Andhra Pradesh: ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్, ఏడాది పాటు ఉచిత వసతి సౌకర్యం
AP government employees : సచివాలయం, అసెంబ్లీ వంటి చోట్ల పనిచేస్తున్న ఉద్యోగులకు మేలు చేసేలా కీలక ఉత్తర్వులు ఏపీ ప్రభుత్వం జారీ చేసింది. వీరికి ఉచిత వసతి సదుపాయం పొడిగిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది.
AP Government Issued Beneficial Orders To Government Employees: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఉద్యోగులకు ఉచిత వసతి సదుపాయాన్ని కల్పించేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఈ ఆదేశాలు ప్రభుత్వశాఖల్లో పని చేసే అందరికీ వర్తించవు. హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చి పని చేస్తున్న ఉద్యోగులకు మాత్రమే వర్తించేలా ప్రభుత్వం ఈ ఆదేశాలను జారీ చేసింది.
గతంలో ఈ ఆదేశాలు అమలులో ఉన్నాయి. గడువు ముగియడంతో ఉచిత సదుపాయాన్ని పొడిగిస్తూ తాజాగా శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేసింది. సచివాలయం, అసెంబ్లీ, హెచ్‌వోడీ, రాజ్‌భవన్ ఉద్యోగులకు ఈ సదుపాయాన్ని మరో ఏడాదిపాటు వర్తించేలా ఆదేశించింది. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పని చేస్తున్న వారికి 2024 జూన్ 27 నుంచి వచ్చే ఏడాది జూన్ 26 తేదీ వరకు ఉచిత వసతి వర్తిస్తుందని సాధారణ పరిపాలనశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్ర విభజన తరువాత అనేక శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులు ఏపీకి బదిలీ అయ్యారు. ఉమ్మడి రాజధాని పదేళ్లపాటు ఉన్నప్పటికీ రాజధానిని అభివృద్ధి చేసుకునే క్రమంలో అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సచివాలయం, అసెంబ్లీ, వివిధ రాష్ట్ర స్థాయి శాఖలు కార్యాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులు తప్పనిసరి పరిస్థితుల్లో హైదరాబాద్ నుంచి అమరావతికి రావాల్సి వచ్చింది.
ఒక్కసారిగా హైదరాబాద్ నుంచి రావడంలో అనేక ఇబ్బందులు ఉన్నాయంటూ పలువురు ఉద్యోగులు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో వారికి అనేక వెసులుబాటులు కల్పించింది. వారంలో ఐదు రోజులు మాత్రమే పని చేసే అవకాశాన్ని కల్పించడంతోపాటు ఐదురోజులు ఉండేందుకు అనుగుణమైన వసతి సదుపాయాన్ని కల్పించింది. ప్రభుత్వమే వారికి అవసరమైన వసతి ఏర్పాట్లు చేసింది. గతంలో ఇచ్చిన ఉచిత వసతికి సంబంధించిన గడువు ముగియడంతో ఉద్యోగులు డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీన్ని పలువురు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో తాజాగా ఉచిత వసతికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. ఇది అనేక విభాగాలకు చెందిన ఉన్నతాధికారులకు మేలు చేకూర్చనుంది.
ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం 2017 నుంచి ఈ సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఏటా ఉద్యోగ సంఘాల నేతల వినతితో ప్రభుత్వం ఈ మేరకు సదుపాయాన్ని కల్పిస్తోంది. 2022 జూన్‌లో ఏపీ సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లోని ఉద్యోగులకు కల్పిస్తున్న ఉచిత గృహ వసతి సౌకర్యాన్ని అప్పటి ప్రభుత్వం రద్దు చేసింది. వెంటనే ఉద్యోగులు ఉంటున్న ప్లాట్లను ఖాళీ చేసి ఇవ్వాలని జీఏడీ ఆదేశించింది. దీనిపై ఉద్యోగ సంఘాలు వెంటనే ముఖ్యమంత్రిని కలిసి రిక్వెస్ట్ చేయడంతో ఏడాదిపాటు పొడిగించారు. అప్పటి నుంచి ఏటా పొడిగిస్తూ వస్తున్నారు. ఉద్యోగులు కోసం ప్రతిరోజూ సికింద్రాబాద్ నుంచి విజయవాడకు ప్రత్యేక రైలును నడుపుతున్నారు. కొందరు రోజూ హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లి వస్తుంటారు. ఇదిలా ఉంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యోగులు విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తోంది. రెండు నెలలు నుంచి ఒకటో తేదీన జీతాలను చెల్లిస్తోంది. దీని పట్ల ఉద్యోగులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.