జీవో నెంబర్-1ను కొట్టివేసిన ఏపీ హైకోర్టు- ప్రాథమిక హక్కులకు భంగకరమన్న న్యాయస్థానం
రోడ్లపై బహిరంగ సభలు వద్దని చెబుతూ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ వన్‌ను హైకోర్టు కొట్టేసింది.
జీవో నంబర్ 1 ఏపీ హైకోర్టు కొట్టేసింది. ప్రాథమిక హక్కులు కాలరాసేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోదంటూ హైకోర్టు కామెంట్స్ చేసింది. రోడ్లపై బహిరంగ సభలు, రోడ్ షోలకు అనుమతి ఇవ్వొద్దని ఏపీ ప్రభుత్వం జనవరిలో ఈ జీవో నెంబర్-1ను తీసుకొచ్చింది. ఇది ప్రాథమిక హక్కులకు భంగరంగా ఉందని హైకోర్టు అభిప్రాయపడింది.
కొత్తఏడాది నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జీవో నెం.1 పెను సంచలనమే అయింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు సభలో జరిగిన తొక్కిసలాట కారణంగా కొందరు చనిపోయారు. దీంతో అలాంటి పరిస్థితి రాకూడదన్న కారణంతో ప్రభుత్వం ఈ జీవో తీసుకొచ్చింది. దీనిపై విపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు వ్యతిరేకంగా ఉందని విమర్శలు చేశాయి.
విమర్శలు ధర్నాలతో ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవడంతో న్యాయస్థానాలను ఆశ్రయించాయి విపక్షాలు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. అదే జీవోను వ్యతిరేకిస్తూ తెలుగుదేశం నేత మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, కన్నా లక్ష్మీనారాయణ, ఏపీపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు సహా చాలా మంది పిటిషన్లు వేశారు.
అన్ని పిటిషన్లు తీసుకున్న హైకోర్టు పలుమార్లు విచారించింది. అనంతరం తీర్పును నేటికి వాయిదా వేసింది. తాజాగా ఆ జీవోను కొట్టేస్తూ తీర్పు వెలువరించింది.