CRDA: అమరావతి ప్రాంతాల్లో భారీగా అక్రమ లే అవుట్లు, ప్లాట్లుగా మారిన పంట పొలాలు
Andhra Pradesh : రాజధాని అమరావతి ప్రాంతంలో భారీగా అక్రమ లేఅవుట్లను వేశారు. వీటిపై దృష్టి సారించిన సిఆర్డిఏ అధికారులు తొలగిస్తున్నారు. అక్రమ లేఅవుట్ల కొనుగోళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు.
Huge Illegal Layouts In Amaravati: ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో పుట్టగొడుగుల్లా పుట్టుకు వచ్చిన అక్రమ లే అవుట్లపై అధికారులు దృష్టి సారించారు. సీఆర్‌డీఏ అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన అక్రమ లే అవుట్లను అధికారులు తొలగిస్తున్నారు. అనుమతి లేకుండా వెలిసిన ఈ లే అవుట్లపై అధికారులు చర్యలు చేపట్టారు. తాడికొండ పరిసరాల్లో ఈ తరహా లే అవుట్లు అధికంగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. అనేక మంది పంట పొలాలనే వ్యాపారం కోసం లే అవుట్లుగా మార్చేశారు. ఇటువంటి వాటిని గుర్తించిన అధికారులు చుట్టూ ఏర్పాటు చేసిన కంచెలను తొలగిస్తున్నారు. సీఆర్‌డీఏ అనుమతి లేకుండా, ఇతర పన్నులు చెల్లించకుండా ఏర్పాటైన లే అవుట్ల పరిసరాల్లో ఉన్న రోడ్లను అధికారులు తొలగిస్తున్నారు. పలు చోట్ల కంచె రాళ్లను కూడా అధికారులు దగ్గరుండి తొలగించేలా చేశారు.
భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పవని హెచ్చరిక
ఈ తరహా ప్లాట్లు కొనుగోలు చేసేవాళ్లు భవిష్యత్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని సీఆర్‌డీఏ అధికారులు చెబుతున్నారు. సీఆర్‌డీఏ అనుమతి లేకుండా లే అవుట్లు వేసిన వాళ్లు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. వ్యవసాయ భూములను చాలా మంది లే అవుట్లుగా మారుస్తున్నారని, వీటి విషయంలో కొనుగోలుదారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. తక్కువ ధర, ఇతర బెనిఫిట్స్ ఆశ చూపించి సీఆర్‌డీఏ అనుమతి లేకుండా లే అవుట్లు కొనుగోలు చేసేవాళ్లుకు సాంకేతికంగా అనేక ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరించారు. లే అవుట్లు వేసే వ్యాపారులపైనా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అధికారులు ఈ తరహా లే అవుట్లును గుర్తించి ప్రొక్లెయిన్లు, ఇతర వాహనాలతో వాటిని తొలగించారు.
రాజధాని పనుల్లో పెరిగిన వేగం
కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత రాజధాని అమరావతి పనుల్లో కదలికి వచ్చింది. ప్రభుత్వం కూడా రాజధాని పూర్తి చేయడానికి తొలి ప్రాధాన్యతనిచ్చింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా రూ.15 వేల కోట్లు ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ఆర్థిక సంస్థలు, బ్యాంకుల నుంచి అప్పుగా సేకరించి ఏపీకి ఇవ్వనున్నారు. ఇది కూడా రాజధాని వేగ వంతంగా పూర్తయ్యేందుకు దోహదం చేస్తుంది. అలాగే, రాజధాని ప్రాంతాన్ని గడిచిన ఐదేళ్లు పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతోపాటు సీఆర్‌డీఏ పరిధిలో పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. అనేక భవనాలు దారుణంగా తయారయ్యాయి. వీటిపై దృష్టి సారించిన ప్రభుత్వం పచ్చి మొక్కలను తొలగించే పనులను జోరుగా చేపట్టింది. అలాగే, రోడ్లకు ఇరువైపులా పెరిగిన చెట్లు, పూడికుపోయిన రోడ్లు, ఇతర మార్గాలను క్లీన్ చేయించారు. లైటింగ్ సిస్టమ్‌ను మెరుగుపర్చారు. అనేక భవనాల్లో మౌలిక వసతుల కల్పన పనులను ప్రారంభించారు. నిర్మాణ పనులు క్రమంగా ప్రారంభమవుతున్నాయి.