వైసీపీ నేతలు దాడులు చేసినా కేసులుండవు- ప్రతిపక్షాలే టార్గెట్
భయపెట్టి రాజకీయం చేయాలని వైసీపీ లీడర్లు చూస్తున్నారని ఆరోపించారు పవన్. అందుకే అడ్డూఅదుపూ లేకుండా బూతులు తిడతారని... ఇంట్లో వాళ్లపై నోరేసుకొని పడిపోతారని విమర్శించారు.
భారత దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఏపీలో జరుగుతోందన్నారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్. ఇక్కడ అధికా పక్షం వాళ్లు దాడులు చేసినా బూతులు తిట్టినా కేసులు ఉండవని... ప్రజల తరఫున ఎవరు మాట్లాడినా హత్యాయత్నం కేసులు పెడతారన్నారు. ఇది ఇంకా ఎన్నాళ్లో సాగదని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.
ఉత్తరాంధ్రలో జనాల సమస్యలు తెలుసుకునేందుకు జనవాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామే తప్ప వైసీపీ చేపట్టే గర్జనకు వ్యతిరేకంగా కాదన్నారు. అసలు గర్జన కార్యక్రమం ప్రకటించక ముందే తాము టికెట్లు బుక్ చేసుకున్నామని తెలిపారు పవన్. భారీ మెజారిటీ ఇచ్చి పాలన చేయమంటే... ప్రజల సమస్యలు తీర్చకుండా గర్జన పేరుతో టైం పాస్ చేస్తున్నారని విమర్శించారు. తాము మొదటి నుంచి చెప్పినట్టు ఎక్కడా వ్యక్తిగత విమర్శలు లేకుండా.. నిర్మాణాత్మమైన విమర్శలు మాత్రమే చేస్తున్నామన్నారు.
అమరావతి రైతుల గురించి ఎవరూ మాట్లాడుకోకూడదన్న లక్ష్యంతోనే వైఎస్‌ఆర్‌సీపీ రకరకాల ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు పవన్. పొలిటికల్‌గా తాము ఓ స్టాండ్ తీసుకున్నామని... అమరావతి రైతులకు అండగా ఉండాలన్నదే తమ పార్టీ విధానమని తెలిపారు. వైసీపీలా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా... అధికారంలోకి వచ్చాక మరోలా మాట్లాడటం లేదన్నారు. అంత దిగజారుడు ఆలోచన విధానం తమకు లేదన్నారు పవన్.
ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్న మూడు రాజధానులపై ప్రజలు స్పందించడం లేదనే వైసీపీ లీడర్ల బాధని అందుకే కొత్త ఎత్తుగడలతో హింసాత్మక రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు పవన్. మంచి పాలన చేయాల్సిన వాళ్లు గొడవ పెడుతున్నారన్నారు. ఏపీలో ప్రభుత్వమే లా ఆండ్ ఆర్డర్‌ను దెబ్బతీస్తుందని ఆరోపించారు. కోనసీమ ఘటనే అందుకు ఉదాహరణగా చెప్పుకొచ్చారు. ఇలాంటి హింసాత్మకమైన గొడవలు తాము చేయలేమని అన్నారు.
భయపెట్టి రాజకీయం చేయాలని వైసీపీ లీడర్లు చూస్తున్నారని ఆరోపించారు పవన్. అందుకే అడ్డూఅదుపూ లేకుండా బూతులు తిడతారని... ఇంట్లో వాళ్లపై నోరేసుకొని పడిపోతారని విమర్శించారు. ఇలా భయభ్రాంతులకు గురి చేస్తే ఎవరూ నోరు ఎత్తరని వాళ్లు ప్లాన్‌గా చెప్పుకొచ్చారు పవన్. ఇలాంటి ఉడత ఊపులకు బెదిరింపులకు తాను, జనసేన భయపడేది లేదన్నారు.
వైజాగ్‌లో కూడా కోనసీమ తరహా గొడవలకు ప్లాన్ చేశారని ఆరోపించారు పవన్. అప్పుడు కూడా వాళ్ల మంత్రి ఇంటిపై వైసీపీ వాళ్లే దాడి చేసుకొని... జనసేనపై నెట్టే ప్రయత్నం చేశారన్నారు. విశాఖలో కూడా అదే తరహా స్కెచ్ వేశారన్నారు. మంత్రులు, టీటీడీ ఛైర్మన్, వైసీపీ లీడర్లు వెళ్తుంటే పోలీసులు ఏం చేశారని ప్రశ్నించారు. ఎయిర్‌పోర్టులోకి సామాన్యుడు వెళ్లి కోడికత్తితో ఎలా దాడి చేశాడో ఇప్పటికీ చెప్పలేదు. అలానే ఇప్పుడు కూడా చేద్దామనుకున్నారన్నారు. వెతికితే వీళ్ల మనుషులే ఎవరో ఆ గుంపులో దొరుకుతారు అన్నారు. లేదా మంత్రులు, వైసీపీ లీడర్లే రెచ్చగొట్టేలా మాట్లాడి ఉంటారన్నారు. ఆ టైంలో పోలీసులు కూడా ఎవరూ లేరు. అంటే కావాలని ఇదంతా ప్లాన్ చేశారన్నారు.
ఇంత జరిగితే కేసులు పెట్టిన తీరు చూస్తే ఆశ్చర్యం కలుగుతుందన్నారు పవన్. తాను వచ్చే సభకు అనుమతి ఇవ్వాలని కోరుతూ దరఖాస్తు చేసిన వారిపై కేసులు పెట్టారన్నారు. 107 మందిపై కేసులు పెట్టారని... భారత దేశ చరిత్రలో ఇలాంటి కేసులు లేవన్నారు. వైసీపీ వాళ్లు ఇష్టారాజ్యంగా తిడితే కేసులు ఉండవని... ఇళ్లపై దాడులు చేసినా కేసులు ఉండవన్నారు. పార్టీ ఆఫీస్‌లపైకి వెళ్లినా కేసులు లేవన్నారు. అప్పట్లో డీజీపీ మాట్లాడుతూ... భావస్వేచ్చ అంటూ చెప్పుకొచ్చారని... వైసీపీ వాళ్లు రాళ్లు వేస్తే భావ స్వేచ్చ అని మిగతా గొంతు ఎత్తితే అన్ని సెక్షన్లు పని చేస్తాయన్నారు.