Pawan Kalyan: రాష్ట్రానికి పట్టిన పీడ విరగడై ఏడాది, జూన్ 4న జనసేన కార్యక్రమాలు
Andhra Pradesh News | సుపరిపాలన మొదలై ఏడాది... పీడ విరగడై ఏడాది అనే కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో విస్తృతంగా ఈ వేడుకలపై డిజిటల్ క్యాంపెయిన్ చేయాలన్నారు.

Janasena Party News | మంగళగిరి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విజయం సాధించి ఏడాది పూర్తికావొస్తుంది. ఈ క్రమంలో సుపరిపాలన మొదలై ఏడాది... పీడ విరగడై ఏడాది.. కార్యక్రమానికి జనసేన పార్టీ శ్రీకారం చుట్టింది. అరాచక పాలన సాగించిన వైసీపీ మూకలను రాష్ట్ర ప్రజలు తరిమివేసి ఏడాది పూర్తయిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కేంద్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో... రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై చేస్తున్న సుపరిపాలనకు ఒక ఏడాది పూర్తయింది. ఈ శుభ తరుణాన్ని పురస్కరించుకుని పండగ చేసుకుందామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.
సుపరిపాలన మొదలై ఏడాది అనే పేరుతో 4వ తేదీ ఉదయం మన వాకిళ్లను రంగవల్లులతో అలంకరించాలనీ, మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించాలని సూచించారు. ఈ మేరకు పార్టీ నాయకులు, వీర మహిళలు, శ్రీణులకి కేంద్ర కార్యాలయం నుంచి సమాచారం ఇచ్చారు. ఈ నెల 4వ తేదీన సంక్రాంతి- దీపావళి (Diwali) పండుగను కలిపి చేసుకుందాము. ఈ వేడుకల గురించి సోషల్ మీడియాలో పోస్ట్ లు చేయాలని, సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా డిజిటల్ క్యాంపెయిన్ చేపట్టాలని Pawan Kalyan దిశా నిర్దేశం చేశారు.

ఏపీలో వైసీపీ పీడ విరగడై ఏడాది అయిన సందర్భంగా సాయంత్రం దీపావళి మాదిరిగా దీపాలు వెలిగించి, టపాకాయలు కాల్చాలనీ పార్టీ శ్రేణులకు సూచించారు. ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని జనసేన శ్రేణులకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ మేరకు జనసేన అధ్యక్షుడి రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ జనసేన కేంద్ర కార్యాలయం మంగళగిరి నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు.
‘గత ప్రభుత్వ హయాంలో చతికిలబడ్డ అభివృద్ధిని మళ్లీ పరుగులు పెట్టించే విధంగా కూటమి పాలన సాగుతుంద’ని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందులు వేధిస్తున్నా ఇచ్చిన మాట ప్రకారం హామీలు అమలు చేస్తున్నామన్నారు. పిఠాపురం వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ గా వాకపల్లి దేవి సూర్యప్రకాశ్, వైస్ ఛైర్మన్ గా గాది రాజాబాబు, డైరెక్టర్ల ప్రమాణస్వీకార మహోత్సవం ఆదివారం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ఆవరణలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నాదెండ్ల మనోహర్, శాసనమండలిలో ప్రభుత్వ విప్ పి. హరిప్రసాద్ ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించాం కనుక ఈ రోజు ఇటువంటి కార్యక్రమం చేసుకోగలుగుతున్నాం. ప్రజలు మనపై ఉంచిన నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలి. ముఖ్యంగా పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ ను 70 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించారు. అందుకు తగ్గట్టే ఆయన తన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. రోడ్లు, మౌలిక వసతుల కల్పన, రైల్వే వంతెనలు ఇలా అని పనులను శరవేగంగా చేస్తూ రాష్ట్రంలోనే నెంబర్ వన్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతున్నారు. దళిత మహిళ వాకపల్లి దేవి సూర్యప్రకాష్ గారికి ఈ రోజు మార్కెట్ యార్డు ఛైర్మన్ గా అవకాశం కల్పించారు.
రైతు సంక్షేమానికి పెద్ద పీట
కూటమి పాలనలో అన్నదాతల సంక్షేమానికి పెద్ద పీట వేస్తామన్నారు నాదెండ్ల. వైసీపీ ప్రభుత్వం రైతులకు రూ. 1674 కోట్లు ధాన్యం బకాయిలు పెడితే కూటమి ప్రభుత్వం వచ్చిన నెలలోనే వాటిని చెల్లించింది. భారతదేశ చరిత్రలోనే మొట్ట మొదటసారిగా రూ.12,400 కోట్ల విలువైన ధాన్యాన్ని ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసింది. 8 లక్షల మంది రైతులకు 24 గంటల్లోనే వారి ఖాతాల్లో డబ్బులు జమ చేశాం.
ఒకటో తేదీ ఆదివారం రావడంతో ముందు రోజే అంటే నిన్నే 68 లక్షల మందికి పెన్షన్లు అందించాం. ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నాం. రూ.13 వేలు వేతనం అందుకుంటున్నారని వైసీపీ హయాంలో పారిశుద్ధ్య కార్మికుల రేషన్ కార్డులు కోత పెట్టారు. కూటమిలోని మూడు పార్టీలు క్షేత్రస్థాయిలో కలిసి పని చేయడం అనేది అంత సులువు కాదు. కానీ మూడు పార్టీలు కలసికట్టుగా ఉంటేనే రాష్ట్రానికి, మనకు భవిష్యత్తు అన్నారు.






















