![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Andhra Pradesh News:వైసీపీకి షాక్ ఇచ్చిన యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్- ఏపీలో కూటమి తరపున ప్రచారం!
Telugu News: ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ వైసీపీకి షాక్ ఇచ్చారు. ఏపీలో కూటమికి మద్దతుగా ప్రచారానికి సిద్ధం అవుతున్నారు.
![Andhra Pradesh News:వైసీపీకి షాక్ ఇచ్చిన యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్- ఏపీలో కూటమి తరపున ప్రచారం! Former MP Yaragadla laksmiprasad is going to campaign for the NDA in AP elections 2024 Andhra Pradesh News:వైసీపీకి షాక్ ఇచ్చిన యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్- ఏపీలో కూటమి తరపున ప్రచారం!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/08/0bad434ae992136de2cbbdbcaab2f17f1715152598927930_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Yarlagadda Lakshmi Prasad : వైసీపీకి విశ్వహిందీ పరిషత్ అధ్యక్షుడు, మాజీ ఎంపీ యార్లగడ్ల లక్ష్మీ ప్రసాద్ షాక్ ఇచ్చారు. మొన్నటి వరకు అధికార భాష సంఘ అధ్యక్షుడిగా ఉన్న ఆయన ఏపీలో కూటమికి మద్ధతుగా ప్రచారానికి సిద్ధమవుతున్నారు. తెలుగుదేశం పార్టీతో విభేదించిన ఆయన వైసీపీతో సన్నిహితంగా ఉంటూ వచ్చారు. గడిచిన ఎన్నికల్లో వైసీపీ విజయానికి తన వంతుగా ఆయన కృషి చేశారు. అయితే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం ఆయన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి మద్ధతుగా ప్రచారాన్ని చేయనున్నారు. ఈ మేరకు ఆయన పలు నియోజకవర్గాల్లో ప్రచారం చేయడానికి సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదల చేశారు.
హిందీతోపాటు భారతీయ భాషలు అభివృద్ధికి అండగా నిలుస్తానని ప్రధాని మోదీ భరోసా ఇచ్చినందునే ఎన్‌డీఏ కూటమికి విశ్వహిందీ పరిషత్ సంపూర్ణ సహకారాన్ని అందించేందుకు సిద్ధమైనట్టు యార్లగడ్డ ప్రకటించారు. ఈ మేరకు జాతీయ కార్యవర్గం తీర్మానించి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ను ఏపీలోని కూటమి అభ్యర్థులు తరపున ప్రచారం చేయమని ఆదేశించింది. కార్యవర్గం తీర్మానం, ఆదేశాలు మేరకు గురువారం విజయవాడ పశ్చిమ, కైకలూరు, ఉండి శాసనసభతోపాటు రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఆయన ప్రచారాన్ని చేపట్టనున్నారు. శుక్రవారం కూడా అనకాపల్లిలోని ఓ కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. అనంతరం ధర్మవరం, రాజంపేట నియోజకవర్గాల్లో పర్యటించి ప్రచారాన్ని సాగిస్తారు. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ హిందీ భాష అభివృద్ధికి చేసిన సేవకుగాను కేంద్ర ప్రభుత్వం విశ్వహిందీ పరిషత్ జాతీయ అధ్యక్షుడిగా నియమించింది.
నాటి నుంచి వైసీపీకి దూరం
గడిచిన ఎన్నికల్లో వైసీపీ గెలుపుకు కృషి చేసిన యార్లగడ్ల ఆ ప్రభుత్వంలోని కీలక నాయకులతో సన్నిహితంగా మెలిగారు. జగన్ సీఎం అయిన తరువాత యార్లగడ్ల లక్ష్మీప్రసాద్‌ను ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా నియమించారు. కొన్నాళ్లపాటు ఆ పదవిలో పని చేసిన ఆయన రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో పర్యటించి తెలుగు భాష అభివృద్ధికి సంబంధించిన అనేక చర్యలు తీసుకునేందుకు అనుగుణంగా సమీక్షలు నిర్వహించారు. అయితే, రెండేళ్ల కిందట అధికార వైసీపీ ఎన్‌టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరును వైఎస్‌ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మార్పు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ప్రొఫెసర్ యార్లగడ్ల లక్ష్మిప్రసాద్ అధికార భాషా సంఘం అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్‌టీఆర్ విశ్వవిద్యాలయం పేరును తీసి వైఎస్‌ఆర్ పేరును పెట్టడం బాధగా ఉందని పేర్కొన్నారు. ఆ తరువాత నుంచి వైసీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా యార్లగడ్ల లక్ష్మిప్రసాద్ ప్రచారం చేస్తుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)