AP Inter College Reopen: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త కరోనా నిబంధలు వచ్చేశాయి... ఈ రూల్స్ పాటించకుంటే సమస్యలు తప్పవు
ఏపీలో కోవిడ్ నియంత్రణ మార్గదర్శకాలు జారీచేసిన ప్రభుత్వం...ఇంటర్ కాలేజీల్లో తరగతి బోధనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే రాష్ట్రానికి 2.52 లక్షల కోవిడ్ టీకాలు చేరుకున్నాయి.
ఏపీలో కరోనా నియంత్రణ రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోంది. కోవిడ్ నియంత్రణ చర్యలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశాలు జారీచేసింది. వీటిపై తాజా మార్గదర్శకాలు విడుదల చేసింది. పెళ్లిళ్లు, వేడుకల్లో గరిష్టంగా 150 మందికి మాత్రమే అనుమతి ఇచ్చింది. ఈ మార్గదర్శకాలపై వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు.
పెళ్లికి 150 మందికి అనుమతి
పెళ్లిళ్లతో పాటు ఏదైనా ఫంక్షన్లు, ప్రార్థనలు, ఇతర వేడుకల్లో 150 మందికి మించి ఉండకూడదని పేర్కొన్నారు. కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, మాస్కులు ధరించడంతో పాటు, భౌతిక దూరం పాటించాలని సూచించారు. తరచూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. సినిమాహాళ్లలో కూడా కోవిడ్ నియంత్రణ చర్యలు తప్పకపాటించాలని, సీటు మార్చి సీటు ఉండేలా చూసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ నిబంధనలు ఉల్లఘించిన వారిపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆగస్టు 16నుంచి చదువులు స్టార్ట్
ఏపీలో జూనియర్ కాలేజీల్లో ఇంటర్ రెండో సంవత్సరం తరగతులను ఆగష్టు 16వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి ప్రకటించారు. కళాశాలల్లో కోవిడ్ నియంత్రణ చర్యలు తప్పక పాటించాలని, నిబంధనలను అనుసరించి తరగతులు నిర్వహించాని ఆదేశించారు. జులై 12వ తేదీ నుంచి సెకండియర్ విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు.
విద్యాసంస్థలు తిరిగి తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చిన కారణంగా జూనియర్ కాలేజీల్లోనూ విద్యార్థులకు తరగతి బోధన చేపట్టేందుకు ఇంటర్ బోర్డు సిద్ధమైంది. కరోనా కారణంగా పరీక్షలు రద్దు చేసిన విషయం తెలిసిందే. మొదటి సంవత్సవరం విద్యార్థులందరినీ బోర్డు పాస్ మార్కులతో ఉత్తీర్ణులుగా ప్రకటించింది.
రాష్ట్రానికి 2.52 లక్షల వ్యాక్సిన్ డోసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీగా కోవిడ్ వ్యాక్సిన్లు చేరుకున్నాయి. మరో 2.52 లక్షల కోవిడ్ టీకా డోసులు గన్నవరం విమానాశ్రయానికి చేరాయి. మహారాష్ట్రలోని పుణే సీరం ఇనిస్టిట్యూట్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి వ్యాక్సిన్లు చేరుకున్నాయి. వీటిని గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి అధికారులు తరలించి, భద్రపరిచారు. ఇక్కడ నుంచి రాష్ట్రంలోని 13 జిల్లాలకు టీకాలను సరఫరా చేయనున్నారు.
Also Read: Amara Raja Batteries News: అమర రాజా కంపెనీకి భారీ ఊరట.. కాలుష్య కంపెనీల జాబితాలో లేదన్న కేంద్రం
Also Read: త్రివిక్రమ్ తో మహేష్ బాబు ప్లాన్.. రాజమౌళి కోసం వెయిట్ చేయకుండా..