ఢిల్లీకి సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు- ప్రధానమంత్రి నిర్వహించే సమావేశంలో పాల్గోనున్న ఇరువురు నేతలు
వచ్చే ఏడాది భారత్‌లో జీ20 సదస్సు జరగనుంది. ఈ సమ్మిట్‌కు సంబంధించిన సలహాలు, చర్చలు, వ్యూహాలను ఖరారు చేసేందుకు కేంద్రం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
కేంద్రం నిర్వహించిన అఖిలపక్షం భేటీలో ఏపీ నుంచి అధికార ప్రతిపక్ష అధినేతలు పాల్గోనున్నారు. సీఎం జగన్, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. వేర్వేరుగా వేర్వేరు సమయాల్లో ఢిల్లీ వెళ్లి సాయంత్రం జరిగే భేటీలో పాల్గొంటారు.
వచ్చే ఏడాది భారత్‌లో జీ20 సదస్సు జరగనుంది. ఈ సమ్మిట్‌కు సంబంధించిన సలహాలు, చర్చలు, వ్యూహాలను ఖరారు చేసేందుకు కేంద్రం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ డిసెంబర్ 1న జీ20 అధ్యక్ష బాధ్యతలను భారత్ స్వీకరించింది. ఈ చర్చల్లో ముఖ్యమంత్రి జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గోనున్నారు.
జీ20 సదస్సు నిర్వహణపై ప్రధానమంత్రి అధ్యక్షతన ఈ భేటీ ఈ సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు జరగనుంది. రాష్ట్రపతి భవన్‌లో జరిగే అఖిలపక్ష సమావేశంలో జగన్ , చంద్రబాబు పాల్గొంటారు. సీఎం జగన్ 12.30కు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి 3.15కు ఢిల్లీ చేరుకుంటారు. చంద్రబాబు ఉదయం 9.30కి శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయల్దేరి ఢిల్లీ చేరుకుంటారు.
జీ20 ప్రెసిడెన్సీ సమయంలో భారత్.. దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాలలో 32 వేర్వేరు రంగాలలో 300 సమావేశాలను నిర్వహిస్తుంది. ప్రధానమంత్రి కార్యాలయం (PMO) ప్రకారం, వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో దిల్లీలో జరగనున్న G-20 సమ్మిట్ భారతదేశం నిర్వహించే అత్యున్నత స్థాయి అంతర్జాతీయ సమావేశాలలో ఒకటి.
40 పార్టీలకు
ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే ఈ సమావేశానికి దాదాపు 40 పార్టీల అధ్యక్షులను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఆహ్వానించారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా హాజరయ్యే అవకాశం ఉంది.
వచ్చే ఏడాది సెప్టెంబర్ 9, 10 తేదీల్లో దిల్లీలో జి-20 సదస్సు జరగనుంది. దీనికి సభ్యదేశాల దేశాధినేతలు లేదా ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో సదస్సు నిర్వహణపై దేశంలోని పలు ప్రాంతాల్లో కేంద్రం సమావేశాలు ఏర్పాటు చేయనుంది.
దీదీ హాజరు
బంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అఖిలపక్ష సమావేశంలో పాల్గొననున్నారు. ఆదివారం సాయంత్రం ఆమె దిల్లీ చేరుకోనున్నారు. అయితే తాను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా కాకుండా తృణమూల్ కాంగ్రెస్ చైర్‌పర్సన్ హోదాలో ఈ సమావేశంలో పాల్గొంటానని మమత చెప్పారు.
అధ్యక్ష పగ్గాలు
ఇండోనేసియా బాలీలో ఇటీవల జీ20 సదస్సు ముగిసింది. దీంతో 2023లో నిర్వహించనున్న జీ20 శిఖరాగ్ర సదస్సు అధ్యక్ష బాధ్యతలను భారత్‌కు ఇండోనేసియా అప్పగించింది. ఈ మేరకు ప్రస్తుత జీ20 సమావేశాల ముగింపు కార్యక్రమంలో ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడొడో సదస్సు బాధ్యతలను భారత ప్రధాని నరేంద్ర మోదీకి అప్పగించారు.
" భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక మందగమనం, పెరుగుతున్న ఆహారం, ఇంధన ధరలు, మహమ్మారి దీర్ఘకాలిక దుష్ప్రభావాలతో ప్రపంచం పట్టుకోల్పోతున్న సమయంలో భారత్ జీ-20 బాధ్యతలు తీసుకుంటోంది. ఇటువంటి సమయంలో ప్రపంచం జీ-20 వైపు ఆశతో చూస్తోంది. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అనే నినాదంతో వసుధైక కుటుంబం అనే భావనతో 2023లో జీ20 సదస్సును నిర్వహిస్తాం. జీ20 అధ్యక్ష పదవిని చేపట్టడం ప్రతి భారతీయుడికి గర్వకారణం. "
- ప్రధాని నరేంద్ర మోదీ