అన్వేషించండి
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Perni Nani: ఏపీలో పోలీసులపైనా దాడులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు మెదపరు? పేర్ని నాని
Andhra Pradesh News: రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని కొత్త పోకడలు కూటమి ప్రభుత్వంలో చూస్తున్నామని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. లోకేష్ ప్రకటించిన రెడ్ బుక్ రాజ్యంగం అమలవుతుందన్నారు.
Perni Nani: ఏపీలో గడిచిన రెండు నెలలుగా నారా లోకేష్ ప్రకటించిన రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు అవుతుందని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (పేర్ని నాని) మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి ఏపీలో కూడా ఏ రోజు చూడని పోలీసు పోకడలను చూస్తున్నామని విమర్శించారు. బీహార్, యూపీ రాష్ట్రాలో ప్రభుత్వ ప్రేరేపిత హింస గతంలో చూశామని... ఏపీలో ఇప్పుడు అదే రాజకీయ ప్రేరేపిత హింసను మళ్లీ చూస్తున్నామని చెప్పారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన నేతల చేతిలో పోలీసులు అగౌరవం పొందుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడే పోలీసు విధి నిర్వహణను కొత్త పోకడలతో నడిపించే పరిస్థితి కనిపిస్తోందన్నారు. పోలీసుల సమక్షంలోనే ఇదంతా జరుగుతోందన్నారు. చివరకు పోలీసులపైనా దాడులు జరుగుతున్నాయంటూ గుర్తు చేశారు. ఇంత జరుగుతున్నా, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ నోరు మెదపడం లేదని ప్రస్తావించారు.
నంద్యాల హత్య హేయం
నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారామాపురంలో జరిగిన దారుణ హత్య అత్యంత హేయమన్నారు పేర్ని నాని.. ఆ ఘటనపై కూటమి ప్రభుత్వ పెద్దలు సిగ్గు పడాలన్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్ధను కూటమి ప్రభుత్వం ఏ స్థాయిలో దిగజార్చిందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని అన్నారు. జిల్లా కేంద్రానికి కేవలం 12 కి.మీ దూరంలో ఉన్న సీతారామాపురంలో టీడీపీ మూకలు దాడి చేసి, దారుణంగా హత్య చేసినా పోలీసులు స్పందించలేదని పేర్ని నాని అన్నారు. పైగా పరిస్థితి గురించి హెచ్చరించిన జయనారపురెడ్డిని కూడా భయపెట్టి, మహానంది పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తలదాచుకోవాలని సూచించారని గుర్తు చేశారు. గతంలో ఇలాంటి పరిస్థితులు తలెత్తితే, పోలీస్ బెటాలియన్లు వేగంగా తరలి వచ్చేవి. అదే ఇప్పుడు ఎవరైనా తమను ప్రత్యర్థులు చంపేస్తారని, కాపాడాలని ఫోన్ చేస్తే.. నిన్ను మేం రక్షించలేం. కాబట్టి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తలదాచుకో’.. అంటున్నారని. ఇది రెడ్‌బుక్ రాజ్యాంగం అమలును సూచిస్తోందన్నారు పేర్ని నాని.
ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే
సీతారామాపురంలో జరిగిన సుబ్బారాయుడి హత్య ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అని ఆయన తేల్చి చెప్పారు. హత్య జరిగిన తరవాత తాపీగా అక్కడికి చేరుకున్న పోలీసులు, శవాన్ని కాపలా కాయడం కోసం వచ్చినట్లు ఉందని ఎద్దేవా చేశారు. ఇంత దారుణం జరిగినా ఎల్లో మీడియా.. ఈనాడులో అసత్య కథనం రాశారన్నారు. ఎవరో దుండగలు హత్య చేశారని రాయడం ఏ రకమైన జర్నలిజమని ప్రశ్నించారు. రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని రాష్ట్రంలో ఓ రిటైర్డ్ డీజీపీ, ఐజీ.. ఇద్దరూ కలిసి అమలు చేస్తున్నారని.. దేశంలో ఇంత కిరాతకంగా రాజ్యాన్ని నడుపుతున్న ప్రభుత్వం ఎక్కడైనా ఉందా? అని పేర్ని నాని ప్రశ్నించారు. అలాగే, ఇంత ప్రభుత్వ ప్రేరేపిత హింస ఏ రాష్ట్రంలోనైనా జరుగుతోందా? అంటూ నిలదీశారు.
అసలు ఏపీలోనే ఉన్నామా ?
ఇది ఇలా ఉంటే జగ్గయ్యపేటలో గంజిపల్లి శ్రీనివాస్‌పై అత్యంత దారుణంగా పచ్చమూకలు దాడి చేశాయని పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవన్నీ చూస్తుంటే.. అసలు మనం ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నామా? అన్న సందేహం కలుగుతోందన్నారు. మణిపూర్‌కు మించి రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయని చెప్పారు. ఇంత జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారే తప్ప.. కాపాడే ప్రయత్నం చేయకపోవడం దారుణమన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ శాంతిభద్రతలపై మాటలతో ప్రజలను ఎలా మభ్యపెట్టారని ఆరోపించారు. ఎన్నికలకు ముందు వాలంటీర్ వ్యవస్ధను కొనసాగిస్తానని, వారికి రూ.10 వేలు ఇస్తానని చెప్పిన చంద్రబాబు, ఈరోజు మాట తప్పి.. వారిని తొలగిస్తున్నారని ఆరోపించారు.
సూపర్ సిక్స్ సంగతేంటి ?
ఎన్నికలకు ముందు గొప్పగా ఊదరగొట్టిన సూపర్‌సిక్స్ గురించి, సీఎం చంద్రబాబు నేటి కలెక్టర్ల సమావేశంలో ప్రస్తావించక పోవడం దారుణమని పేర్ని నాని అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా, ఇవాళ రాష్ట్రంలో హింసారాజ్యాన్ని నడుపుతున్నారని ఆయన దుయ్యబట్టారు. మరోవైపు సోషల్ మీడియాను భ్రష్టు పట్టించింది, పూర్తిగా దిగజార్చింది చంద్రబాబు కాదా? అని నాని నిలదీశారు. పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు తాను కానిస్టేబుల్ కొడుకునని.. ఖాకీ విలువ తెలుసని చెప్పారని.. మరి ఇవాళ రాష్ట్రంలో పోలీసులపై దాడి చేస్తుంటే నోరెందుకు మెదపడం లేదని ప్రశ్నించారు. మరోవైపు బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న సీఎం చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటికి గతంలో మీ హయాంలో నీటిపారుదల శాఖ మంత్రి నోటీసులు ఇచ్చిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. అసలు ఆ ఇల్లు చంద్రబాబుగారిదా? లింగమనేని రమేష్‌దా? లేక ప్రభుత్వానిదా? అన్న దానిపై సమాధానం చెప్పాలని పేర్ని నాని డిమాండ్ చేశారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
హైదరాబాద్
విశాఖపట్నం
పాలిటిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement