Asha Workers Protests: హైవేపై ఆశా వర్కర్ల మూకుమ్మడి నిరసన! బలవంతంగా ఈడ్చుకెళ్లిన పోలీసులు
Guntur News: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆశా వర్కర్స్ యూనియన్, సీఐటీయూ ఆధ్వర్యంలో ఛలో విజయవాడ కార్యక్రమానికి గురువారం పిలుపునిచ్చారు.
Asha Workers Protests in Guntur: ఆశా వర్కర్ల నిరసనను పోలీసులు చెదరగొట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆశా వర్కర్స్ యూనియన్, సీఐటీయూ ఆధ్వర్యంలో ఛలో విజయవాడ కార్యక్రమానికి గురువారం పిలుపునిచ్చారు. దీంతో వందలాది మంది ఆశా వర్కర్లు ఏపీఐఐసీసీ భవనములోని కార్యాలయానికి వెళ్లేందుకు మూకుమ్మడిగా బయలుదేరారు. వెంటనే వారిని అక్కడికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో ఆశా వర్కర్లు ఎన్నారై హాస్పిటల్ కి ఎదురుగా ఉన్న రోడ్డుపై బైఠాయించారు. వారిని వారించేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు. దీంతో తీవ్ర గందరగోళం నెలకొంది.
పోలీసుల బలవంతపు వైఖరితో ఆశా వర్కర్లతో పాటు సీఐటీయూ నేతలు తీవ్రంగా ఖండించారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే చేయకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. కనీస వేతనం అమలు, పని భారం తగ్గింపు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర అంశాలపై వారు గతకొంతకాలంగా ఆందోళన కొనసాగిస్తున్నారు. ఆశా వర్కర్లు పోలీసుల మాట వినకుండా రోడ్డుపై బైఠాయించడంతో.. మహిళా పోలీసులు రంగంలోకి దిగారు. వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ లకు తరలించారు. వడ్డేశ్వరంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సుమారు 100 మంది ఆశా వర్కర్లను పోలీసులు నిర్బంధించారు. కాజా టోల్ గేట్ దగ్గర 15 మందిని అరెస్ట్ చేశారు.