AP MLC NEWS: వైసీపీ వీడిన ఎమ్మెల్సీలపై వేటుకు రంగం సిద్ధం, మండలి ఛైర్మన్ మరోసారి నోటీసులు
Mandali Chirmen Noticeses: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ వైసీపీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్సీలు వంశీకృష్ణయాదవ్, సి.రామచంద్రయ్యకు మరోసారి మండలి ఛైర్మన్ నోటీసులు జారీ చేశారు.
MLC NEWS: ఏపీ అసెంబ్లీలో 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయగా...పార్టీ మారిన ఎమ్మెల్సీలపైనా అదే తరహా చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ నుంచి తెలుగుదేశం, జనసేనలో చేరిన వంశీకృష్ణ(Vamsi Krishna) యాదవ్, సి. రామచంద్రయ్య(C.Ramachandraiah)కు మండలి ఛైర్మన్ మరోసారి నోటీసులు పంపడం చూస్తుంటే వేటు తప్పదనిపిస్తోంది.
వేటుతప్పదా..!
ఎన్నికల వేళ నేతలు పార్టీలు మారడం సర్వసహజం. సాధారణంగా ప్రతిపక్షం నుంచి అధికారపార్టీలోకి వలసలు పెరుగుతాయి. కానీ ఏపీలో జగన్(Jagan) కు ఎదురుగాలి తప్పదని సర్వేలు చెబుతున్న నేపథ్యంలో పెద్దఎత్తున వైసీపీ(YCP) నుంచి తెలుగుదేశం(TDP)-జనసేన(Janasena) కూటమిలోకి వలసబాట పట్టారు. దీనికి తోడు ఎమ్మెల్యే ట్రాన్స్ ఫర్ వంటి వినూత్న పథకాన్ని సీఎం జగన్ ప్రవేశపెట్టడంతో చాలామంది నేతలు ముందే మేల్కొన్నారు. నియోజకవర్గాన్ని, నమ్ముకున్న వర్గాన్ని వీడటం ఇష్టం లేక...వైసీపీనే వీడారు. అలాంటి వారిలో ఎమ్మెల్యేలు, ఎంపీలేగాక ఎమ్మెల్సీలు ఉన్నారు. జగన్(Jagan) తీరుతో విభేదించి ఇటీవలే ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలు వంశీకృష్ణ(Vamsi Krishna) యాదవ్, సి. రామచంద్రయ్య ఆ పార్టీని వీడారు. దీంతో వారిపై అనర్హత వేటు వేయాల్సిందిగా వైసీపీ మండలి ఛైర్మన్ మోషేన్ రాజుకు ఫిర్యాదు ఇవ్వడంతో గతంలో ఒకసారి నోటీసు పంపారు. ఇప్పడు మరోసారి నోటీసులు పంపారు. తుది విచారణకు ఈనెల 5న హాజరుకావాలని ఆదేశారు. రెండోసారి కూడా నోటీసు పంపడం చూస్తే...వీరిద్దరిపైనా వేటు వేయడం ఖాయమని సమాచారం
8 మంది ఎమ్మెల్యేలపై వేటు
ఇప్పటికే పార్టీ మారిన 8 మంది ఎమ్మెల్యేలపై శాసనసభాపతి వేటు వేశారు. పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవికి నోటీసులిచ్చిన సభాపతి తమ్మినేని సీతారాం.. ఆతర్వాత వారిపై అనర్హత వేటు వేశారు. వైసీపీ ఫిర్యాదు ప్రతీగా తెలుగుదేశం సైతం నలుగురు ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసింది. వైసీపీలో చేరిన కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేశ్, మద్దాలిగిరిపై ఫిర్యాదు చేయగా..సభాపతి వారిపైనా వేటు వేశారు. దీంతో వీరి సభ్యత్వం రద్దయ్యింది. ఇప్పుడు మండలి సభ్యులకూ నోటీసులు ఇవ్వడం చూస్తుంటే...ఖచ్చితంగా వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది. జగన్ ఎంత కఠిన చర్యలు తీసుకున్నా...తెలుగుదేశంలోకి వలసలు ఆగడం లేదు.
తాజాగా మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, నరసరాపుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు సైతం తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత తాము తెలుగుదేశంలో చేరామని వారు చెబుతున్నారు. జగన్ బెదిరింపులకు భయపడేది లేదని హెచ్చరించారు. జగన్ పాలనకు ఇంకా కేవలం నెలరోజులు సమయం మాత్రమే ఉందని... ఆ తర్వాత తప్పకుండా తెలుగుదేశం-జనసేన కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే వసంత కృష్ణప్రసాద్, లావు శ్రీకృష్ణదేవరాయులపై జగన్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.