Buggana Rajendranath Reddy: టీడీపీ హయాంలో అప్పులపై నోరు మెదపరెందుకు పురందేశ్వరి? కాగ్ నివేదిక తప్పా? - మంత్రి బుగ్గన
Buggana Rajendranath Reddy: ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శలు ఎక్కుపెట్టారు. టీడీపీ హయాంలో పెరిగిన అప్పులపై పురందేశ్వరి ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు?
Buggana Rajendranath Reddy: ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శలు ఎక్కుపెట్టారు. గురువారం ఆయన అమరావతిలో మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో పెరిగిన అప్పులపై పురందేశ్వరి ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు? కాగ్ నివేదిక, ఆర్థిక మంత్రి నివేదిక, ఆర్బీఐ నివేదికలన్నీ తప్పంటారా అని పురందేశర్వరిని అడిగారు. టీడీపీ హయాంలో ఇంచు మించు రూ.40 వేల కోట్లు పెండింగ్ బిల్లులున్నాయని వాటి గురించి ఆమె అడగరని, ఇదెక్కడి రాజకీయ నైతికత..? అని ప్రశ్నించారు.
తెలుగుదేశం పార్టీ రోజువారీ షెడ్యూల్‌లో ఏదీ మాట్లాడేందుకు లేనప్పుడు యనమల రామకృష్ణుడు ఆర్థిక అంశాలపై లేఖలు రాస్తుంటారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరిమితికి మించి అప్పు చేయడానికి వీలు కాదనే విషయం యనమలకు కూడా తెలుసునని, కేవలం ప్రభుత్వంపై బురదజల్లేందుకే నోటికొచ్చినట్లు మాట్లాడుతారని విమర్శించారు. టీడీపీ చెబుతున్న రూ.3.72 లక్షల కోట్లు అప్పులు దాదాపు 60 ఏళ్ల కిందటి నుంచి పెరుగుతూ వస్తున్నవే అన్నారు. ఇందులో రూ.2.57 లక్షల కోట్లు టీడీపీ హాయంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చేసినవే అన్నారు.
మేం చేసిన అప్పు రూ.1,36,508 కోట్లు
యనమల రామకృష్ణుని లేఖ ప్రకారం 2018–19 రాష్ట్ర అప్పు రూ.2,57,210 కోట్లు ఉందనుకుంటే, 2021–22 ప్రకారం రూ.3,93,718 కోట్లు అప్పు ఉందన్నారు. అంటే, మూడేళ్లల్లో అప్పు రూ.1,36,508 కోట్లు. ఈ మూడేళ్ల సగటున ఏడాదికి వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పు రూ.45,502 కోట్లు అన్నారు. 2014 నుంచి 2019 వరకు వృద్ధిరేటు 6 శాతంకు పెరిగిందని కానీ వైసీపీ ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో వృద్ధిరేటు 16.7 శాతంగా ఉందని పేర్కొన్నారు.
కోవిడ్ సంక్షోభంలోను రాష్ట్ర ఆదాయ వృద్ధిరేటు ఏమాత్రం తగ్గలేదని, ఇవన్నీ తాము నోటికొచ్చినట్లు చెప్పే లెక్కలు కావని, కాగ్ నివేదికలు, ఆర్థిక వెబ్‌సైబ్‌లలో అధికారికంగా పేర్కొన్న గణాంకాలు అన్నారు. నాన్ గ్యారెంటీ కింద వైసీపీ ప్రభుత్వం రూ.20 వేల కోట్లు మాత్రమే రుణం తీసుకుంది. ఈ గణాంకాల గురించి టీడీపీ నేతలు ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు..?
ఆర్థికపరిస్థితిపై వారివి బేస్ లెస్ ఆరోపణలే
ఆర్థికపరిస్థితిని అంచనా వేయాలంటే స్థూల ఉత్పత్తి, ద్రవ్యలోటు, రెవెన్యూలోటు, వార్షిక వృద్ధిరేటు అనే ఫిజికల్ పారామీటర్స్‌ను బేస్‌గా తీసుకోవాలని మంత్రి బుగ్గన అన్నారు. అయితే, టీడీపీ నేతల ఆరోపణలన్నీ బేస్‌లెస్‌గా.. ఆర్థిక అంశాలపై ఏమాత్రం అవగాహన లేనట్టుగా వారు ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారని, అందుకే వాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకొచ్చినట్లు చెప్పారు.
ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు టీడీపీ కుట్ర
టీడీపీ ఫౌండేషనే ఫిల్మ్ ఫీల్డ్ అని, ప్రతీదీ సినిమా టైటిల్స్ మాదిరిగా, క్యాచీ టైటిల్స్ - ఫిగర్స్ తో, అభూతకల్పనలతో ప్రజల్లో గందరగోళం సృష్టించాలని కోరుకుంటుందని మంత్రి బుగ్గన విమర్శించారు. అందుకే కాగ్ నివేదికను పక్కనబెట్టి రూ.10 లక్షల కోట్లు అప్పు చేశామంటూ క్యాచీ ఫిగర్‌లు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ఫౌండేషన్ చూస్తే.. మాట ఇస్తే.. దాన్ని నెరవేర్చి ప్రజల ముందుకెళ్లడమనేది అందరికీ తెలిసిన విషయం అన్నారు. కులాలు, మతాలకు అతీతంగా సీఎం జగన్ అందరికీ సంక్షేమాభివృద్ధి ఫలాలు అందిస్తున్నారని అన్నారు.
చంద్రబాబు మాటల గారడికి కాలం చెల్లింది
వ్యతిరేకులపై విషప్రచారం చేయడంలో చంద్రబాబు నాయుడు దిట్ట అని మంత్రి విమర్శించారు. ఆయన చెప్పుకునే సెల్‌ఫోన్‌లు, కంప్యూటర్‌లు, ఐటీని నిజానికి ఎవరు కనిపెట్టారో కూడా అందరికీ తెలుసన్నారు. గతంలో అమరావతిలో ఒలింపిక్స్ జరుపుతామన్నారు. నోబెల్ ఫ్రైజ్‌లు తానే ఇస్తానని చెప్పారు. అయితే, ఆయన మాటల్ని అమరావతిలో ఎవరూ నమ్మలేదని, మొన్న గచ్చిబౌలి, డల్లాస్, బెంగుళూరులో వీరంగం చేసిన తమ వాళ్లు మాత్రం కాస్త నమ్మినట్లు వాతావరణం కనిపిస్తుందన్నారు. వాళ్లు కూడా కళ్లు తెరవాల్సిన రోజులొచ్చాయన్నారు.