AP Minister Peddireddy: ఎనీ టైం బ్యాగ్ వెండింగ్ మిషన్ ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి, పర్యావరణ పరిరక్షణకు ప్రతిజ్ఞ
క్లాత్ తో రూపొందించిన బ్యాగ్ ను అందించే ఎనీ టైం బ్యాగ్ (ఎటిబి) వెండింగ్ మిషన్ ను రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు.
ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ లకు ప్రత్యామ్నాయంగా క్లాత్ తో రూపొందించిన బ్యాగ్ ను అందించే ఎనీ టైం బ్యాగ్ (ఎటిబి) వెండింగ్ మిషన్ ను రాష్ట్ర ఇంధన, పర్యావరణ, శాస్త్ర-సాంకేతిక, అటవీ, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు.
పర్యావరణ పరిరక్షణకు మంత్రి పిలుపు..
ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రిస్తాం, పర్యావరణాన్ని కాపాడుకుంటామని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని పర్యావరణ దినోత్సవం-2023 సందర్భంగా రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. విజయవాడలో జరిగిన సోమవారం జరిగిన పర్యావరణ దినోత్సవంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను సందర్శించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ లకు ప్రత్యామ్నాయంగా క్లాత్ తో రూపొందించిన బ్యాగ్ ను అందించే ఎనీ టైం బ్యాగ్ (ఎటిబి) వెండింగ్ మిషన్ ను మంత్రి ఆవిష్కరించారు. ప్లాస్టిక్ వినియోగంను నివారించడం, కాలుష్యాన్ని నియంత్రించాలంటూ పర్యావరణ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం పర్యావరణహిత కార్యక్రమాలను అమలు చేస్తున్న పరిశ్రమలు, ఆస్పత్రులు, స్థానిక సంస్థలను ప్రోత్సహిస్తూ అవార్డులను ప్రదానం చేశారు.
జీవన విధానాన్ని మార్చుకోవాలి...
1975 నుంచి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జూన్ 5వ తేదీన పర్యావరణ దినోత్సవం నిర్వహించుకుంటున్నామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గుర్తుచేశారు. అందరిలోనూ పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు, పర్యావరణంకు ముప్పు లేని జీవన విధానంను అలవర్చుకునేందుకు ఐక్యరాజ్యసమతి ఈ దినోత్సవంను ప్రకటించిందని వివరించారు. ఈ ఏడాది ప్లాస్టిక్ వినియోగం వల్ల ఏర్పడుతున్న కాలుష్యం, దానికి పరిష్కారాలు అనే అంశంపై ప్రపంచం అంతా పర్యావరణ దినోత్సవంను జరుపుకుంటోందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గతంలో విశాఖపట్నంలో పర్యటించిన సందర్భంగా ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. తిరుమలలో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ను పూర్తి స్థాయిలో నిషేధించినట్లు చెప్పారు. ఇదే తరహాలో దేవాలయాలు, మున్సిపల్ కార్పొరేషన్లలో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ను నిషేదించామని అన్నారు. కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన మిషన్ లైఫ్ ప్రోగ్రాంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చిత్తశుద్ది, అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతోనే ఈ ఘనతను సాధించగలిగామన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా కేంద్రప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఆంధ్రప్రదేశ్ లో నీటి ఆదా, విద్యుత్ పొదుపు, సరైన ఆహార విధానంను అలవరుచుకోవడం, వ్యర్థాలను తగ్గించుకోవడం, స్వచ్ఛతా కార్యకలాపాల్లో పాల్గొనడం, ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవాటు చేసుకోవడం, ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తగ్గించుకోవడం అనే ఏడు అంశాలపై ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తున్నామన్నారు. మిషన్ లైఫ్ ప్రోగ్రాంలో భాగంగా మన రాష్ట్రంలోని సముద్రతీరాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించే కార్యక్రమాన్ని 15 రోజుల పాటు ప్రజాభాగస్వామ్యంతో చేపట్టామని పేర్కొన్నారు. అలాగే అన్ని పట్టణాలు, నగరాల్లో కాలువలు, చెరువుల్లో క్లీనింగ్ కార్యక్రమాలు, పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే బైక్ ర్యాలీలు, ప్రధాన ట్రాఫిక్ కూడళ్ళ వద్ద పర్యావరణ అంశాలపై ప్రదర్శన బోర్డులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
విద్యుత్ పొదుపుపై అవగాహన...
విద్యుత్ పొదుపు చర్యలు, నీటి పరిరక్షణ విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. కాలుష్యరహిత విద్యుత్ ఉత్పత్తికి ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. సౌర విద్యుత్ ఉత్పత్తికి గానూ గత మార్చి 3, 4 తేదీల్లో విశాఖలో జరిగిన పెట్టుబడిదారుల సదస్సుకు ప్రముఖ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించి, వారితో సౌరవిద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు అవగాహన కుదుర్చుకున్నారు. ఈ సదస్సులో మొత్తం రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా, రూ. 9 లక్షల కోట్లు సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా విద్యుత్ ఉత్పత్తి రంగంలో వచ్చాయని వివరించారు. విద్యుత్ ఉత్పత్తిలో సంప్రదాయేతర వనరులకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారి మన రాష్ట్రంలో ఘన వ్యర్థాల నిర్యూలన కోసం 'ఏపీ ఎన్విరాన్ మెంట్ మేనేజ్ మెంట్ కార్పోరేషన్' ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఘన వ్యర్థాలను సురక్షితంగా నిర్మూలన చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నాం అన్నారు.