేసినా వృథాయే అన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. దాదాపు 22 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలు ఇప్పటికీ నిధులు కోసం దేహీ అంటూ అడుక్కోవడం బాధాకరమన్నారు. అణగారిన వర్గాలు ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టంలో ఉన్న లోపాలను సవరించి, సబ్‌ప్లాన్ నిధులను దళిత, గిరిజనుల సంక్షేమానికి, అభ్యున్నతికి ఖర్చు చేస్తామని హామీ ఇచ్చారు. బుధవారం ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ వైసీపీ సర్కార్ నిర్లక్ష్యంపై రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించింది జనసేన. ఈ కార్యక్రమంలో దళిత మేధావులు, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘాల నేతలు సబ్ ప్లాన్ నిధుల కేటాయింపులపై జరిగిన అన్యాయంపై మాట్లాడారు.
అందరి సలహా సూచలు విన్న పవన్ కల్యాణ్...ఎంత సేపు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు చేయాలనే కోణంలోనే పోరాటాలు ఉన్నాయి తప్ప అధికారానికి చేరువ అవ్వాలనే ఆలోచన లేదన్నారు. ఆ కోణంలో ఆలోచించనంత వరకు పరిస్థితుల్లో మార్పు రాదని అభిప్రాయపడ్డారు. జనసేన అధికారంలోకి వస్తే మాత్రం ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌ను పారదర్శకంగా అమలు చేస్తామన్నారు. చట్టంలోని లోపాలను సవరించి నిధులు దారి మళ్లకుండా చూస్తామని హామీ ఇచ్చారు.
శాసన సభలో చాలా మంది ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఒక్కరు కూడా నిధుల మళ్లింపుపై బలంగా మాట్లడలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎస్సీలు 16.4 శాతం, ఎస్టీలు 5.3 శాతం ఉన్నారని ఈ రెండూ కలిపి దాదాపు 22 శాతం ఉన్నారని.. అనుకుంటే లక్ష కోట్ల బడ్జెట్‌లో 22వేల కోట్లు వారి సంక్షేమానికి, అభివృద్ధికి ఖర్చు చేయాలి అన్నారు. అలా చేయకపోగా ఈ ప్రభుత్వం 27 సంక్షేమ పథకాలను ఎత్తేశారని విమర్శించారు. ఈ మూడేళ్లలో ఎస్సీలకు 16వేల కోట్లు, ఎస్టీలకు 4 వేల కోట్లు కోత పెట్టారన్నారు. అనవసరంగా 21, 500 కోట్లు ప్రజాధనాన్ని వృథా చేసిన ప్రభుత్వం.. ఆ డబ్బుతో విద్యార్థులకో, ఆత్మహత్య చేసుకున్న అన్నదాతల కుటుంబాలను ఆదుకోవడానికో వినియోగించవచ్చని సూచించారు పవన్ కల్యాణ్.
తాము అధికారంలోకి వస్తే దళితులకు, గిరిజనులకు న్యాయపరంగా అందాల్సిన ప్రతి రూపాయినీ వారికి ఇస్తామన్నారు. ఆగిపోయిన ప్రతి మంచి పథకాన్ని రివైజ్డ్ చేస్తామన్నారు. దామాషా పద్ధతిలో అందాల్సిన సొమ్మును అందజేస్తామన్నారు. జనసేన ఎవరితో పొత్తులో ఉన్నా సరే కచ్చితంగా చెప్పిందే చేస్తుందన్నారు పవన్ కల్యాణ్. ఎవరితో కలిశానో లేదో అన్నది చూడకండీ... కచ్చితంగా మీకు సంబంధించి ఇచ్చిన హామీలను నెరవేర్చాలా బాధ్యత తీసుకుంటాను అన్నారు పవన్. దళిత ఆడపడుచు హోంమంత్రిగా పదవి ఇచ్చి కనీసం హోంగార్డును కూడా బదిలీ చేయలేని విధంగా చేతులు కట్టేసి అన్ని పనులను సకల శాఖ మంత్రితో చేయిస్తున్నరాని విమర్శించారు. చెప్పినవి చేయకపోయినా కచ్చితంగా గట్టిగా అడిగే ధైర్యం ఇస్తామన్నారు. సబ్ ప్లాన్ నిధులు కేటాయింపులు, వినియోగానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి బాధ్యత తీసుకుంటామన్నారు పవన్ కల్యాణ్.