Vizag News: భీమిలీ బీచ్‌లో కట్టడాల కూల్చివేతపై స్టేటస్‌కో ఇవ్వలేం- విజయసాయిరెడ్డి కుమార్తెకు తేల్చి చెప్పిన కోర్టు
Andhra Pradesh: భీమిలి బీచ్‌లో కట్టడాల కూల్చివేతపై స్టేటస్‌కో ఇవ్వలేం విజయసాయిరెడ్డి కుమార్తెకు హైకోర్టు తేల్చి చెప్పేసింది. సుప్రీంకోర్టు తీర్పు అమల్లో ఉన్నందున జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.
YSRCP MP Vijaya Sai Reddy: విశాఖ జిల్లా భీమిలి వద్ద నిర్మించే కట్టడాల విషయంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డికి హైకోర్టులో ఊరట లభించలేదు. సుప్రీంకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు అమల్లో ఉన్నందున మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని సింగిల్ బెంచ్ తేల్చి చెప్పింది. భీమిలి బీచ్ వద్ద ఓ కట్టడాన్ని నేహా రెడ్డి నిర్మిస్తున్నారు. ఇది అక్రమ కట్టడమని నిబంధనలు విరుద్దంగా ఉందంటూ జనసేన నేత మూర్తియాదవ్ కోర్టును ఆశ్రయించారు.
కోస్టల్ రెగ్యులేషన్ జోన్ పరిధిలో శాశ్వత కట్టడాలకు అనుమతి లేదని కానీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహా రెడ్డి మాత్రం రూల్స్ అతిక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని గతంలోనే మూర్తి యాదవ్ కోర్టులో కేసు వేశారు. సుప్రీంకోర్టు వరకు వెళ్లిన ఈ కేసులో సీజే నేతృత్వంలో ధర్మాసనం కీలక తీర్పు వెల్లడించింది. వెంటనే నిర్మాణాలు నిలుపుదల చేయాలని, యంత్రాలు సీజ్ చేయాలని తీర్పులో పేర్కొన్నారు. అంతేకాకుండా ఇలాంటి కట్టాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా అధికారులను ఆదేశించారు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆ ప్రాంతంలో ఉన్న ప్రహరీగోడ కూల్చివేతకు విశాఖ జీవీఎంసీ అధికారులు ఈ నెల 18న ఉత్తర్వులు జారీచేశారు. దీన్ని సవాల్ చేస్తూ నేహారెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. అక్కడ ఆమెకు ప్రతికూల తీర్పు వచ్చింది. అవసరమైతే సుప్రీంకోర్టులో ఉన్న కేసులో ఇంప్లీడ్ అవ్వొచ్చని సింగిల్ జడ్జి సూచించారు.
ఈ కేసులోనే సీజే బెంచ్‌లో కూడా విచారణలో ఉన్నందున క్లారిఫికేషన్ కోసం ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టులో పిల్‌కు జత చేసి పంపించారు. రెండింటినీ సీజే బెంచ్ విచారించింది. అంటే మూర్తియాదవ్ పిటిషన్‌తోపాటు నేహారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై కూడా విచారణ చేపట్టింది. నేహారెడ్డి వేసిన పిటిషన్‌పై హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చి తీర్పు సరైనదేనని స్పష్టం చేసింది. వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జికి పంపించింది సీజే బెంచ్. దీనిపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి. కృష్ణమోహన్ సోమవారం విచారణ జరిపారు.
విచారణ చేసిన సింగిల్ బెంచ్ జడ్జి... బీచ్‌కు సమీపంలో నిర్మిస్తున్న కట్టడాలు కూల్చివేతపై స్టేటస్‌కో ఇవ్వలేమని తేల్చేశారు. ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులివ్వలేమని తేల్చిచెప్పింది. సీజే ధర్మాసనం ఇచ్చిన తీర్పు అమల్లో ఉన్నంత కాలం తాము జోక్యం చేసుకోలేమని పేర్కొంది. ఈ పిటిషన్‌లో విశాఖ జనసేన కార్పొరేటర్ మూర్తియాదవ్ ప్రతివాదిగా చేర్చేందుకు మాత్రం అనుమతి ఇచ్చింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆయనకు నోటీసులు పంపించింది. తదుపరి విచారణ వారం రోజులపాటు వాయిదా వేస్తున్నట్టు పేర్కొంది.