Amaravati: అమరావతి రైతుల కోసం CRDA కీలక నిర్ణయం! ప్లాట్ల కేటాయింపుపై బిగ్ అప్డేట్, మీరే చూడండి!
Amaravati: అమరావతి రైతులకు ప్లాట్ల కేటాయింపు ప్రక్రియకు సిద్ధమవుతోంది సీఆర్‌డీఏ. దీనికి సంబంధించిన దరఖాస్తులు స్వీకరించనుంది.

Amaravati Farmers: అమరావతి రాజధాని నిర్మాణంలో మరో ఘట్టానికి ప్రభుత్వం విధివిధానాలు రూపొందించింది. చాలా కాలంగా చాలా మందిలో ఉన్న అనుమాలను నివృత్తి చేస్తూ ప్లాట్ల కేటాయింపునకు సిద్ధమైంది సి.ఆర్.డి.ఎ. దీని కోసం ప్రస్తుతం దేశంలో ఉన్న చట్టాలు, వివిధ ప్రాంతాల్లో ఉన్న పాలసీలను ఆధారంగా చేసుకొని ఓ ప్లాన్ రెడీ చేసింది.
మహారాష్ట్రలోని సిడ్కో, హర్యానాలోని హెచ్.ఎం.డీ.ఏ. , అహ్మదాబాద్‌లోని భూసమీకరణ విధానాలు పరిశీలించి ది బెస్ట్ పాలసీని తీసుకొచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు వివిధ ప్రాంతాల్లో అనుసరిస్తున్న విధానాలు స్టడీ చేసిన తర్వాత తాత్కాలిక ప్లాటు కేటాయింపు విధానాన్ని తయారు చేశారు అధికారు. దీనిపై భూయజమానులు, రైతు ప్రతినిధులు వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, మంత్రులు, అందరి అధికారుల సమక్షంలో అభిప్రాయ సేకరణ చేశారు.
తాత్కాలికంగా రూపొందించిన ముసాయిదాపై ఆయా వర్గాలు అందించిన ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు. రైతులు, ఇతరులు ఇచ్చిన సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకొని భూసమీకరణ విధానంలో భాగంగా ప్లాటు కేటాయింపు విధానాన్ని ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని నగర భూసమీకరణ నిబంధనలు 2015 లోని నియమము 5(2) ప్రకారము భూసమీకరణ పథకము కింద ఈ ప్లాట్ల కేటాయింపు జరిపారు. భూములు ఇచ్చిన భూ యజమానులతో ప్లాట్లు తిరిగి ఇస్తామని అథారిటీ ఒప్పందం చేసుకుంది. రూల్ 5(4) షెడ్యూలు - II(1) (1) ప్రకారం భూయజమానులకు ఒకేచోట లాటరీ ద్వారా ప్లాట్లు ఇవ్వాలి.
సీఆర్డీఏ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.
1) 25 చ.మీ. (30 చ.గ.) పెంపుతో ప్రామాణిక సైజు ప్లాట్లు, ప్రత్యేకంగా ఉంచిన ఉమ్మడి ప్రామాణిక ప్లాటులో అవిభక్త వాటా లేదా అమ్ముకొనే వీలు గల అభివృద్ధి హక్కు గల బాండ్లు (TDR) కేటాయింపు.
a) తిరిగి ఇచ్చే నివాస ప్లాట్లు కనీస ప్రామాణిక సైజు 100 చ.మీ (120 చ.గ.) ఉంటుంది. నివాస లే-అవుటులలో ప్రామాణిక ప్లాటు సైజులు 100 చ.మీ (120 చ.గ.) నుంచి 4000 చ.మీ (4800 చ.గ.) 25 చ.మీ (30చ.గ.) ఉంటుంది. 4000 చ.మీ. (4800 చ.గ.) పైబడి 50చ.మీ (60 చ.గ.) పెంపుదలతో ఉంటుంది.
b) తిరిగి ఇచ్చే వాణిజ్య ప్లాట్లు కనీస ప్రామాణిక సైజు 25 చ.మీ. (30 చ.గ.) ఉంటుంది. వాణిజ్య లే-అవుటులలో ప్రామాణిక ప్లాటు సైజులు 25 చ.మీ. (30 చ.గ.) నుంచి 4000 చ.మీ (4800 చ.గ.) 25 చ.మీ. (30 చ.గ.) వరకు ఉంటుంది. 4000 చ.మీ (4800 చ.గ.) పైబడి 50చ.మీ. (60 చ.గ.) కూడా ఉంటుంది.
c) ఒక వేళ తిరిగి ఇవ్వవలసిన నివాస / వాణిజ్య ప్లాట్లు, కనీస ప్రామాణిక సైజు (100 చ.మీ. నివాస అండ్ 25 చ.మీ. వాణిజ్య) కన్నా తక్కువ ఉంటే అవిభక్త వాటా లేదా అమ్ముకొనే వీలుగల అభివృద్ధి హక్కు గల బాండ్లు (TDR) ఇస్తారు.
2) ప్లాట్లు కేటాయింపు తర్వాత 15 రోజుల్లోపు భూ యజమానులు అర్హతల మేరకు రెవెన్యూ గ్రామాల్లో/భూ సమీకరణ అభివృద్ధి పథకములో 9.18 ఎ లేదా 9.18 బిలో దరఖాస్తు చేసుకోవాలి.
1) భూయజమానులు తాము ఎంపిక చేసుకొన్న విధంగా వారి అర్హతల మేరకు ప్లాట్లు కోరవచ్చు. భూ యజమాని తనకు రావలసిన నివాస లేదా వాణిజ్య స్థలాన్ని అర్హత మేరకు అతి పెద్ద ప్రామాణిక ప్లాటు గాని లేదా వివిధ సైజులలో ఉన్న ప్రామాణిక ప్లాట్లు కోరవచ్చు. తదుపరి మిగిలిన స్థలాన్ని ఇతరులతో కలిసి ఉమ్మడి ప్లాటుగా కానీ, సి.ఆర్.డి.ఎ. గుర్తించిన ప్రామాణిక ప్లాట్లలో అవిభక్త వాటాగా TDR గా గానీ పొందొచ్చు. అవిభక్త వాటాలు యజమానుల అనుమతితో సి.ఆర్.డి.ఎ. బహిరంగ వేలం వేసి డబ్బులు ఇవ్వాలని కోరవచ్చు.
2) భూ యజమాని, భూమి ఉన్న తన కుటుంబ సభ్యులతో గానీ లేదా స్నేహితులతో గాని కలసి తమకు రావలసిన స్థలాన్ని ఉమ్మడి ప్లాట్లుగా వివిధ సైజుల్లో కోరవచ్చు. తదుపరి మిగిలిన స్థలాన్ని సి.ఆర్.డి.ఎ. గుర్తించిన ప్రామాణిక ప్లాట్లలో అవిభక్త వాటాలుగా గానీ లేదా TDR గా గానీ పొందవచ్చు. అవిభక్త వాటాలను వేలం వేసి చెల్లించమని కూడా చెప్పవచ్చు.
3) ఒక రెవెన్యూ గ్రామ పరిధిలో ఉన్నటువంటి భూమికి సంబంధించిన ప్లాట్ల కేటాయింపు అదే రెవెన్యూ గ్రామ పరిధిలో ఉంటుంది. ఒక భూ యజమానికి వేరు వేరు రెవెన్యూ గ్రామాల్లో భూములు ఉన్నట్లైతే ఆయా రెవెన్యూ గ్రామముల్లోనే ప్లాట్లు కేటాయిస్తారు.
4) ఎంపిక చేసుకున్న ప్లాట్ల కేటగిరీల వారీగా లాటరీ విధానం ద్వారా కేటాయిస్తారు. ఈ లాటరీ రెవెన్యూ గ్రామ యూనిట్‌గా జరుగుతుంది. భూ సమీకరణ యూనిట్ల కార్యాలయముల వారీగా జరుగదు.
5) ప్రామాణిక సైజు ప్లాటులోని అవిభక్త వాటాలను విభజన చేయటానికి వీలులేదు. అవిభక్త వాటాలను అవిభక్త వాటాలుగానే అమ్ముకోవచ్చు.
6) జరీబు వర్గీకరణలో ఉన్న అర్హతల విస్తీర్ణం బట్టి ప్లాట్లు/ అవిభక్త వాటాలు సాధ్యమైనంత వరకు జరీబు భూముల్లోనే కోరాల్సి ఉంటుంది. మెట్ట భూ యజమానులకు జరీబు భూముల్లో ప్లాటు ఇవ్వరు.
7) గడువు లోపల దరఖాస్తు (9.18 ఎ / బి) చేయకుంటే అర్హతల ప్రకారం అతి పెద్ద ప్రామాణిక సైజు ప్లాటు, మిగిలిన విస్తీర్ణాని అవిభక్త వాటాగా కేటాయించబోరు. 


























