టార్గెట్ లోకేష్ వ్యూహంలో వైఎస్‌ఆర్‌సీపీ విజయం సాధిస్తుందా?
మంగళగిరిలో లోకేష్‌ను ఒంటరి చేసే వ్యూహంలో వైఎస్ఆర్‌సీపీ సక్సెస్ అవుతోందా ? సీనియర్ నేతలంతా ఎందుకు గుడ్ బై చెబుతున్నారు ?
YSRCP Mangalagiri : మంగళగిరి నియోజకవర్గంపై తెలుగుదేశం పార్టీ నేత లోకేష్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఓడిపోయినప్పటి నుంచి ఆయన ఆ నియోజకవర్గంలోనే పని చేస్తున్నారు. సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. గెలవడానికి ఏం చేయాలో అన్నీ చేస్తున్నారు. అయితే వైఎస్ఆర్‌సీపీ మంగళగిరి నియోజకవర్గాన్ని అలా వదిలేయలేదు. తాము చేయాలనుకున్నది తాము చేస్తోంది. నియోజకవర్గంలో టీడీపీ కీలక నేతలపై గురిపెట్టి తమ పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా గంజి చిరంజీవి వ్యవహారం కూడా అధికార పార్టీ వేసిన ఎత్తుగడలో భాగమే అన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది. 2014 ఎన్నికల్లో పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయిన గంజి చిరంజీవి తీవ్రమైన ఆరోపణలు చేస్తూ పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఆయన వైఎస్ఆర్‌సీపీలో చేరడం లాంఛనమేనని సన్నిహితులు చెబుతున్నారు.
లోకేష్‌కు వ్యతిరేకంగా బీసీ నినాదం తెస్తున్న వైఎస్ఆర్‌సీపీ !
గత ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి అనూహ్యంగా తెర మీదకు వచ్చిన లోకేష్ అంతే స్థాయిలో అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఓటమి పాలయ్యారు. ఇక్కడ వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా ఆళ్ళ రామకృష్ణారెడ్డి రెండోసారి విజయం సాధించారు. ఆళ్ళ రామకృష్ణారెడ్డికి 1,08,464 ఓట్లు పోలవగా, లోకేష్‌కు 1,03,127 ఓట్లు పోలయ్యాయి. దాదాపుగా 5,337 ఓట్లతో లోకేష్ పరాజయం చవిచూడాల్సి వచ్చింది. 2014 ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి కేవలం 12ఓట్ల మెజార్టితో మాత్రమే సమీప టీడీపీ అభ్యర్ది గంజి చిరంజీవిపై విజయం సాధించారు. అదే 2019 ఎన్నికల్లో లోకేష్ పోటీ చేస్తే, ఎకంగా 5వేలకుపైగా మెజార్టి వచ్చింది. బీసీల పార్టీగా చెప్పుకునే టీడీపీ ఆఖరి నిమిషంలో లోకేష్‌ను తెర మీదకు తెచ్చి అప్పటి వరకు పార్టీ కోసం పని చేసిన పద్మశాలీ సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవిని పక్కకు పెట్టింది. దీంతో బీసీ వర్గాల్లో వ్యతిరేక ప్రచారం జరిగింది.
లోకేష్ దృష్టి పెట్టడంతో ప్రతి వ్యూహం రెడీ చేసిన వైఎస్ఆర్‌సీపీ !
2019 ఎన్నికల తరువాత చాలా మంది నాయకులు పార్టీని వీడారు. అయితే లోకేష్ చరిష్మా ముందు అవేమి పెద్దగా తెర మీదకు రాలేదు. ఎన్నికల తరువాత టీడీపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల వైసీపీలో చేరారు. ఆ తరువాత మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు కూడ టీడీపీని వీడి, వైసీపీలో చేరటంతో ఆయనకు ఎమ్మెల్సీ పదవి కూడ దక్కింది. మెదటి నుంచి పార్టీ వెంట ఉన్న గంజి చిరంజీవి తాజాగా బయటకు వచ్చారు. తాను ఏ పరిస్థితుల్లో బయటకు రావాల్సి వచ్చిందో నాయకులు అందరికి తెలుసని, సదరు నాయకుల పేర్లను తాను చెప్పనని కూడా చిరంజీవి ఆవేదన వెల్లబుచ్చారు.
గంజి చిరంజీవికి వైఎస్ఆర్‌సీపీ బంపర్ ఆఫర్ ?
టీడీపీలో అత్యంత కీలకంగా వ్యవహరించిన నాయకుడుగా ఉన్న చిరంజీవి పార్టీ అధికారంలో ఉండగా పదవులను కూడా దక్కించుకున్నారు. మున్సిపల్ ఛైర్మన్ పదవి రేసులో నుంచి ఎకంగా శాసన సభ్యుత్వానికి పోటీ చేశారు. అయితే అత్యంత తక్కువగా 12 ఓట్లతో గంజి చిరంజీవి ఓటమి పాలయ్యారు. ఆ తరువాత కూడా పార్టీలో చిరంజీవికి పదవులు దక్కాయి. రాష్ట్ర అధికార ప్రతినిధిగా బాధ్యతలు కట్టబెట్టారు. 2019 ఎన్నికలకు లోకేష్ తెర మీదకు రావటంతో చిరంజీవి అలకపాన్పు ఎక్కారు. అప్పుడు కూడ లోకేష్ చిరంజీవి ఇంటికి వెళ్ళి మరి సర్ది చెప్పారు. చిరంజీవి రాజకీయ బాధ్యత చూసుకుంటానని భరోసా ఇచ్చారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే అది సాధ్యం కాకపోవటంతో అప్పటి నుంచి చిరంజీవి అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ నుంచి అనూహ్యమైన ఆఫర్ రావడంతో ఆయన టీడీపీపై తీవ్ర ఆరోపణలు చేసి గుడ్ బై చెప్పారని అంటున్నారు.