AP Elections: వచ్చే ఎన్నికల్లో పొత్తులపై సీపీఐ నారాయణ క్లారిటీ - కండీషన్స్ ఆప్లై అంటూ ట్విస్ట్!
టీడీపీ,జనసే, సీపీఐ కలసి పని చేస్తాయి...సీపీఐ నారాయణ
రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలతో కలిసి సీపీఐ ఎన్నికల బరిలో నిలవబోతుందని ప్రకటించారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. టీడీపీ, జనసేన, సీపీఐ కలిసే పోటీ చేస్తాయని ఆయన స్పష్టం చేశారు.
పొత్తులపై నారాయణ హాట్ కామెంట్స్..
ఆంధ్రప్రదేశ్ లో పొత్తుల వ్యవహారంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తులు ఉంటాయని క్లారిటీ ఇచ్చారు. ఈసారి పొత్తులు పెట్టుకోవటం మాత్రమే కాదని, మా ఓట్లు తీసుకుంటే సీట్లు కూడా ఇవ్వాల్సిందేనని ఆయన అన్నారు. కలవడం అంటూ జరిగితే షరతులకు ఒప్పుకోవాల్సిందేనని నారాయణ స్పష్టం చేశారు. వీరుడు, సూరుడు అనుకున్న జగన్.. కేంద్రం దగ్గర మొకరిల్లుతున్నాడని విమర్శలు గుప్పించారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో వాళ్ల నాన్న వైఎస్ లో ఉన్న పోరాట స్ఫూర్తి జగన్ లో కనిపించడం లేదన్నారు నారాయణ. వాళ్ల నాన్న సిద్ధాంతాలకు కూడా పంగనామాలు పెట్టిన వ్యక్తి ఏపీ సీఎం జగన్ అని విమర్శించారు.
జగన్ లో ఆ తత్వం లేదు.. నారాయణ
రాష్ట్ర ప్రయోజనాల కోసం సలహాలు ఇచ్చినా తీసుకునే తత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేదని విమర్శించారు నారాయణ. పోలవరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి వీడాలన్నారు. పోలవరం ఎత్తు పెంచడంతో పాటు నిర్వాసితులకు నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. పోలవరం విషయంలో విభజన హామీల హక్కులు సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వం వెనుక బడిపోయిందన్నారు. మీకు పోరాడటానికి భయంగా ఉంటే అఖిల పక్షానికి ఢిల్లీ తీసుకువెళ్ళండి, విభజన హామీలు మేం సాధించుకు వస్తామని, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.
గుంటూరులో నిరసన...
పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించకుండా ఉండాలంటూ సీపీఐ ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట సామూహిక నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలను సిపిఐ నేత నారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ అధ్యక్షత వహించి అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ పోలవరం ప్రాజెక్టు విషయంలో వాళ్ళ నాన్న పేరు నిలబెడతాడా లేక పంగాణామం పెడతారా అని ప్రశ్నించారు. బీజేపీ, వైసీపీలు ఒకే రాజకీయం రాష్ట్రంలో చేస్తున్నాయని, పోలవరం ప్రాజెక్టు విషయంలో ఎందుకు కలిసి పనిచేయడం లేదని ప్రశ్నించారు.
పోలవరం ఎత్తు తగ్గిస్తే దిగువ ప్రాంతాలకు, పవర్ ప్రాజెక్టులకు, ఉత్తరాంధ్ర, కృష్ణా జిల్లాలకు నీరు అందదని నారాయణ అన్నారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో కేంద్రంపై ఒత్తిడి చేయమంటే, ఒక్కడే మోడీ దగ్గరకు వెళ్ళటంతో సరిపెట్టుకుంటున్నారని నారాయణ అన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని, పోలవరం ఎత్తు పెంచడంతో పాటు నిర్వాసితులకు నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. పోలవరం విషయంలో విభజన హామీల హక్కులు సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వం వెనుకంజ వేసిందన్నారు. మీకు పోరాడటానికి భయంగా ఉంటే అఖిల పక్షానికి ఢిల్లీ తీసుకువెళ్ళండి, విభజన హామీలు మేం సాధించుకు వస్తాం అని నారాయణ అన్నారు. జగన్ సర్కార్ తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన చేపడతామని స్పష్టం చేశారు.