నర్సింగ్ విద్యార్థులకు నాలుగేళ్ల వీసాలు ఇవ్వండి- జర్మన్ కాన్సుల్ జనరల్‌కు మంత్రి రజిని రిక్వస్ట్
జర్మన్ కాన్సుల్ జనరల్ మైకేలా కుచ్లర్ తో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
ఆంధ్రపదేశ్ రాష్ట్రంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని భారత్‌లో జర్మన్ కాన్సుల్ జనరల్ మైకేలా కుచ్లర్ తెలిపారు. వైద్య విద్యార్థుల పరస్పర మార్పిడి, వైద్య పరిశోధనలో పరస్పర సహకారానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆమె వెల్లడించారు. జర్మన్ కాన్సుల్ జనరల్ మైకేలా కుచ్లర్ తో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
రజనితో భేటీ అయిన సందర్భంగా కాన్సుల్ జనరల్ కుచ్లర్ మాట్లాడుతూ వైద్య విద్యార్థుల పరస్పర మార్పిడి, వైద్య పరిశోధనలో పరస్పర సహకారానికి తాము సిద్ధంగా ఉన్నామని, ఆ మేరకు ఎంవోయూలు కుదుర్చుకుందామని ప్రతిపాదించారు. భారతీయులు, ముఖ్యమంగా తెలుగువారి మేధాశక్తిపై తమకు ఎంతో నమ్మకం ఉందని చెప్పారు. ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి ఉన్న అవకాశాలను తమతో చర్చిస్తే.. ఆ మేరకు కలిసి ముందుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించారు.
కోవిడ్ సమయంలో భారతదేశం అందించిన తోడ్పాటుకు జర్మనీ ఎప్పుడూ రుణపడి ఉంటుందని తెలిపారు కాన్సుల్ జనరల్ కుచ్లర్. యాంటీబయాటిక్, సర్జికల్ వస్తువులు భారతదేశం నుంచి తొలిసారి దిగుమతి చేసుకున్నామని, ఇప్పటికీ ఈ దిగుమతులు కొనసాగుతున్నాయని వివరించారు. యోగా, ఆయుర్వేదం లాంటి సాంస్కృతిక వైద్య విధానాలను తమ దేశంలో అమలు జరిపేలా, మా వైద్య విధానాలను ఇక్కడ అందుబాటులోకి తీసుకొచ్చేలా అవగాహన ఒప్పందం కుదర్చుకునేందుకు ఏర్పాట్లు చేయాలని కోరారు.
పెట్టుబడులు పెట్టండి...మంత్రి రజని..
తమ రాష్ట్రంలోని విశాఖపట్టణంలో అద్భుతమైన వనరులతో మెడ్‌టెక్ జోన్ ఉందని, జర్మన్ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెడితే ఇరుదేశాలకు మేలు చేకూరుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. వైద్య పరికరాల తయారీలో మెడ్ టెక్ జోన్ ముందువరుసలో ఉందని తెలిపారు. తమ రాష్ట్రంలోని నర్సింగ్ విద్యార్థులు వృత్తి నిర్వహణ కోసం జర్మనీ వెళ్లేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని, ఆ మేరకు వారికి కళాశాలల్లో జర్మన్ లాంగ్వేజ్ కోచింగ్ ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ విషయంలో జర్మనీ దేశ సహకారం కావాలని కోరారు. నర్సింగ్ విద్యార్థులు జర్మనీ వెళ్లాలంటే రెండేళ్ల కాలపరిమితి ఉన్న వీసాలను మాత్రమే జారీ చేస్తున్నారని, ఇది చాలా తక్కువ సమయం అని చెప్పారు. కనీసం నాలుగేళ్ల కాలపరిమితి ఉన్న వీసాలను జారీ చేస్తే తమ విద్యార్థులకు మేలు చేకూరుతుందని వెల్లడించారు. తమ విద్యార్థులు ఏజెన్సీల ఆధారంగా జర్మనీ వస్తున్నారని, అలాంటి ఏజెన్సీలకు జర్మనీ దేశం నుంచి అధికారిక గుర్తింపు ఉండేలా చూస్తే.. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయని కోరారు.
వైద్య పరిశోధనపైనే....
తమ రాష్ట్రంలో వైద్య పరిశోధనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించామని ఇప్పటికే డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీలో వైద్య పరిశోధనకు సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకున్నామని మంత్రి రజని వివరించారు. జర్మనీ దేశ సాంకేతిక సహకారం కూడా తోడైతే వైద్య రంగంలో నూతన ఆవిష్కరణలకు అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు. జర్మనీలో వైద్య రంగంలో మానవ వనరుల కొరత ఉందని, దాన్ని అధిగమించేందుకు భారత్ సహకారం తీసుకుంటామని జర్మన్ కాన్సుల్ జనరల్ కుచ్లర్ మంత్రి విడదల రజినితో అన్నారు.