జీ-20 సదస్సును రాజకీయ కోణంలో కామెంట్ చేయొద్దు- ఎలాంటి బాధ్యత ఇచ్చినా సిద్దమేనన్న జగన్
జి-20 దేశాల సదస్సు కోసం చేసే ఏర్పాట్లు, దానికోసం జరిగే సన్నాహకాల్లో ఎలాంటి బాధ్యతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించినా నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నామని జగన్ తెలిపారు.
![జీ-20 సదస్సును రాజకీయ కోణంలో కామెంట్ చేయొద్దు- ఎలాంటి బాధ్యత ఇచ్చినా సిద్దమేనన్న జగన్ CM Jagan and Chandrababu participated in the meeting chaired by the Prime Minister for finalizing the preparations and strategies for the G-20 summit జీ-20 సదస్సును రాజకీయ కోణంలో కామెంట్ చేయొద్దు- ఎలాంటి బాధ్యత ఇచ్చినా సిద్దమేనన్న జగన్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/06/5a573634cd2ba83c37cd259e5681e72b1670283958955215_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
వచ్చే ఏడాది భారత్‌లో జరగనున్న జి-20 దేశాధినేతల ప్రతిష్టాత్మక సదస్సుకు భారత్ వేదిక కావడం ఆనందంగా ఉందన్నారు సీఎం జగన్. ఈ విషయంలో ప్రధాని మోదీని అభినందనలు తెలియజేశారు. జి-20 సదస్సు సన్నాహకాలు, వ్యూహాల ఖరారులో భాగంగా ప్రధాని అధ్యక్షతన రాష్ట్రపతి భవన్‌లోని అశోకాహాలులో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... జి-20 దేశాల సదస్సు కోసం చేసే ఏర్పాట్లు, దానికోసం జరిగే సన్నాహకాల్లో ఎలాంటి బాధ్యతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించినా నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక సదస్సు విజయవంతం కావడానికి అన్నిరకాలు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. జి-20 అధ్యక్ష పదవిని భారత్ చేపట్టిన ఈ సందర్భంలో రాజకీయ కోణంలో వ్యాఖ్యలు చేయడం సరికాదని సూచించారు. అంతర్జాతీయ సమాజం భారత్ వైపు చూస్తున్న ఈ సందర్భంలో అందరూ ఒక్కతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని జగన్ హితవు పలికారు. రాజకీయ పార్టీల మధ్య విభేదాలు సహజమని, కాని వాటిని మనవరకే పరిమితం చేసుకుని జి-20 సదస్సు విజయవంతం చేయడానికి అందరూకలిసికట్టుగా ముందుకుసాగాలన్నారు.
యూత్ ఫోర్స్‌ను ఉపయోగించుకోవాలి: చంద్రబాబు
ఈ సమావేశంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా పాల్గొన్నారు. జి-20 సదస్సు నిర్వహణపై అందరి అభిప్రాయాలు తీసుకోవడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఇటీవలే 75వ స్వాతంత్య్ర ఉత్సవాలను ఘనంగా నిర్వహించి దేశ శక్తిసామర్థ్యాలు చాటిచెప్పారన్నారు. ఇప్పుడు భారత్ ప్రపంచ శక్తిగా ఎదుగుతోందని... సరైన టైంలో ఐటీ, డిజిటల్ వ్యవస్థను అందుకోగలిగామని అభిప్రాయపడ్డారు. మరో 25ఏళ్లు మనదే పైచేయి ఉండబోతుందన్నారు. యూత్ ఫోర్స్‌ను పూర్తిస్థాయిలో ఉపయోగించుకొనేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తే 2047 నాటికి నంబర్ వన్‌లో ఉంటామన్నారు.
విజన్ డాక్యుమెంట్ ఉండాలి: చంద్రబాబు
2047 నాటికి భారతీయులు ఉద్యోగాలు సృష్టించి... సంపన్నుల జాబితాలో టాప్‌లో ఉంటారని చంద్రబాబు వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ, రాజకీయ, కార్పొరేట్ వ్యవస్థలను శాసించగలిగే స్థాయికి చేరుకుంటారని అంచనా వేశారు. వీటిన దృష్టిలో పెట్టుకొని ఇండియా ఎట్ హండ్రెడ్ ఇయర్స్- గ్లోబల్ లీడర్ పేరుతో విజన్ డాక్యుమెంట్ రూపొందించాలని ప్రధానికి సూచించారు. భవిష్యత్తులో జనాభా సగటు వయస్సు పెరిగే ప్రమాదం ఉందని దాన్ని అధిగమించేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. డెమోగ్రఫిక్ మేనేజ్‌మెంట్ చేయగలిగితే అద్భుతాలు సృష్టించవచ్చని చంద్రబాబు సూచించారు. ఇప్పుడు మొదలుపెడితే ఈ విషయంలో ప్రపంచం కంటే ముందుంటామన్నారు. లేదంటే చైనా, జపాన్, ఐరోపా దేశాలు ఎదుర్కొంటున్న వయోభార సమస్యను భారత్ ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. 2047 తర్వాత దీన్ని ఎదుర్కోవడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ప్రతి సమస్యకు పరిష్కారం చూపే శక్తి మన యువతకు ఉందని... ప్రపంచవ్యాప్తంగా ఎదురయ్యే వైద్య, పర్యావరణ, ఇంధన సమస్యలకు పరిష్కారం చూపగలుగుతామని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ఉపన్యాసం ప్రారంభించే ముందు చంద్రబాబు, మమతా బెనర్జీల సూచనలను ప్రస్తావించారు.
ఢిల్లీలో #G20 పై జరిగిన అఖిలపక్ష సమావేశం లో పాల్గొన్న టిడిపి అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సమావేశంలో డిజిటల్ నాలెడ్జ్ అంశం పై మాట్లాడగా, చంద్రబాబు గారు సూచించిన డిజిటల్ నాలెడ్జ్ అంశాన్ని తన ప్రసంగం లో ప్రస్తావించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ. (1/3) pic.twitter.com/oYEavGcEBo
— Telugu Desam Party (@JaiTDP) December 5, 2022
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)