CM Jagan Meets Governor: గవర్నర్‌ను కలిసిన జగన్ దంపతులు - ధన్యవాదాలు తెలిపిన సీఎం
సీఎం జగన్ బిశ్వభూషణ్‌కు వెంకటేశ్వరస్వామి ప్రతిమ బహూకరించగా, గవర్నర్ దంపతులు సీఎంకు శ్రీకృష్ణుడి విగ్రహాన్ని స్మారకంగా ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దంపతులు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిశారు. ఆయన ఏపీ నుంచి బదిలీపై ఛత్తీస్‌గఢ్‌కు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఆంధ్రా గవర్నర్‌గా మూడున్నర సంవత్సరాల పాటు ఆయన పని చేసి, ఛత్తీస్‌గఢ్‌కు బదిలీపై వెళ్తున్నందున బిశ్వభూషణ్‌కు సీఎం జగన్ కృతజ్ఞతలు తెలిపారు. సీఎం జగన్‌తో పాటు ఆయన సతీమణి భారతి కూడా ఉన్నారు. సీఎం జగన్ బిశ్వభూషణ్‌కు వెంకటేశ్వరస్వామి ప్రతిమ బహూకరించగా, గవర్నర్ దంపతులు సీఎంకు శ్రీకృష్ణుడి విగ్రహాన్ని స్మారకంగా ఇచ్చారు. జగన్ సతీమణి వైఎస్ భారతి, గవర్నర్ భార్యకు చీరను బహూకరించారు.
ఆంధ్రప్రదేశ్‌కు కొత్త గవర్నర్‌గా సుప్రీకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్‌ను రాష్ట్రపతి నియమించిన సంగతి తెలిసిందే. గతంలో ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా పని చేశారు. ఆయోధ్య తీర్పు ఇచ్చిన ఐదుగురు జడ్జిల ధర్మాసనంలో ఆయన కూడా ఒకరు. ఏపీతో పాటు మొత్తం 12 మంది కొత్త గవర్నర్ల నియామకం జరిగింది. వీరికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఏపీ గవర్నర్‌గా ఉన్న బిశ్వభూషణ్ హరిచందన్‌ను (Biswa Bhushan Harichandan) ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా నియమించారు. మహారాష్ట్ర గవర్నర్‌గా (Maharastra Governor) రమేశ్ బైస్ నియమితులు అయ్యారు. ఇప్పటివరకు ఈయన ఝార్ఖండ్ గవర్నర్ గా ఉన్నారు. మహారాష్ట్రకు ప్రస్తుత గవర్నర్ గా ఉన్న భగత్ సింగ్ కోశ్యారీ చేసిన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు.
వీటితో పాటు ఇంకొన్ని రాష్ట్రాలకు కూడా గవర్నర్లను మార్చారు. మొత్తంగా 12 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి భవన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ గా లెఫ్టినెంట్ జనరల్ కైవాల్య త్రివిక్రమ్ పట్నాయక్, సిక్కిం గవర్నర్ గా లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, ఝార్ఖండ్ గవర్నర్ గా సీపీ రాధాకృష్ణన్, అసోం గవర్నర్ గా గులాబ్ చంద్ కటారియా, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా శివ్ ప్రతాప్ ను నియమిస్తూ రాష్ట్రపతి భవన్ ప్రకటన విడుదల చేసింది.
మరోవైపు, లద్దాఖ్‌కు లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్న ఆర్కే మాథుర్ రాజీనామాను కూడా ముర్ము ఆమోదించారు. అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ గా ఉన్న బ్రిగేడియర్ బీడీ మిశ్రను ఆయన స్థానంలో నియమించారు. మణిపుర్ గవర్నర్ గా ఉన్న లా గణేశన్ ను బదిలీ చేశారు. ఆయనను నాగాలాండ్ గవర్నర్ గా ట్రాన్స్‌ఫర్ చేశారు. బిహార్ గవర్నర్ ఫాగు చౌహాన్ ను మేఘాలయా గవర్నర్ గా నియమించారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా ఉన్న రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ను.. బిహార్ గవర్నర్ గా బదిలీ చేశారు.
అబ్దుల్ నజీర్ (Justice Abdul Nazeer) ఎవరంటే
ఏపీకి కొత్త గవర్నర్ గా నియమితులు అయిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ (Justice Abdul Nazeer) 1958 జనవరి 5న కర్ణాటకలోని బెలువాయిలో పుట్టారు. మంగళూరులో న్యాయవిద్య అభ్యసించారు. 1983లో కర్ణాటక హైకోర్టులో అడ్వకేట్‌గా ప్రాక్టీస్ మొదలు పెట్టారు. తర్వాత 2003లో కర్ణాటక హైకోర్టు అడిషనల్ జడ్జిగా నియమితులు అయ్యారు. 2017 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు జడ్జిగా ఆయనకు ప్రమోషన్ వచ్చింది.