Gowtham Sawang Transfer: ఏపీలో ఎంత పెద్ద అధికారి అయినా, తేడా వస్తే అంతే ! గతంలో ఏం జరిగిందంటే !
AP DGP Gautam Sawang Transferred: ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ బదిలీ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. సర్వీసు పూర్తవకుండానే హఠాత్తుగా టాప్ మోస్ట్ అధికారులు బదిలీ అయిపోతున్నారు.
AP DGP Gowtham Sawang Shunted Out: సీఎంకు నచ్చకపోయినా నీకే రిస్కు.. నీకు నచ్చకపోయినా నీకే రిస్కు.. ! ఇదీ తాజాగా ఏపీలో ఉన్నతాధికారుల మధ్య నలుగుతున్న అంశం. తెలుగు రాష్ట్రాలను షాక్ కు గురి చేసిన ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ బదిలీ తర్వాత ఒక్కసారిగా రాష్ట్రంలోని టాప్ మోస్ట్ అధికారుల్లో అనుమానాలు మొదలయ్యాయి. అప్పటివరకూ ఎదురులేని అధికారం చేతిలో ఉన్న వాళ్ళు కూడా అకస్మాత్తుగా వచ్చే ఒక్క ఆర్డర్ తో మూటాముల్లె సర్దుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా సీఎం జగన్‌తో సన్నిహిత సంబంధాలున్న వాళ్లకు ఇదే పరిస్థితి ఎదురవుతుండడంతో అసలు ఏపీ సచివాలయంలో ఏం జరుగుతుంది అన్న చర్చ జరుగుతోంది.
నిజానికి ఇలాంటి బ్యూరోక్రాట్‌ల బదిలీలపై ఎప్పుడో గానీ సామాన్య జనాల్లో పెద్దగా పట్టింపు ఉండదు. కానీ గౌతమ్ సవాంగ్ బదిలీ మాత్రం ప్రత్యేకం. గత ప్రభుత్వ హయాంలో కాల్ మనీ వ్యవహారాన్ని స్ట్రిక్ట్ గా డీల్ చేసిన ఆఫీసర్‌గా గౌతమ్ సవాంగ్‌కి పేరు వచ్చింది. 2019లో వైఎస్ జగన్ సీఎం అయ్యాక గౌతమ్ సవాంగ్ నే డీజీపీగా ఎంచుకున్నారు. అయితే ఇన్నేళ్లూ సజావుగా సాగుతున్న వ్యవహారంలో ఎక్కడ చెందిందో కానీ డీజీపీని ఇంకా ఏడాది సర్వీస్ ఉండగానే ట్రాన్స్ ఫర్ ఆర్డర్ పలకరించింది. అయితే ఏపీలో ఇలాంటి సడన్ బదిలీలు ఇప్పుడే మొదలవలేదు.
ఎల్వీ సుబ్రహ్మణ్యంతో మొదలైందా..
ఏపీ సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేశాక మొట్టమొదటి చీఫ్ సెక్రటరీగా ఎల్వీ సుబ్రహ్మణ్యం నియమితులయ్యారు. 1983 బ్యాచ్ IAS ఆఫీసర్‌గా, చాలా సీనియర్ మోస్ట్ అధికారి అయిన ఎల్వీ సుబ్రహణ్యం చాలా పదవులు నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కూడా ఎల్వీ సుబ్రహణ్యం అప్పట్లోనే జగన్ కు సంబంధించిన కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇక ఎమ్మార్ సంస్థకు అప్పటి ప్రభుత్వం కేటాయించిన కేసుల్లో సీబీఐ ఏకంగా ఆయనపై ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసింది. అయితే కోర్ట్ ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది. జగన్ అధికారం చేపట్టాక అందరూ ఊహించినట్టే ఎల్వీకి ఏపీ చీఫ్ సెక్రటరీగా పదవి దక్కింది. అప్పటికే ఆయన ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సీఎస్ గానే కొనసాగుతున్నారు. కొంతకాలం ఎల్వీకి ఏపీ సీఎంఓలో ఎదురన్నదే లేదు అనేలా పరిస్థితి ఉండేది.
ఢిల్లీలో ఏపీ భవన్ రెసిడెంట్ కమీషనర్ గా పనిచేస్తున్న ప్రవీణ్ ప్రకాష్ ఏపీకి బదిలీపై వచ్చాక వారిరువురి మధ్య ఈగో వార్ మొదలయిందని అంటారు. అందరూ ప్రవీణ్ ప్రకాష్ పై వేటు పడొచ్చు అని ఊహాగానాలు చేస్తున్న సమయంలో సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంను బదిలీ చేస్తూ ఆర్డర్స్ వచ్చాయి. ఎల్వీ సుబ్రహ్మణ్యంను బాపట్లలోని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్‌గా బదిలీ చేశారు. అప్పటికి ఎల్వీ సుబ్రహ్మణ్యానికి ఇంకా కొన్ని నెలల సర్వీస్ మాత్రమే ఉంది. ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం రేపింది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సైతం దీనిపై స్పందిస్తూ ఏరికోరి తెచ్చుకున్న ఎల్వీ ని ఇలా రిటైర్ కావడానికి కొన్ని నెలల ముందు చీఫ్ సెక్రటరీ పదవి నుండి బదలీ చేస్తున్నారంటే అక్కడేదో అవినీతి జరుగుతున్నట్టేగా అని అనుమానాలు వ్యక్తం చేసారు.
మద్దతు పలికినవారే వ్యతిరేకమై..
ఇక ఎల్వీ సుబ్రహ్మణ్యంను సాగనంపిన పద్ధతిపై మాజీ బ్యూరో క్రాట్లు మండిపడ్డారు. అప్పటివరకూ పరోక్షంగానో, ప్రత్యక్షంగానో జగన్‌కు మద్దతు పలికిన మాజీ ఐఏఎస్ లు కూడా ఈ పద్దతి సరికాదంటూ జగన్ తీరుపై రూటు మార్చారు. అలాంటి వారిలో మాజీ ఐఏఎస్ లు ఐవైఆర్ కృష్ణారావు, ఈఏయస్ శర్మ లాంటి వారు ఉన్నారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలు రాష్ట్రానికి మంచిది కాదంటూ వారు సీఎం జగన్‌కు లేఖలు సైతం రాశారు.
ఆదిత్యనాథ్ దాస్
మాజీ సీఎస్ ఆదిత్యనాథ్‌ను మరీ ఇంత ఘాటుగా కాకపోయినా ఆయన్ని కూడా కాస్త ఇబ్బందికరంగానే సాగనంపారు అని అప్పట్లో కథనాలు వెలువడ్డాయి. ఆయన పదవీకాలం ఇంకో 20 రోజులు మిగిలి ఉండగానే కొత్త చీఫ్ సెక్రటరీని ఏపీ ప్రభుత్వం అనౌన్స్ చేసింది. నిజానికి అప్పటికే ఆయన పదవీకాలాన్ని ఒకసారి పొడిగించింది ఏపీ సర్కార్. 2021 జూన్‌తో ఆయన సర్వీస్ ముగియాల్సి ఉండగా దాన్ని 2021 సెప్టెంబర్ 20 వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ మధ్యలో ఏం జరిగిందో కానీ ఆయన సర్వీస్ మరో 20 రోజులు మిగిలి ఉండగానే కొత్త సీఎస్ గా నీలం సాహ్ని పేరును ధృవీకరించింది ఏపీ ప్రభుత్వం. అధికారంలో ఉన్న చీఫ్ సెక్రటరీ స్థానంలో క్రొత్త వారిపేరు అనుకున్నప్పటికీ ప్రస్తుతం పనిచేస్తున్న అధికారి రిటైర్ అయ్యేవరకూ కొత్త పేరు అనౌన్స్ చెయ్యరు. కానీ ఆదిత్యనాథ్ దాస్ విషయంలో 20 రోజుల ముందుగానే కొత్త సీఎస్ పేరు బయటకు వచ్చేసింది. కొన్నాళ్ళు గడిచాక మళ్ళీ ఆదిత్యనాథ్ దాస్ ను పిలిచి సలహాదారుగా పదవి ఇచ్చింది ఏపీ సర్కార్.
ప్రవీణ్ ప్రకాష్ కీ తప్పని బదిలీ వేటు
నిన్న మొన్నటి వరకూ ఏపీ సీఎంఓలో హవా అంతా ప్రవీణ్ ప్రకాష్ దే అన్నట్లుగా ఉండేది. సీఎం జగన్‌తో కరెక్ట్ సింక్ లో ఉండే అధికారిగా ప్రవీణ్ ప్రకాష్ మాటకు ఎదురుండేది కాదు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలని తూచా తప్పకుండ అమలు చేసే అధికారిగా ఆయనకు పేరుంది. ఆ ప్రక్రియలో ఎలాంటి విమర్శలు ఎదురైనా ఆయన లక్ష్యపెట్టేవారు కాదంటారు ప్రవీణ్ ప్రకాష్ గురించి తెలిసినవారు. రిపబ్లిక్ పరేడ్ సమయంలో సీఎం ముందు మోకాళ్లపై కూర్చున్నారు అంటూ కామెంట్స్ వచ్చినా ఆయన లెక్కపెట్టింది లేదు. అలాంటిది ఒక్కసారిగా ప్రవీణ్ ప్రకాష్ ను ఢిల్లీలోని ఏపీభవన్ రెసిడెంట్ కమీషనర్ గా బదిలీ చేస్తూ ఆర్డర్స్ రావడం అందరినీ ఆశ్చర్య పరిచింది. ప్రవీణ్ ప్రకాష్‌నే ఎప్పటినుండో ఢిల్లీకి వెళ్లాలని కోరుకుంటున్నారు అందులో భాగంగానే ఈ బదిలీ అని ఆయన సన్నిహితులు అంటున్నారు. అయితే ఇటీవల ఆయన తీసుకుంటున్న నిర్ణయాల వల్ల సీఎంతో గ్యాప్ రావడం ముఖ్యంగా ఉద్యోగుల ధర్నా, పీఆర్సీ సమస్య లాంటి వాటిని సరిగ్గా డీల్ చేయలేకపోవడం ఈ బదిలీకి కారణం అనే వాదనా వినపడుతుంది. కారణం ఏదైనా కానీ ప్రవీణ్ ప్రకాష్ లాంటి కీలక అధికారి బదిలీ జగన్ సన్నిహితులకు సైతం షాక్ కొట్టేలా చేసింది.
ఆఫీసర్ లే కాదు సీయం ఆఫీస్ నుండి ప్రభుత్వ సలహాదారులూ హఠాత్తుగా రాజీనామా బాట పడుతున్నారు. వారికి చెందిన దినపత్రికలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ జగన్ విపక్షంలో ఉన్నపుడు శక్తివంచన లేకుండా తన వంతు తోడ్పాటు అందించిన సీనియర్ జర్నలిస్ట్ కె . రామచంద్ర మూర్తి విషయంలో జరిగింది అని ప్రచారం జరిగింది. జగన్ అధికారంలోకి వచ్చాక ఏపీ అడ్వైజర్‌గా నియమితులైన ఆయన అకస్మాత్తుగా తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల వైదొలుగుతున్నట్టు రాజీనామా చేసినా, సలహాదారు పదవి అనేది కేవలం ఒక అలంకార ప్రాయంగానే ఉండడం, కనీసం సీఎం అపాయింట్‌మెంట్ కూడా దొరకకపోవడం ఆయన్ను అంతర్మథనానికి గురిచేశాయని ఆయన సన్నిహితులు చెబుతుంటారు.
వైఎస్ జగన్‌ది భిన్నమైన విధానం..
గతంలో ఏపీని పాలించిన ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కానీ, చంద్రబాబు నాయుడు గానీ వారికంటూ ఎంత ఛరిష్మా ఉన్నా కొంతమంది బ్యూరోక్రాట్స్ పై పూర్తిగా ఆధారపడేవారు. అడ్మినిస్ట్రేషన్ పరంగా వారినే ఫాలో అవుతూ వెళ్లేవారు. మధ్యలో చిన్న చిన్న అవగాహనా పరమైన ఇబ్బందులు గానీ, నిర్ణయాల అమలులో తేడాలు గానీ ఎదురైనా వారు పెద్దగా పట్టించుకునేవారు కాదు. గానీ ఎందుకో జగన్ కి బ్యూరో క్రసీపై అధికంగా ఆధారపడే లక్షణం లేదంటారు ఆయన సన్నిహితులు.
ప్రజలే తనకు ముఖ్యం అన్నట్టు వ్యవహరిస్తారనీ అందులో భాగంగా తాను తీసుకునే నిర్ణయాల అమల్లో ఏమాత్రం తేడా జరిగినా అధికారుల విషయంలో కఠినంగానే వ్యవహరిస్తారనీ అంటున్నాయి సీఎంఓ వర్గాలు. ఎంత పెద్ద అధికారి అయినా.. తనకు ఎంత సన్నిహితుడైనా రెండో మాటే ఉండదని, అందుకే అప్పటివరకూ పవర్ ఫుల్ గా కనిపించే అధికారులు సైతం బదిలీ ఉత్తర్వులకి రెడీగా ఉండాలి అని అధికారుల మధ్య చర్చ జరుగుతుంది. దానితో ఏపీలో ఎప్పుడు ఏ అధికారికి ఎలాంటి ఏ బదిలీ వస్తుందో తాడేపల్లికే ఎరుక అన్న వాదన గౌతమ్ సవాంగ్ బదిలీ వ్యవహారంతో చర్చ మళ్లీ మొదలైంది.
Also Read: Sawang Transfer : ఏపీ డీజీపీ సవాంగ్ బదిలీ - ఇంటలిజెన్స్ చీఫ్ కసిరెడ్డికి అదనపు బాధ్యతలు !
Also Read: Sawang Lokesh : డీజీపీ సవాంగ్ బదిలీకి నారా లోకేష్ కారణమా?