AP CM Chandra Babu: నేడు ఏపీ మంత్రిమండలి భేటీ- సాయంత్రానికి చంద్రబాబు ఢిల్లీ టూర్
Andhra Pradesh News: ఏపీ సీఎం చంద్రబాబు నేడు మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. అంతకంటే ముందు మంత్రిమండలి భేటీలో పాల్గోనున్నారు. విభజన సమస్యలు, బడ్జెట్ కేటాయింపులపై కేంద్రం పెద్దలతో చర్చిస్తారు.
Chandra Babu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. మంత్రివర్గసమావేశం అనంతరం సాయంత్రానికి ఢిల్లీ బయల్దేరతారు. త్వరలో కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న టైంలో రాష్ట్రానికి కావాల్సిన నిధులపై కేంద్రహోంమంత్రి అమిత్‌షాతో సమావేశం కానున్నారు. 2014 నుంచి పెండింగ్‌లో ఉన్న విభజన సమస్యల పరిష్కారంపై మాట్లాడనున్నారు. ఈ మధ్యకాలంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం, విభజన సమస్యల పరిష్కారం కోసం చర్చించిన విషయాలను ఆయనకు వివరిస్తారు. జులై 22న ప్రవేశపెట్టే బడ్జెట్‌లో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ఆయనతోపాటు, నిర్మలా సీతారామన్‌ను కూడా రిక్వస్ట్ చేయనున్నారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని చెప్పనున్నారు.
సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒకసారి ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా పలువురు కేంద్రమంత్రులతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి ఆయా శాఖల నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు, పెండింగ్ సమస్యలను వారితో చర్చించారు. ఇప్పుడు రెండోసారి వెళ్తున్నారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెడుతున్నటైంలో వెళ్లడం ఆసక్తిగా నెలకొంది.
నేడు మంత్రివర్గం సమావేశం
చంద్రబాబు ఢిల్లీ వెళ్లే ముందు మంత్రివర్గంతో సమావేశం కానున్నారు. ఇప్పటికే ఒకసారి సమావేశమైన మంత్రివర్గంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈవారంలో మరోసారి సమావేశం అవుతుంది. ఉచిత ఇసుక, ఇతర కీలక పథకాల అమలు, బడ్జెట్ కూర్పుపై మంత్రివర్గంలో చర్చించనున్నారు. ఢిల్లీ వెళ్తున్నందున అక్కడ చర్చించాల్సిన అంశాలపై కూడా మాట్లాడనున్నారని తెలుస్తోంది.