(Source: ECI/ABP News/ABP Majha)
CM Jagan: దేవుడు నా స్క్రిప్ట్ మరింత పెద్దగా రాశాడు, మీ బిడ్డ అదరడు బెదరడు - జగన్
AP Elections 2024: కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని నాగవరప్పాడు వద్ద జరిగిన వైఎస్ఆర్ సీపీ భారీ బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై విమర్శలు చేశారు.
CM Jagan in Gudivada: అర్జునుడిపై బాణం వేసినంత మాత్రాన కురుక్షేత్రంలో కౌరవులు నెగ్గినట్లు కాదని అన్నారు. ఇలాంటి దాడులతో తన సంకల్పం చెక్కుచెదరదని అన్నారు. వారు ఈ స్థాయికి దిగజారారంటే మనం విజయానికి అంత చేరువగా ఉన్నామని అర్థం చేసుకోవాలని అన్నారు. తన నుదుటిపై వారు గాయం చేసి తన సంకల్పాన్ని మరింత పెంచారని సీఎం అన్నారు. ఆ గాయం తన కంటిపై తగలకుండా.. కణతిపై తగలకుండా చేసి ఆ దేవుడు తన స్క్రిప్ట్ మరింత పెద్దగా రాశాడని అన్నారు. ఏపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గుడివాడ సమీపంలోని నాగవరప్పాడు వద్ద జరిగిన వైఎస్ఆర్ సీపీ భారీ బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎప్పటిలాగే చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై విమర్శలు చేశారు.
పేదలకు ఏ మంచీ చేయొద్దన్నది కూటమి నాయకుడు చంద్రబాబు ఫిలాసఫీ అని అన్నారు. విడగొట్టిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దని చెప్పిన వ్యక్తి కూడా చంద్రబాబే అని అన్నారు. ఒక్క జగన్ పై ఎంత మంది కలిసి దాడి చేస్తున్నారో మీరు చూస్తున్నారని అన్నారు. తనపై ఒక రాయి వేసినంత మాత్రాన.. మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవరూ ఆపలేరని సీఎం జగన్ స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రభుత్వ బడులను పాడుపెట్టారని.. ఇంగ్లీష్ మీడియం వద్దని అన్నాడని అన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వొదని చంద్రబాబే అన్నారని జగన్ విమర్శించారు.
ఎన్టీఆర్ హాయాంలో కిలో బియ్యం రూ.2 కు బియ్యం ఇస్తే.. ఇవ్వొద్దన్న వ్యక్తి చంద్రబాబే. ఎన్టీఆర్‌ను గద్దె దింపింది చంద్రబాబే. ఎస్సీలను, బీసీలను అవహేళన చేసింది చంద్రబాబే. విడగొట్టిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దని అన్నది చంద్రబాబే. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి.. ఆయనపై చెప్పులు వేయించింది చంద్రబాబే’’ అని సీఎం జగన్ అన్నారు.
అంతకుముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బస్సుయాత్ర గుడివాడలోకి ప్రవేశించింది. జగన్‌కి గుడివాడ ప్రజలు ఘనస్వాగతం పలికారు. అభిమాన నేత రాక కోసం గుడివాడ పట్టణం జనసంద్రం అయింది. గుడివాడ ప్రధాన రహదారికి ఇరువైపులా జనం బారులు తీరారు.