AP Election 2024: అందరూ దొంగలే.. బీజేపీతో ఎందుకు కలుస్తున్నారు చంద్రబాబే చెప్పాలి: షర్మిల
TDP BJP Alliance: భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీ ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందో చంద్రబాబు నాయుడు చెప్పాలని షర్మిల కోరారు. అందరూ దొంగలేనంటూ సెటైర్లు విసిరారు.
Andhra Pradesh PCC President Sharmila : భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు పెట్టుకోవడంపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి స్పందించారు. అందరూ దొంగలేనంటూ షర్మిల తనదైన శైలిలో సెటైర్లు విసిరారు. భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీ ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందో చంద్రబాబు నాయుడు చెప్పాలని షర్మిల కోరారు. గతంలో చంద్రబాబు పాలన చూసామని, ఏమిచ్చారని బీజేపితో చంద్రబాబు మళ్ళీ కలుస్తున్నారని ఆమె ప్రశ్నించారు. గతంలో ఐదు సంవత్సరాలు పొత్తు పెట్టుకున్నారని, అప్పుడు ఏం సాధించారో ప్రజలకు చెప్పాలని వైయస్ షర్మిల డిమాండ్ చేశారు.
ప్రతి మహిళకు అండగా ఉండేలా పథకం
ప్రతి ఇంట్లోనూ మహిళకు అండగా ఉండేలా కాంగ్రెస్ పార్టీ సరికొత్త పథకాన్ని రూపొందించిందని షర్మిల పేర్కొన్నారు. నిరుపేద మహిళలకు ప్రతినెల 5000 రూపాయల అందించే పథకాన్ని తాము అధికారంలోకి వస్తే అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ మొత్తాన్ని మద్యం కోసం కాకుండా మహిళలు కోసం అందిస్తామని షర్మిల వెల్లడించారు. నేరుగా మహిళ అకౌంట్లోనే ఈ మొత్తాన్ని జమ చేయనున్నట్లు తెలిపారు. ఒక మహిళ భార్యగా, తల్లిగా, చెల్లిగా ఎన్ని కష్టాలు పడుతుందో తనకు తెలుసునన్నారు. పేద కుటుంబాలని ఆదుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఉందని, ఈ పథకం అమలులోకి రావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు.
కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినా, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఈ పథకాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు. బీజేపి కేంద్రంలో పదేళ్లు అధికారంలో ఉండి ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదన్నారు. ప్రత్యేక హోదా లేదని, ప్రత్యేక హోదా ఉంటే ట్యాక్సులు ఉండవన్నారు. రాష్ట్రానికి కనీసం రాజధాని కూడా లేదని షర్మిల ఈ సందర్భంగా విమర్శించారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి రాజధానులు అనేక రాష్ట్రాలకు ఉంటే, ఆంధ్రప్రదేశ్కు చెప్పుకునేందుకు కూడా రాజధాని లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న తీరుగా ఉందని, యువతకు ఉద్యోగాలు లేవన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మెగా డీఎస్సీ వేస్తా అని చెప్పి ఏడు వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని, జగనన్న మెగా డీఎస్సీని దగా డీఎస్సీ చేశారన్నారు.
బిజెపికి తొత్తులుగా మారిన జగనన్న, చంద్రబాబు
కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి జగనన్న, చంద్రబాబు తొత్తులుగా మారారని షర్మిల విమర్శించారు. రాష్ట్రానికి పోలవరం ఊపిరి లాంటిదని, పోలవరం కట్టకపోయినా, రాజధాని చెయ్యకపోయినా, ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా బీజేపికి ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. జగనన్న, చంద్రబాబులో ఎవరు అధికారంలోకి వచ్చినా ఉపయోగం లేదని, ప్రజలు ఆలోచించి ఓట్లు వెయ్యాలని కోరారు. ఇది ఎన్నికల సమయమని, టీడీపీ, వైసీపీ నేతలు ఇళ్లకు వచ్చి పెద్దపెద్ద మూటలు తెస్తారని, ఎవరు డబ్బు ఇచ్చినా తీసుకొని కాంగ్రెస్ కు ఓటు వేయాలని ఆమె కోరారు. ప్రజల డబ్బు ప్రజలకే ఇస్తారని అన్నారు. ఏపీలో టీడీపీ, వైసీపీ ఏది ఉన్నా.. బీజేపి ఉన్నట్టేనన్నారు. ఏపీ ప్రజలను బీజేపి వెన్నుపోటు పొడిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడంతోపాటు రాజధాని, పోలవరం నిర్మిస్తామని స్పష్టం చేశారు. ఇదిరమ్మ అభయం కూడా వస్తుందని, ప్రతి పెద కుటుంబానికి అయిదు వేల రూపాయలు ఈ పథకంలో భాగంగా జమ చేస్తామన్నారు. మద్యపాన నిషేధం చేస్తామని చెప్పిన సీఎం జగన్ మోహన్ రెడ్డి.. బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, త్రి కాపిటల్, స్పెషల్ స్టేటస్ పేర్లతో మద్యం అమ్మకాలు సాగిస్తున్నారని విమర్శించారు. జగనన్న ఇచ్చిన హామీలన్నీ లిక్కర్ షాపులో నెరవేరాయని షర్మిల ఎద్దేవా చేశారు. ..?