మందడం ఘటనపై మండిపడుతున్న బీజేపి - దాడుల్ని ఖండించిన చంద్రబాబు, పవన్
బీజేపీ నేతలపై దాడి జరగటంతో కాషాయ దళం మండిపడుతోంది. బహిరంగంగా భారతీయ జనతా పార్టీ నేతల పై జరిగినన దాడిని అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా తప్పు పట్టారు.
అమరావతి రాజధాని ప్రాంతంలో బీజేపీ నేతలపై దాడి జరగటంతో కాషాయ దళం మండిపడుతోంది. బహిరంగంగా భారతీయ జనతా పార్టీ నేతల పై జరిగినన దాడిని అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా తప్పు పట్టారు.
బహిరంగ దాడులు కలకలం...
బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పై దాడి వ్యవహరం రాజకీయంగా తీవ్ర కలకలం రేపింది. తనపై జరిగిన దాడి ఘటనపై సత్యకుమార్ మీడియాతో మాట్లాడారు. అమరావతి ఉద్యమం 1200 రోజులకు చేరిన సందర్భంగా నిర్వహించిన సభలో భారతీయ జనతా పార్టికి చెందిన నాయకులు పాల్గొన్నారు. అమరావతి రైతులకు మద్దతుగా సభలో పాల్గొని ప్రసంగించిన కాషాయ దళం నేతలు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ గా చేసుకొని ప్రసంగించారు. జగన్మోహన్ రెడ్డి రాక్షస వికృత క్రీడ గురించి తాను మాట్లాడానని, అయితే అధికారంలో ఉన్న పార్టి నేతలయినా అమరావతి రాజధాని గురించి ఎందుకు మాట్లాడరని సత్యకుమార్ ప్రశ్నించారు.
మూడు రాజధానుల పేరుతో మూడు ప్రాంతాల్లో వైషమ్యాలు సృష్టించారని, సీఎం జగన్ తన విధ్వంసక రచనను బీజేపీ ప్రశ్నించిందని అన్నారు. సభ నుండి తిరిగి వస్తుండగా మూడు రాజధానుల శిబిరం వద్ద పోలీసులు భారీగా మోహరించారని, వారు తమ వాహనాలను ఆపారని సత్యకుమార్ అన్నారు. వెంటనే మూకుమ్మడిగా భారతీయ జనతా పార్టి నేతల పైకి దూసుకువచ్చి దాడికి పాల్పడ్డారని, అసభ్యంగా బూతులు తిడుతూ... కర్రలు, రాళ్లతో దాడి చేశారని చెప్పారు. డీఎస్పీని ఇదేంటని అడిగినా స్పందించ లేదని బీజేపీ నాయకులు అంటున్నారు.
పోలీసులు కూడా తమ పార్టికి చెందిన నేతలనే వెనక్కి నెట్టారని, తామంతా అటుగా వస్తున్నామనే తెలిసి పథకం రచించారని చెప్పారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచివచ్చిన ఆదేశాలనే అమలు చేశారని, తమపై జరిగిన దాడికి బాపట్ల పార్లమెంట్ సభ్యులు నందిగం సురేష్ మద్దతు ఉందని ఆరోపించారు.
ఇల్లు ఇక్కడే కట్టుకున్నానన్న జగన్... ఇప్పుడు ఏం చేశారు..
ఇక్కడే ఇల్లు కట్టా, అమరావతి అభివృద్ధి చేస్తా అని జగన్ చెప్పలేదా అని బీజేపీకి చెందిన నేతలు ప్రశ్నించారు. అమరావతికి మద్దతు ఇస్తే దాడి చేయటం దుర్మార్గమని మండిపడ్డారు. హత్యా రాజకీయాలకు తెర లేపడం వారికి అలవాటేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై బీజేపీ నేత సత్యకుమార్ మండిపడ్డారు. అమరావతికి అండగా ఉద్యమంలో బీజేపీ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఎంపీ నందిగం సురేష్ రాజధాని ప్రాంతంలో తిరగాల్సిన అవసరం ఏంటని ఆయన ప్రశ్నించారు. దాడులను ఖండించాల్సిన ఎంపీ, రౌడీలకు, దాడులు చేసిన వారికి మద్దతు ఇస్తున్నారని, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ కనుసన్నల్లోనే ఈదాడి జరిగిందని ఆరోపించారు. ఎంపీ నందిగం సురేష్ కాల్ డేటా మొత్తం తీస్తే.. దీని వెనుక ఉన్న వాళ్ల వివరాలు తెలుస్తాయని వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి స్పందించకుంటే ఆయన పాత్ర మీద సందేహించాల్సి ఉంటుందని సత్యకుమార్ అన్నారు.
ఖండించిన సోము వీర్రాజు...
బీజేపీపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలిని రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు డిమాండ్ చేశారు. అమరావతి రైతులకు సంఘీభావం తెలిపి వస్తుండగా ఉద్దేశ పూర్వకంగానే వైసీపీ దాడి కి పాల్పడిందని సోమువీర్రాజు ఆరోపించారు. బీజేపీ నేతలు పై దాడి చేసిన వారిపై వెంటనే కేసులు నమోదు చేయాలని, పోలీసులు నిర్లిప్తంగా వ్యవహరించడం వల్లనే బిజెవైఎం నేత పనతల సురేష్ పైకి దాడి చేశారని అన్నారు. దాడులకు బీజేపీ భయపడదని సోమువీర్రాజు అన్నారు.
దాడుల్ని ఖండించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్
రాజధాని ప్రాంతంలో నిర్వహించిన సభలో పాల్గోని తిరిగి వస్తున్న భారతీయ జనతా పార్టికి చెందిన నేతల పై జరిగిన దాడిని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఖండిచారు. ప్రశ్నిస్తే దాడులు చేయటం ఏంటని ప్రశ్నించారు.