(Source: ECI/ABP News/ABP Majha)
ప్రధానితో సీఎం జగన్ భేటీ- రాష్ట్ర సమస్యలు ప్రస్తావించినట్టు సమాచారం!
దిల్లీ పర్యటనలో ఉన్న సీఎం జగన్ రాష్ట్ర సమస్యలపై ప్రధానికి వినతి పత్రం సమర్పించారు. పీఎంతోపాటు ఇతర మంత్రులతో కూడా సమావేశమవుతున్నారు.
దిల్లీ పర్యటనలో ఉన్న సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం అయ్యారు. ఆయనతోపాటు విజయసాయిరెడ్డి కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ప్రధానితో సమావేశం సందర్భంగా ఏపీకి సంబంధించిన పలు అంశాలు ప్రస్తవించినట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన సవరించిన అంచనాలు ఆమోదించినా రిక్వస్ట్ చేశారట. నిధులు కూడా విడుదల చేయాలని అభ్యర్థించినట్టు చెబుతున్నారు. నిర్వాసితుల ప్యాకేజీకి సంబంధించిన అంశాలను కూడా డిస్కషన్ చేసినట్టు పార్టీ నేతలు సమాచారం అందిస్తున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని ఇంకా పెండింగ్‌లో ఉన్న అంశాలు, నిధుల విడుదల అంశాలను ప్రస్తావించినట్టు తెలుస్తోంది.
The Chief Minister of Andhra Pradesh, YS Jagan Mohan Reddy called on PM Narendra Modi in Delhi today pic.twitter.com/EOdXFJ0IAq
— ANI (@ANI) August 22, 2022
లోక్‌కళ్యాణ్ మార్గ్‌లో ప్రధాని నివాసంలో సమావేశమైన సీఎం పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని సత్వరమే పూర్తిచేయడానికి తగిన సహాయ సహకారాలు అందించాలని ప్రధానిని కోరారు సీఎం. ప్రాజెక్టు నిర్మాణ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తన సొంతంగా రూ. 2900 కోట్లు ఖర్చు చేసిందని వెల్లడించారు. వీటిని వెంటనే రియంబర్స్ చేయాలని కోరారు సీఎం. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని కోరారు. టెక్నికల్ అడ్వైజర్ కమిటీ నిర్ధారించిన ప్రాజెక్టు వ్యయం రూ.55,548.87 కోట్లకు ఆమోదించాలని రిక్వస్ట్ చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో కాంపొనెంట్‌వైజ్‌గా రియంబర్స్ విధానానికి స్వస్తి చెప్పాలని, దీనివల్ల పనుల్లో విపరీత జాప్యం ఏర్పడుతోందన్న అభిప్రాయం వ్యక్తపరిచారు. అన్ని జాతీయ ప్రాజెక్టుల్లో వ్యవహరించినట్టుగానే మొత్తం ప్రాజెక్టు వ్యయాన్నే పరిగణలోకి తీసుకుని పనులకు 15రోజుల్లో రియంబర్స్ చేయాలని సూచించారు.
డీబీటీ పద్ధతిద్వారా భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాల కింద నిర్వాసితులకు పరిహారాన్ని అందించాలని కోరారు సీఎం. ప్రాజెక్టు నిర్మాణ పనులను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లడానికి వీలుగా అడహాక్‌గా రూ.10వేల కోట్లు ఇవ్వాలని పీఎంకు అభ్యర్థించారు. రీసోర్స్ గ్యాప్ కింద రాష్ట్రానికి రావాల్సిన రూ.32,625.25 కోట్లు మంజూరు‡చేయాలన్నారు. 2014–15 కాలానికి సంబంధించిన బిల్లుల రూపంలో, 10వ వేతన సంఘం బకాయిల రూపంలో, పెన్షన్లు తదితర రూపంలో రాష్ట్రానికి రావాల్సిన ఈనిధులను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
జాతీయ ఆహార భద్రతా చట్టం కింద అర్హుల ఎంపికలో హేతుబద్ధీకరణ లేకపోవడంవల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందన్నారు సీఎం. ఇదివరకే ఈ అంశాన్ని దృష్టికి తీసుకొచ్చానంటూ ప్రధానికి వివరించారు. రాష్ట్రంలో 2.68 కోట్ల మందికి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ అందుతోందని తెలిపారు. వీరిలో 61శాతం మంది గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు కాగా, 41 శాతం మంది పట్టణ ప్రాంతాలకు చెందినవారు ఉన్నారన్నారు సీఎం. చట్టం నిర్దేశించిన ప్రకారమే గ్రామీణ ప్రాంతాల్లో 75శాతం మందికి, అర్బన్ ప్రాంతంలో 50శాతం మందికి పీడీఎస్ కింద ప్రయోజనాలు అందాల్సింది ఉందన్నారు.
ఏపీతో పోల్చుకుంటే ఆర్థికంగా మెరుగైన స్థాయిలో ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌లో రాష్ట్రం కంటే కనీసంగా 10శాతం మంది లబ్ధిదారులు అధికంగా ఉన్నారని వివరించారు సీఎం. దీనివల్ల అర్హులైన వారికి రాష్ట్రంలో వర్తింపు కావడంలేదని, కేంద్రం ఇస్తున్నదాని కంటే అదనంగా దాదాపు 56 లక్షల మందికి పీడీఎస్‌ను రాష్ట్రమే వర్తింపు చేస్తోందన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్ర భారమని వివరించారు. ఇప్పటికే దీనిపై నీతిఆయోగ్ తదుపరి కీలక నిర్ణయం తీసుకుని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసిందని పేర్కొన్నారు సీఎం.
ఆంధ్రప్రదేశ్‌కు ఇస్తున్న కేటాయింపులను పరిశీలించాలంటూ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు సీఎం. కొవిడ్ సమయంలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద కేంద్రం ఇస్తున్న దానికంటే, కేంద్రం కవర్ చేయని, అదనంగా 56 లక్షల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం వర్తింపు చేసిందన్నారు. దీనివల్ల సుమారు రూ.5,527.63 కోట్ల రూపాయలు అదనపు భారాన్ని రాష్ట్రం యోయాల్సి వచ్చిందని వివరించారు సీఎం. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కొనసాగిస్తున్నందున ఈ భారం మరింతగా పెరిగే అవకాశం ఉందన్నారు.
జాతీయ ఆహార భద్రతా చట్టం లబ్ధిదారుల గుర్తింపు విషయాన్ని వెంటనే పునఃపరిశీలన చేయాలని కోరారు సీఎం. నెలవారీగా రాష్ట్రానికి కేటాయిస్తున్న బియ్యం కోటాలో 3 లక్షల టన్నులు వృథా అవుతున్నాయని.. ఇందులో కేవలం 77వేల టన్నులు కేటాయిస్తే సరిపోతుందన్నారు. కేంద్రంపై కూడా ఎలాంటి అదనపు భారం ఉండదని ప్రధానమంత్రికి వివరించారు సీఎం. తెలంగాణ డిస్కంల నుంచి రావాల్సిన బకాయిల అంశాన్ని ప్రస్తావించారు సీఎం. రూ.6,756 కోట్లు బకాయిలు ఉన్నాయని, 8 ఏళ్లుగా ఈ సమస్య అపరిష్కృతంగానే ఉందని గుర్తు చేశారు.
తెలంగాణ నుంచి రావాల్సిన డబ్బు ఇప్పిస్తే పూర్తిగా కష్టాల్లో ఉన్న రాష్ట్ర విద్యుత్ కంపెనీలు ఒడ్డున పడతాయన్నారు సీఎం జగన్. ఉత్పత్తిదారులకు బకాయిలు చెల్లించడానికి మార్గం సుగమమం అవుతుందని తెలిపారు. విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. విభజనలో హేతుబద్ధత లేదని, దీనివల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని గుర్తు చేశారు సీఎం. పార్లమెంటుసాక్షిగా ఇచ్చిన హామీలు అణలు చేయాలన్నారు. ప్రత్యేక హోదా సహా హామీలను అమలు చేయలని విజ్ఞప్తి చేశారు. పారిశ్రామిక రంగం వృద్ధి, ఉద్యోగాల కల్పన, కేంద్రంనుంచి గ్రాంట్లు, పన్ను రాయితీలు తదితర ప్రయోజనాలు ప్రత్యేకతరగతి హోదా ద్వారా వస్తాయని, తద్వారా రాష్ట్రంపై భారం తగ్గుతుందన్నారు.
రాష్ట్రంలో 26 జిల్లాలకు కేవలం 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయని... కొత్తగామూడు కాలేజీలకు అనుమతి ఇచ్చారని, వాటి పనులు కూడా జరుగుతున్నాయని వివరించారు. ఇంకా 12 కాలేజీలకు అనుమతులు రావాల్సి ఉందన్నారు. వీటిని మంజూరు చేయాలని పీఎంకు విజ్ఞప్తి చేశారు సీఎం. కడపలో ఇంటిగ్రేటెడ్ స్టీల్‌ప్లాంట్ కోసం ఏపీఎండీసీకి ఇనుప గనులు కేటాయించాలని కోరారు. స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుకు గనుల కేటాయింపు చాలా కీలకమని, స్థిరంగా ఖనిజం రవాణా అన్నది ప్రాజెక్టు ఏర్పాటులో అత్యంత కీలక అంశమని తెలిపారు. ఏపీఎండీసీకి బీచ్‌శాండ్ మినరల్ ఏరియాలను కేటాయించాలను కోరిన సీఎం... 14 ఏరియాల కేటాయింపు అంశం ఇంకా పెండింగులో ఉందని గుర్తు చేశారు. ఈ రంగంలో దాదాపు రూ.20వేల కోట్ల పెట్టుబడులు వచ్చేందుకు అవకాశం ఉందని తెలిపారు.
కాసేపటి క్రితం కేంద్రమంత్రి ఆర్కే సింగ్‌తో కూడా సీఎం జగన్ భేటీ అయ్యారు. తెలంగాణ నుంచి రావాల్సిన ఆరువేల కోట్ల విద్యుత్ బకాయిలు అందేలా చూడాలని వేడుకున్నారు. కాసేపట్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సీఎం భేటీ కానున్నారు. ఆమె రాష్ట్రపతిగా ఎన్నికైన తొలిసారి భేటీ అవుతున్నారు. ఆమెకు శుభాకాంక్షలు చెప్పేందుకే సమావేశమవుతున్నట్టు పార్టీ శ్రేణులు వెల్లడించాయి.