No Chemicals In liquor: మద్యంపై డిస్టలరీల ఓపెన్ ఆఫర్- ఎవరైనా రావచ్చని ఆహ్వానం
ప్రభుత్వం పరీక్షలు జరిపిన తర్వాతే మద్యం అమ్మకాలకు స్టాక్ బయటకు వెళుతుందని తెలిపారు. ఎవరికయినా సరే సందేహం ఉంటే వచ్చి పరీక్షించుకోవచ్చని డిస్టలరీల ఓపెన్ ఆఫర్.
రాజకీయాల కోసం మద్యం అమ్మకాలపై అనవసర రాద్దాంతం చేస్తున్నారని లిక్కర్ వ్యాపారస్తులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. అపోహలు ఉంటే వాటిని తొలగించుకోవాలని సూచించారు. 184 బ్రాండ్ల తయారీ మీద నాలుగు లక్షల మంది ఆధారపడి జీవిస్తున్నారని, అవరమైతే డిస్టిలరీలను పరిశీలించి వాస్తవాలు తెలుసుకోవాలని పిలుపునిచ్చారు. 2017 నుంచి మద్యం వ్యాపారులకు సరైన ధరలు రావటం లేదని ఆవేదన వెలిబుచ్చారు.
విజయవాడలో డిస్టిలరీ యాజమాన్యాలు మీడియాతో మాట్లాడుతూ... కొన్ని బ్రాండ్‌లలో విషపూరితమైన పదార్ధాలు వాడుతున్నట్లు ప్రచారం జరుగుతుందని... ఇదంతా వాస్తవం కాదని చెప్పారు. 2017 నుంచే తమకు సరైన ధరలు రావడం లేదు... ఎవరికైనా సందేహాలు ఉంటే.. తమ వివరణ అడగవచ్చన్నారు. టిడిపి ఆరోపణలు చేసిన విధంగా విష పదార్థాలు లేవన్నారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల రవాణా తాత్కాలికంగా నిలిచిందని పేర్కొన్నారు.
విమ్టా ల్యాబ్ వాళ్లు మాత్రమే లిక్కర్ పరిశీలించి సర్టిఫై చేస్తారని డిస్టలరీ యజమానులు తెలిపారు. ప్రభుత్వం నుంచి అప్రూవల్ వచ్చాకే సరఫరా చేస్తామన్నారు. ప్రభుత్వం పరీక్షలు జరిపిన తర్వాతే మద్యం అమ్మకాలకు స్టాక్ బయటకు వెళుతుందని తెలిపారు. ఎవరికయినా సరే సందేహం ఉంటే వచ్చి పరీక్షించుకోవచ్చని కూడ ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. మూడు దశాబ్దాలుగా ఒక పద్దతి ప్రకారమే ప్రక్రియ నడుస్తుందని, క్వాలిటీ లిక్కర్‌నే తాము అందిస్తున్నామని యజమానులు అంటున్నారు.
ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న వ్యాపారం కాబట్టి నిర్లక్ష్యంతో వ్యవహరించే అవకాశం లేదని తెలిపారు. అందుకే తయారీ నుంచి రవాణా వరకు ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటామని... వినియోదారుల డిమాండ్ బట్టి బ్రాండ్ల సరఫరా ఉంటుందన్నారు. ప్రముఖ బ్రాండ్లు ధర నచ్చకపోతే సరఫరా నిలిపివేస్తుంటారని వివరించారు. ఏయే బ్రాండ్లు పెట్టాలనేది చేసుకున్న ఒప్పందాలను బట్టి ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణాతో పోలిస్తే ఏపీ ప్రభుత్వం తక్కువ ధర ఇస్తుంది, ఇప్పుడు ఇస్తున్న ధరలు తమకు గిట్టుబాటు కావడం లేదని వాపోయారు. ధర పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని వివరించారు.
ఏపీలో మద్యం అమ్మకాల పై రాజకీయ రగడ..
ఏపీలో మద్య నిషేధంపై రాజకీయ రగడ నడుస్తుంది. ప్రభుత్వం మద్య నిషేధం అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత మద్యం ఆదాయంపైనే సంక్షేమ పథకాలకు నిధులు విడుదల చేస్తుందని టీడీపీ ఆరోపిస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మద్య నిషేధం అమలు చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తుంది. అంతే కాదు ప్రభుత్వం సరఫరా చేస్తున్న మద్యంలో ప్రమాదకరమయిన రసాయనాలు వినియోగిస్తున్నారని దీని వలన ప్రజారోగ్యం ప్రశ్నార్దకంగా మారిందని టీడీపీ ఆరోపించింది. ఇటీవల కాలంలో మద్యంలో ప్రమాదకరమయిన రసాయనాలు ఉన్నాయని ల్యాబ్ రిపోర్ట్‌లను బయటపెట్టింది. దీంతొ ఈ వ్యవహరంపై రాజకీయ దుమారం మెదలైంది.
వైసీపీ కూడ ఈ విషయంలో గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. టీడీపీ హయాంలో అమ్మిన బ్రాండ్లే ఇప్పుడు అమ్ముతున్నామని పైగా టీడీపీ ప్రభుత్వం హయాంలో డిస్టలరీకు అనుమతులు ఇచ్చినవే ఇప్పుడు కూడ నడుస్తున్నాయని అంటున్నారు.