Andhra Pradesh Ration Cards: ఏపీలో రేషన్ కార్డుల కోసం చూస్తున్న వాళ్లకు గుడ్ న్యూస్- నేటి నుంచే ప్రక్రియ ప్రారంభం
Andhra Pradesh Ration Cards: ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డు జాతర ప్రారంభమవుతుంది. బుధవారం నుంచి ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం చెప్పింది.

Andhra Pradesh Ration Cards: ఆంధ్రప్రదేశ్‌లో రేపటి నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసింది. అర్హులైన పౌరులు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే కార్డులు ఉన్న వాళ్లు పేర్లు మార్పులు చేర్పులు ఇతర ప్రక్రియను కూడా చేపట్టవచ్చు. చిరునామాలను మార్చుకోవచ్చు. ఈ ప్రక్రియ ద్వారా రాష్ట్రంలోని ఆహార భద్రతా వ్యవస్థను పటిష్టం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అధికారులు ఈ దరఖాస్తు ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. ఇప్పటికే రేషన్ కార్డుల్లో వివిధ మార్పుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 3.28 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని పరిష్కరించి కొత్త దరఖాస్తులను కూడా స్వీకరించనున్నారు. ఇప్పుడు క్యూఆర్ కోడ్‌తో కూడిన స్మార్ట్ రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం చూస్తోంది. ఈ స్మార్ట్ కార్డులు తీసుకొస్తే రేషన్ పంపిణీ మరింత సులభతరం అవుతుందని, అక్రమాలకు ఆస్కారం ఉండదని ప్రభుత్వం ఆలోచన.
నూతన రైస్ కార్డుల నమోదు అవకాశం రేపటి నుంచే..!
— Manohar Nadendla (@mnadendla) May 6, 2025
అందుబాటులోకి ఆరు రకాల సేవలు
1. నూతన రైస్ కార్డుల జారీ
2. కార్డుల విభజన
3. చిరునామా మార్పు
4. సభ్యులను చేర్చడం
5. ఉన్నవారిని తొలగించడం
6. కార్డులను సరెండర్ చేయడం
రేపటి నుంచి ఈ సేవలను దగ్గర్లోని గ్రామ వార్డు సచివాలయాల నుంచి… pic.twitter.com/NsXTvFJLqF
ఎవరు దరఖాస్తు చేసుకోవాలి
కొత్త రేషన్ కార్డు కోసం ప్రభుత్వం కొన్ని నిర్ధిష్ట అర్హతలు నిర్ణయించింది. దరఖాస్తుదారులు ఏపీలో శాశ్వతంగా నివసించి ఉండాలి. దరఖాస్తు చేసిన వాళ్లు కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ గతంలో రేషన్ కార్డు కలిగి ఉండకూడదు. కుటుంబంలోని సభ్యులందరికీ వార్షిక ఆదాయం ప్రభుత్వం నిర్దేశించిన పరిమితికి లోబడే ఉండాలి. ఇది గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో వేరువేరుగా ఉంటుంది. దరఖాస్తుదారులు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగం కలిగి ఉండకూడదు. ఆదాయపు పన్ను చెల్లించేవారై ఉండకూడదు.
రేషన్ కార్డులో మార్పులు కోసం ఎవరు దరఖాస్తు చేసుకోవాలి
కుటుంబ సభ్యుల చేరిక కోసం ఎదురు చూస్తున్న వాళ్లు దరఖాస్తు చేసుకోవాలి. అంటే కొత్తగా పెళ్లి అయిన వాళఅలు, ఇంతకు ముందు ఉన్న రేషన్ కార్డులో పేరుల లేనివాళ్లు అప్లై చేసుకోవాలి. మరణించిన వేరే ప్రాంతానికి శాశ్వతంగా వెళ్లిపోయినా కూడా తొలగించేందుకు దరఖాస్తు చేసుకోవాలి. చిరునామాలో మార్పుల కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు చేయడానికి ఏం కావాలి
దరఖాస్తుదారు గుర్తింపు కోసం ఆధార్ కార్డు, రేషన్ కార్డు పాస్ పోర్టు వంటి ఏదైనా గుర్తింపు పత్రం అవసరం అవుతుంది. నివాస ధ్రువీకరణ కోసం ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, టెలిఫోన్ బిల్లు, విద్యుత్ బిల్లు, నీటి బిల్లు, బ్యాంక్ స్టేట్మెంట్ ఏదైనా సరే అప్‌లోడ్ చేయాలి. ఎవరెవరి పేర్లను రేష్ కార్డులో నమోదు చేస్తున్నామో వారి ఆధార్ కార్డులు కచ్చితంగా ఉండాలి. దరఖాస్తుదారుని ఆదాయం ధ్రువీకరించే పత్రం ఉండాలి. దీన్ని ప్రభుత్వం నిర్దేశించిన అధికారి జారీ చేస్తారు. దరఖాస్తుదారుడు, ఇతర కుటుంబ సభ్యుల పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు కావాలి. పేరు తొలగించాలంటే చనిపోయిన వారి డెత్ సర్టిఫికెట్ అవసరం అవుతుంది. పేరు మార్చాలన్నా కొత్తగా చేర్చాలన్నా మారేజ్ సర్టిఫికెట్ కావాలి.





















