Law Nestham: ‘లా నేస్తం’ నిధులు విడుదల చేసిన సీఎం జగన్, 2,011 మందికి లబ్ధి
సీఎం వైఎస్ జగన్ బుధవారం (ఫిబ్రవరి 22) సీఎం క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి ఆ మొత్తాన్ని జూనియర్ న్యాయవాదుల ఖాతాల్లోకి జమ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ‘లా నేస్తం’ నిధులను విడుదల చేశారు. గత మూడు సంవత్సరాలుగా వీటిని విడుదల చేస్తూ వస్తున్నారు. న్యాయవాదులకు ప్రభుత్వం తోడుగా ఉందని చాటేందుకు ఈ ‘లా నేస్తం’ నిధులను అందిస్తున్నట్లుగా సీఎం జగన్ చెప్పారు. లా డిగ్రీ తీసుకున్న తర్వాత మొదటి మూడేళ్లు న్యాయవాదిగా స్థిరపడేందుకు ‘లా నేస్తం’ పథకం కచ్చితంగా ఉపయోగపడుతుందని జగన్ చెప్పారు. ఈ పథకం కింద తాజాగా ప్రభుత్వం రూ.కోటికి పైగా నిధులను విడుదల చేసింది.
దీనివల్ల తాజాగా అర్హులైన 2,011 మంది జూనియర్ లాయర్లు లబ్ధి పొందారు. సీఎం వైఎస్ జగన్ బుధవారం (ఫిబ్రవరి 22) సీఎం క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి ఆ మొత్తాన్ని జూనియర్ న్యాయవాదుల ఖాతాల్లోకి జమ చేశారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలో భాగంగా జూనియర్ న్యాయవాదులను ఆదుకునేందుకు ప్రభుత్వం ‘లా నేస్తం’ పథకాన్ని తీసుకొచ్చింది.
లా నేస్తం ద్వారా కొత్తగా న్యాయవాద వృత్తిలోకి వచ్చిన జూనియర్ న్యాయవాదులు వృత్తిలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులను తట్టుకుని నిలబడేందుకు వీలుగా అర్హులైన ప్రతి జూనియర్ న్యాయవాదికి నెలకు రూ.5వేల చొప్పున మూడేళ్లపాటు ఆర్థిక సాయం అందిస్తున్నారు. బుధవారం చెల్లించిన మొత్తంతో కలిపి ఇప్పటివరకు 4,248 మంది న్యాయవాదులకు మూడున్నర సంవత్సరాల్లో ఆర్థిక సాయం రూ.35.40 కోట్లు అందింది. ఇదే సమయంలో న్యాయవాదులను ఆదుకునేందుకు రూ.100 కోట్లతో కార్పస్ ఫండ్‌ను కూడా ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందుకోసం అడ్వొకేట్ జనరల్ ఆధ్వర్యంలో న్యాయ, ఆర్థిక శాఖ కార్యదర్శులు సభ్యులుగా ఓ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసింది. కొవిడ్ సమయంలో న్యాయవాదులను ఆదుకునేందుకు ఈ కార్పస్ ఫండ్ నుంచి రూ.25 కోట్లను వైఎస్ జగన్ ప్రభుత్వం విడుదల చేసింది.
అంతకుముందు ఎయిర్ పోర్టులో గవర్నర్‌కు వీడ్కోలు
గన్నవరం ఎయిర్ పోర్ట్‌లో బుధవారం ఉదయం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వీడ్కోలు పలికారు. గవర్నర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఆయన ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా బదిలీ అయిన సంగతి తెలిసిందే. ఏపీలో మూడున్నర ఏళ్ల పాటు గవర్నర్‌గా పని చేశారు. వీడ్కోలు కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్, శాసన మండలి ఛైర్మన్ మోషేన్ రాజు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, గవర్నర్ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, కృష్ణా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా,ఎస్పీ జాషువా, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.