EC Action on Vandalising EVM: ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం ఘటన, పీఓ సహా సిబ్బందిపై ఈసీ వేటు
Macherla EVM Vandalised: మాచర్ల నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో అల్లర్లు చెలరేగడం తెలిసిందే. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో ఎన్నికల సిబ్బందిపై ఈసీ వేటు వేసింది.
Vandalising EVM During Voting In Macherla: మాచర్ల: ఏపీలో సార్వత్రిక ఎన్నికల సమయంలో మాచర్లలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో ఈసీ చర్యలు చేపట్టింది. పాల్వాయి గేటు పోలింగ్ స్టేషన్ ప్రిసైడింగ్ ఆఫీసర్ సహా ఇతర సిబ్బందిని ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేసింది. మాచర్ల పోలింగ్ బూత్‌లో జరిగిన సంఘటనలో పోలింగ్ సిబ్బందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) పోలింగ్ బూత్ లో అడుగు పెట్టగా.. అక్కడ ఉన్న పీఓ, ఇతర సిబ్బంది లేచి నిలబడి ఆయనకు అభివాదం చేశారు. దాంతోపాటు ఈవీఎం నేలకేసి కొట్టి పగలగొడుతుంటే పోలింగ్ సిబ్బంది ఈ చర్యను వ్యతిరేకించలేదు అనే అభియోగాలపై సస్పెండ్ చేసింది. రేపటి (గురువారం) లోపు సంజాయిషీ ఇవ్వాల్సిందిగా ఆదేశాలలో పేర్కొంది. ఈవీఎం ధ్వసం ఘటనపై ప్రిసైడింగ్ ఆఫీసర్ సరైన సమాధానం ఇవ్వలేదని ఈసీ పేర్కొంది.
వెబ్ కెమెరా కాస్టింగ్‌లో దొరికిపోయిన పిన్నెల్లి!
మాచర్ల నియోజకవర్గంలో పీఎస్ నంబర్ 202లో సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి EVM నేలకేసి కొట్టినట్లుగా వెబ్ కెమెరాలో రికార్డ్ అయింది. ఈవీఎంల ధ్వంసానికి సంబంధించి కేసు దర్యాప్తులో భాగంగా పల్నాడు జిల్లా ఎన్నికల అధికారులు అన్ని పోలింగ్ స్టేషన్ల వీడియో ఫుటేజీని పోలీసులకు ఇచ్చారు. ఈవీఎం పగలగొట్టిన వైసీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసినట్లు మాచర్ల పోలీసులు తెలిపారు. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి కోసం పోలీసులు గాలిస్తున్నారని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. ఎమ్మెల్యే పగలగొట్టిన ఈవీఎంలోని సమాచారం మొత్తం సేఫ్ గానే ఉందన్న ఆయన.. పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి కోసం ఏపీతో పాటు తెలంగాణలోనూ గాలిస్తున్నారు. ఎయిర్ పోర్టులను కూడా అలర్ట్ చేసినట్లు తెలిపారు.
ఎమ్మెల్యే పిన్నెల్లిపై పలు సెక్షన్ల కింద కేసులు
మే 20న రెంటచింతల కోర్టులో పోలీసులు మెమో దాఖలు, ఎమ్మెల్యే పిన్నెల్లిపై 10 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఐపీసీ కింద 143, 147, 448, 427, 353, 452, 120బి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పీడీపీపీ చట్టం కింద మరో కేసు, ఆర్పీ చట్టం 131, 135 సెక్షన్లతో పలు కేసులతో పిన్నెల్లి చిక్కుల్లో ఇరుక్కున్నారు. ఆ సెక్షన్లు గమనిస్తే వైసీపీ ఎమ్మెల్యే నేరం రుజువైతే దాదాపు ఏడేళ్ల దాకా శిక్షలు పడే అవకాశం ఉందన్నారు. ఈవీఎం పగలగొట్టిన వీడియో బయటకొచ్చాక ఈసీ చర్యలు చేపట్టింది. ఈసీ ఆదేశాల ప్రకారం పోలీసులు మంగళవారం నుంచి పిన్నెల్లిని అరెస్ట్ కోసం ప్రయత్నం మొదలుపెట్టినట్లు చెప్పారు.
ఎమ్మెల్యే పిన్నెల్లి ప్రస్తుతం పరారీలో ఉన్నారు. సంగారెడ్డి వైపు వెళ్తుండగా పోలీసులు పిన్నెల్లిని అరెస్ట్ చేశారని ప్రచారం జరిగింది. అయితే పిన్నెల్లి అరెస్ట్ చేయలేదని సంగారెడ్డి పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. మొదట తాము ఎక్కడికి పారిపోలేదని పిన్నెల్లి నుంచి సమచారం వచ్చింది, కానీ గత కొన్ని రోజుల నుంచి మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే ఆచూకీ తెలియడం లేదు. అరెస్ట్ భయంతో పిన్నెల్లి ఇతర ప్రాంతాలకు వెల్లి తలదాచుకున్నట్లు తెలుస్తోంది.