(Source: ECI/ABP News/ABP Majha)
Venkaiah Naidu: ఈ రాజకీయాలు చూస్తుంటే చీదర వేస్తుంది - వెంకయ్య నాయుడు సంచలనం
రాబోయే ఎన్నికల్లో మహనీయులను ఎన్నుకోవాలని వెంకయ్య నాయుడు సూచించారు. గుంటూరులో డాక్టర్ కాసరనేని సదాశివరావు శత జయంతి వేడుకల్లో వెంకయ్య నాయుడు పాల్గొన్నారు.
ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అసహనపూరితంగా వ్యాఖ్యలు చేశారు. అసలు ఇప్పటి రాజకీయాలు చూస్తుంటే చీదర వేస్తుందని అన్నారు. ప్రజలు ఆలోచించాలని, మనం ఏం చేయలేం అని అనుకోకుండా అందరూ కలిసి చెడును కడిగేయాలని పిలుపు ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో మహనీయులను ఎన్నుకోవాలని సూచించారు. గుంటూరులో డాక్టర్ కాసరనేని సదాశివరావు శత జయంతి వేడుకల్లో వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఆయన వెంట మాజీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు, తదితరులు కూడా ఉన్నారు.
చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలని పిలుపు ఇచ్చారు. కాసరనేని సదాశివరావు లాంటి డాక్టర్ లు ప్రజా సేవకొసమే వైద్య వృత్తిలో కొనసాగారని అన్నారు. రాజకీయాల్లో కూడా సదా శివరావు తనదైన శైలిలో సామాన్యులకు అందుబాటులో ఉన్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రైవేటు ఆస్పత్రుల్లో ఫీజులు మాత్రమే పరమావధిగా వైద్యం చేస్తున్నారనే అపవాదు ఉందని అన్నారు. దాని నుంచి వైద్య రంగం బయట పడాలని ఆకాంక్షించారు.
ప్రస్తుతం కులం డబ్బులు అండతో క్రిమినల్స్ రాజకీయాల్లో ఉన్నారని.. బూతులు మాట్లాడుతున్న రాజకీయ నాయకులకు పోలింగ్ బూత్ లో సమాధానం చెప్పాలని అన్నారు. చట్ట సభలు ప్రజలకు మేలు చేసే దేవాలయాలని.. వాటిని ప్రతీకారం తీర్చుకోవడం కోసం వాడుకోకూడదని అన్నారు. రాజకీయ నాయకులకు కులం చూసి కాకుండా గుణం చూసి ఓటు వేయాలని సూచించారు. వైద్య, విద్యా, రాజకీయ రంగాలలో విశేష ప్రతిభ కలిగిన పలువురికి మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సేవ పురస్కారాలను అందించారు.
‘‘సమాజాన్ని బాగా ప్రభావితం చేసేవారిలో ప్రముఖంగా రాజకీయనాయకులు, అధ్యాపకులు, వైద్యులు ఉంటారు. ఈ మూడు రంగాల్లోనూ ఎంతో ప్రజ్ఞా పాటవాలతో, మచ్చలేని జీవితాన్ని గడిపిన శ్రీ కాసరనేని సదాశివరావుగారు మనిషిగా తన జీవితాన్ని సార్థకం చేసుకున్నారు. సర్వేజనాసుఖినోభవంతు, వసుధైక కుటుంబకం స్ఫూర్తితో తోటి మానవులకు అండగా ఉండాలి. శ్రీ సదాశివరావు గారి జీవితాన్ని నేటి తరం ప్రేరణగా తీసుకుని సమాజహితం కోసం పని చేయాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని వెంకయ్య నాయుడు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.