త్వరలో పెడనలో పవన్ పర్యటన- కేసులు ఎదుర్కొంటున్న జనసైనికులకు భరోసా!
ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, అక్రమాలపై పోరాటం చేసే జనసైనికులకు తాను అండగా ఉంటానని పవన్ హామీ ఇచ్చారు. అవసరం అయితే తాను కూడా పెడనలో పర్యటిస్తానన్నారు.
పెడనలో పోస్టర్ రాజకీయంపై జనసేన అధినేత ఆరా తీశారు. జనసేన నేతలపై నియోజకవర్గ శాసన సభ్యుడు, మంత్రి జోగి రమేష్ అక్రమంగా కేసులు బనాయించి, పోలీసులు ముందే దాడికి పాల్పడిన వైనంపై పవన్‌కు పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ నేతల బెదిరింపులను ధైర్యంగా ఎదుర్కొన్న నేతలను అభినందించిన పవన్... వైసీపీ ఆగడాలపై పోరాటం సాగిస్తామని అన్నారు.
పెడనలో వైసీపీ, జనసేన పోటా పోటీ....
పెడన నియోజకవర్గంలో వైసీపీ నేతల అక్రమాలపై జనసేన నేతలు ఇటీవల కాలంలో పోరాటం చేపట్టారు. మంత్రి జోగి రమేష్ నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా స్థానిక నేతలకు పెత్తనం అప్పగించారని జనసేన ఆరోపిస్తోంది. దోచుకునేందుకు ప్రధాన్యత ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రి జోగి రమేష్‌కు వ్యతిరేకంగా ఏకంగా గ్రామాల్లో పోస్టర్లతో ఉద్యమాన్ని చేపట్టింది. అయితే ఈ వ్యవహరంపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన నేతలతో వాగ్వాదానికి దిగారు. స్థానికంగా ఈ వ్యవహరం ఉద్రిక్తతలకు దారితీసింది.
పోస్టర్ల ఉద్యం చేస్తున్న జనసేన నేతలపై వైసీపీ నేతలు దాడులకు దిగారు. పోలీస్ స్టేషన్‌లోనే పోలీసులు ముందే జనసేన నేతలపై దాడి చేశారు. దీంతో జనసేన నేతలు పోలీసులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీకి చెందిన నేతలకు పోలీసుల వత్తాసు పలుకుతున్నారంటూ పెడనలో ఆందోళన నిర్వహించారు. అయితే వైసీపీ నేతలపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికి పట్టించుకోకపోటంతో జనసేన నేతలు ఆందోళనలకు పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు జనసేన నేతలను అరెస్ట్‌లు చేశారు.
మంత్రి జోగి ఇలాఖాలో...
జనసేన, వైసీపీ నేతల మధ్య వివాదం నడుస్తున్న టైంలోనే మంత్రి జోగి రమేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న పెడన నియోజకవర్గంలో సీఎం కటౌట్‌కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. జోగి రమేష్‌కు వ్యతిరేకంగా ప్రభుత్వం అవినీతి పేరుతో రాత్రికి రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్లు అంటించటం... ఆపై సీఎం కటౌట్‌ను కాల్చేయటం వంటి చర్యలతో పెడనలో అలజడి రేగింది. అధికార పార్టీ ఎమ్మెల్యే అందులోనూ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్న జోగి రమేష్ నియోజకవర్గంలో జనసేన నేతలు ఉద్యమం చేయడాన్ని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోయారు. ఈ వ్యవహరం రాజకీయంగా కూడా హాట్ టాపిక్ కావటంతో, రాజకీయ వర్గాల్లో చర్చనీయాశంగా మారింది.
పవన్‌తో పెడన నేతలు భేటీ...
ఈ పరిణాలపై జనసేన అధినేత పవన్‌తో పెడన నియోజకవర్గ నేతలు సమావేశం అయ్యారు. పెడనలో అధికార పార్టీ చేస్తున్న అరాచకాలు, అవినీతి, మంత్రి జోగి రమేష్ ఒత్తిడితో పోలీసులు పెట్టిన కేసులు ఆయనకు వివరించారు. వేధింపులకు సంబంధిచిన అంశాలను అధినేత వద్ద జనసైనికులు ప్రస్తావించారు. నియోజకవర్గంలో పరిస్థితులు, రాజకీయంగా ఉన్న పరిణామాలను గురించి కూడా పవన్ ఆరా తీశారు.
పెడన నియోజకవర్గానికి మంత్రి జోగి రమేష్ విజిటింగ్ ప్రోఫెసర్‌గా మారారని.. మైలవరం పైనే ఎక్కువ శ్రద్ద చూపిస్తున్నారని స్థానిక నేతలు పవన్‌కు వివరించారు. జగన్ మెప్పు కోసం జోగి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని... జనసేన నేతలపై కేసులు పెట్టి బెదిరింపులకు దిగుతున్నారని పవన్‌కు తెలిపారు. ఈ విషయంలో పోరాటం చేయాల్సిన అసవరం ఉందని జనసైనికులు అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, అక్రమాలపై పోరాటం చేసే జనసైనికులకు తాను అండగా ఉంటానని పవన్ హామీ ఇచ్చారు. అవసరం అయితే తాను కూడా స్థానికంగా పర్యటించి, జనసేన క్యాడర్‌కు భరోసా ఇస్తానని వపన్ నియోజకవర్గ నేతలు తెలిపారు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు పవన్ కల్యాణ్.