Nara Lokesh: కువైట్ బాధితుడికి లోకేశ్ భరోసా - వైరల్ వీడియోపై స్పందించిన మంత్రి
Amaravati News: కువైట్‌లో వేధింపులకు గురి అవుతున్న కార్మికుడి వీడియోపై మంత్రి నారా లోకేశ్ ఎక్స్ ద్వారా స్పందించారు. అక్కడ ఇబ్బందులకు గురవుతున్న వ్యక్తిని ఏపీకి తీసుకొస్తామని భరోసా ఇచ్చారు.

Kuwait Man Viral Video: బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాలు వెళ్లిన కార్మికుడి వీడియో తాజాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఓ బాధితుడు తన దీన పరిస్థితిని వెల్లడిస్తూ ఓ సెల్ఫీ వీడియోను షూట్ చేసి సోషల్ మీడియాలో ఉంచాడు. దీంతో ఆ వీడియో విపరీతంగా షేర్ అయింది. కువైట్‌లోని ఓ ఎడారి ప్రాంతంలో ఆ వ్యక్తి తాను పడుతున్న వేదనను ఆ సెల్ఫీ వీడియోలో వివరించాడు.
దీంతో కువైట్‌లో వేధింపులకు గురైన కార్మికుడి వీడియోపై మంత్రి నారా లోకేశ్ ఎక్స్ ద్వారా స్పందించారు. అక్కడ ఇబ్బందులకు గురవుతున్న వ్యక్తిని తాము గుర్తించామని తెలిపారు. తాము ఇప్పటికే టీడీపీ ఎన్‌ఆర్‌ఐ టీమ్ కు చెప్పామని.. వారు ఆ బాధితుడిని సంప్రదిస్తారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంలోని విదేశీ మంత్రిత్వశాఖ సహకారంతో బాధితుడిని రాష్ట్రానికి రప్పిస్తామని వెల్లడించారు.
కువైట్‌లో దుర్భర జీవితం గడుపుతున్నామని ఇటీవల ఓ తెలుగు కార్మికుడు కన్నీటి పర్యంతమయ్యాడు. సాయం చేయకపోతే చావే దిక్కంటూ వీడియోలో గోడు వెల్లబోసుకున్నాడు. దీంతో తాజాగా స్పందించిన లోకేశ్ ఆయన్ను ఆంధ్రప్రదేశ్‌కు తీసుకువచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.
We have identified the harassed victim in the video. Our NRI TDP team has reached out to his family. Our Govt will work with @MEAIndia to bring him back to Andhra Pradesh safely. https://t.co/Sa9ormCcgC
— Lokesh Nara (@naralokesh) July 13, 2024
సెల్ఫీ వీడియోలో బాధితుడు చెప్పిన వివరాలు ఇవీ.. తాను డబ్బు సంపాదించాలనే ఆశతో కువైట్ దేశానికి వెళ్లి అక్కడ బ్రోకర్ చేతిలో మోసపోయినట్లు తెలిపాడు. ఎడారిలో తను ఎన్నో కష్టాలు పడుతున్నానని వాపోయాడు. తన బాధలు చెప్తుంటే తన భార్య తన మాటలు పట్టించుకోవడం లేదని చెప్పాడు. అందుకే గతి లేని పరిస్థితుల్లో తాను ఈ వీడియో చేస్తున్నట్లు వివరించాడు.
తనకు ఎడారిలో ఉన్న కుక్కలు, బాతులకు మేత వేసే పని అప్పగించారని చెప్పాడు. అక్కడ కనీసం ఒక చెట్టు కూడా లేదని.. కనీసం నీళ్లు కూడా దొరక్క ఇబ్బందులు పడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. నీళ్ల కోసం కనీసం రెండు కిలో మీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోందని చెప్పాడు. అక్కడ బతకడం తన వల్ల కావడం లేదని వాపోయాడు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

