Guntur MLA Vs Mayor : అభివృద్ధి లేదన్న ఎమ్మెల్యే - చర్చకు సిద్ధమన్న మేయర్ ! ఇద్దరూ వైసీపీ నేతలే
గుంటూరు కార్పొరేషన్ సమావేశంలో మేయర్ , ఎమ్మెల్యే వాగ్వాదానికి దిగారు. ఇరువురి మధ్య రాజకీయ వివాదం ఉండటంతో పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు.
Guntur MLA Vs Mayor : గుంటూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఎమ్మెల్యే ముస్తఫా మేయర్ శివ నాగ మనోహర్ నాయుడు మధ్య బహిరంగంగా మాటల యుద్ధం వెలుగు జరిగింది. గుంటూరు నగరపాలక సంస్థ సమావేశంలో జరిగిన వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు నీ ఉద్దేశించి ఎమ్మెల్యే ముస్తఫా బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీలోనే చర్చకు దారి తీశాయి. నగరపాలక సంస్థ కౌన్సిల్ అధికారిక సమావేశంలో అభివృద్ధి వ్యవహారం పై మొదలైన చర్చలు ఇరువురు అధికార పార్టీ నాయకుల మధ్య మాట మాట పెరగటం వివాదానికి కారణమైంది. మీకు ఓట్లు వేసినందుకు అభివృద్ధి కనిపించడం లేదంటూ శాసనసభ్యుడు ముస్తఫా వ్యాఖ్యలు చేశారు. మేయర్ కూడా ఘాటుగా రిప్లై ఇచ్చారు . చర్చకు సిద్ధమని ప్రశ్నలకు సమాధానం ఇస్తామని వెల్లడించారు.
ఎమ్మెల్యేకు గౌరవం ఇవ్వడం లేదన్న ముస్తఫా
గుంటూరు కార్పొరేషన్ పరిధిలో జరిగే కార్యక్రమాలకు తమకు కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదని శాసన సభ్యుడు ముస్తఫా మండిపడ్డారు. అధికార పార్టీలో ఉన్నామని గౌరవ మర్యాదలు కూడా అడిగి తీసుకోవాల్సిన దౌర్భాగ్యం ఏర్పడిందని శాసనసభ్యుడు ముస్తఫా చేసిన వ్యాఖ్యలపై మనోహర్ తప్పు పట్టారు.. గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ పదేళ్ల తర్వాత జరిగాయి.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నగరపాలక సంస్థకు ఎన్నికలను నిర్వహించారు. ఈ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక కార్పొరేటర్ సీట్లను చేసుకొని గుంటూరు మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. అయితే కార్పొరేషన్ ఎన్నికలు జరిగి అధికార పక్షం పవర్ లోకి వచ్చిన తర్వాత నుండి నాయకుల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి.
మేయర్ వర్సెస్ ఎమ్మెల్యే వివాదాలు
గతంలో కార్పొరేషన్ అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదంటూ ఎమ్మెల్యే ముస్తఫా కార్పొరేషన్ అధికారిక సమావేశంలోనే చిందులు వేశారు. అంతేకాదు నగరపాలక సంస్థ పరిధిలో టౌన్ ప్లానింగ్ అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, తాము చెప్పినా కూడా అనుమతులు ఇవ్వకుండా కాసులకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఎమ్మెల్యే ముస్తఫా కీలకమైన ఆరోపణలు కూడా చేశారు. అంతేకాదు వైసీపీ నుండి గెలుపొందిన కార్పొరేటర్లు తనను కాదని పార్టీలో కొందరు నాయకులు చెప్పినట్లుగా నడవడం, అందుకు మేయర్ కూడా సహకరించడం పై ముస్తఫా అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతుంది.
గతంలో హైకమాండ్ పిలిచి మాట్లాడినా మారని వర్గ పోరు
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో మేయర్ శివకోటి నాగ మనోహర్ నాయుడు పై స్థానిక శాసనసభ్యుడు ముస్తఫా ఆరోపణలు చేయటం అంతర్గతంగా ఉన్న విభేదాలు నేపథ్యంలో ఇలాంటి ఘటనలు బహిరంగంగా వినిపిస్తున్నాయని పార్టీ నాయకుల్లో ప్రచారం జరుగుతుంది. ఈ వ్యవహారం పై గతంలోనే పార్టీ నాయకుల దృష్టికి కూడా తీసుకు వెళ్లినట్లుగా చెబుతున్నారు. గుంటూరు నగరంలో తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఎమ్మెల్యే ముస్తఫా తన ఆవేదనను పార్టీ నాయకుల దృష్టికి కూడా తీసుకు వెళ్లారని అంటున్నారు. పార్టీ నాయకులు కూడా అందరినీ కలుపుకొని వెళ్లాలని సర్ది చెప్పి పంపినట్లుగా ప్రచారం జరుగుతుంది. తన ఆవేదనను సరైన రీతిలో పార్టీ పెద్దలు పట్టించుకోలేదనే అభిప్రాయంతోనే శాసనసభ్యుడు గా ఉండి కూడా బహిరంగ వేదికల పై నే పార్టీ నాయకులను కామెంట్స్ చేస్తున్నారని అంటున్నారు.