Chandrababu: తిరుమల లడ్డూ నెయ్యిలో జంతు కొవ్వు కన్ఫామ్, వారిపై కఠిన చర్యలు - చంద్రబాబు
Tirumala Laddu News: ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సచివాలయం బయట ఏర్పాటు చేసిన అన్న క్యాంటిన్‌ను చంద్రబాబు ప్రారంభించారు. పేదలకు స్వయంగా భోజనం పెట్టారు.
AP Latest News: తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో గత ప్రభుత్వం అన్నీ అపవిత్రం చేసిందని.. శానిటేషన్, ప్రసాదాలు, అన్న క్యాంటీన్లను కూడా జగన్ సర్కారు దెబ్బతీసిందని విమర్శిచారు. పెళ్లిళ్లు, పేరంటాలకు వెంకటేశ్వరస్వామిని తీసుకెళ్లి అక్కడ కూడా ఊరేగించే పరిస్థితికి వచ్చారని ఆరోపించారు. దానిపై ఆ రోజే తాను ఖండించానని.. రాజకీయ ప్రయోజనాల కోసం వేంకటేశ్వరస్వామిని వాడుకోవడం కరెక్టు కాదని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వెలగపూడిలోని సచివాలయం బయట ఏర్పాటు చేసిన అన్న క్యాంటిన్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. పేదలకు టోకెన్లు ఇచ్చి భోజనం పెట్టారు.
అనంతరం బయట చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. హిందువులు జీవితంలో ఒక్కసారైనా శ్రీవారిని దర్శించుకోవాలని, కోరికలు చెప్పుకోవాలని అనుకుంటారని అన్నారు. అలాంటి దేవుడి పవిత్రమైన స్థలాన్ని గత ప్రభుత్వం దెబ్బతీసేలాగా వ్యవహరించిందని అన్నారు. తిరుమలలో ఇప్పటికే ప్రక్షాళన ప్రారంభించామని.. చాలా వరకు పరిస్థితులు మెరుగు పడ్డాయని అన్నారు. ఆధారాలు దొరకగానే బాధ్యులపై చర్యలు ఉంటాయని తేల్చి చెప్పారు. ‘‘తిరుమల లడ్డూ తయారీకి వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు వాడినట్టు నిర్ధారణ అయ్యింది. ఈ విషయంలో విచారణ జరుగుతోంది, బాధ్యులని శిక్షిస్తాం. తప్పు ఎవరు చేసినా శిక్షించాల్సిందే. ఇంటి దగ్గరే తిరుమల సెట్ వేసి పైశాచిక ఆనందం పొందారు. జగన్ హాయాంలో ఇదే జరిగింది. భక్తుల మనోభావాలు దెబ్బతిని చాలా మంది మథనపడ్డారు’’ అని అన్నారు.