(Source: ECI/ABP News/ABP Majha)
నేడు గవర్నర్‌తో సీఎం భేటీ- త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రచారం!
సీఎం జగన్ ఇవాళ గవర్నర్‌తో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కొన్ని రోజులుగా వినిపిస్తున్న మంత్రివర్గ విస్తరణ అంశంపైనే భేటీ జరగనుందని టాక్ నడుస్తోంది.
ముఖ్యమంత్రి జగన్ ఇవాళ సాయంత్రం గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో సమావేశం కానున్నారు. ప్రకాశం, విశాఖలోనూ జగన్ పర్యటించనున్నారు. ప్రకాశం జిల్లా పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత గవర్నర్‌తో సమావేశం కానున్నారు.
త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అందుకే ముందస్తుగా గవర్నర్‌తో సీఎం సమావేశంకానున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ఎప్పటి నుంచో టాక్ నడుస్తోంది. ఈ మధ్యే ఆ ప్రక్రియ ముగిసింది. ఇప్పుడున్న జట్టులోంచి కొందర్ని తప్పించి కొత్తవాళ్లకు స్థానం కల్పిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకట్రెండు రోజుల్లో దీనిపై క్లారిటీ వస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
గత ఏప్రిల్‌లోనే మంత్రివర్గ విస్తరణ జరిగింది. ఇందులో చాలా మందిని కొత్తవాళ్లనే తీసుకున్నారు. ఇప్పుడు మరోసారి మార్పులు చేర్పులు చేసేందుకు జగన్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈసారి శాఖాల్లో మార్పులు ఉండవచ్చేమోగానీ, జట్టులో ముగ్గురినే మార్చే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కులసమీకరణాలు, పనితీరు ఆధారంగా ఈ ఛేంజెస్ ఉంటాయంటున్నారు.
ఇప్పటికే మార్చి 14నే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మంత్రివర్గ విస్తరణపై సంకేతాలు ఇచ్చారు. కొత్తగా జట్టులోకి ముగ్గురు లేదా నలుగురిని తీసుకొని ఉన్న వారిలో కొందరిని బైబై చెప్పనున్నారని సమాచారం. ఈ మధ్యే ఎమ్మెల్సీగా ఎన్నికైన మర్రి రాజశేఖర్‌తోపాటు తోట త్రిమూర్తులు, కౌరు శ్రీనివాస్ ను మంత్రివర్గంలోకి తీసుకోవడం గ్యారెంటీ అంటున్నారు. అయితే ఎవర్ని తప్పిస్తారనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. విడదల రజిని, దాడిశెట్టి రాజా తప్పించి ఛాన్స్ ఉందటూ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
దాడిశెట్టి రాజా స్థానంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులును జగన్ మూడో దఫా కేబినెట్ లోకి ఆహ్వానించనున్నారని తెలుస్తోంది. తోట త్రిమూర్తులు 14 జూన్ 2021లో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమితులు కాగా, అదే నెల 21న ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. చిలకలూరిపేటకు చెందిన మంత్రి విడదల రజిని బీసీ ఎమ్మెల్యే కాగా, ఆమెను కేబినెట్ నుంచి తప్పించి కమ్మ సామాజిక వర్గానికి చెందిన మర్రి రాజశేఖర్ కు అవకాశం ఇస్తారా అనేది డౌట్‌గానే ఉంది. ఒకే నియోజకవర్గానికి చెందిన ఇద్దరు నేతలకు కేబినెట్‌లో చోటు కల్పించే అవకాశం లేదు. కనుక తప్పని పరిస్థితుల్లో సీఎం జగన్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అసలే ఈ మధ్య కాలంలో అసంతృప్తులు పెరిగిపోతున్న టైంలో కేబినెట్ విస్తరణకు వెళ్తారా అనేది కూడా ఇంకొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ అలా వెళితే మార్పులు చేర్పుల్లో పదవులు రాని వారిని సైతం బుజ్జగించాల్సి ఉంటుంది. ఇంకా ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉంది. ఈ సమయంలో రిస్క్ చేస్తారా లేదా అనేది మరికొందరు చర్చించుకుంటున్నారు. అయితే పాదయాత్ర టైంలో చాలా మంది నేతలకు చట్టసభల్లోకి తీసుకెళ్లి మంత్రులుగా చేస్తానంటూ ప్రజల ముందు మాట ఇచ్చారు జగన్. అలాంటి వ్యక్తుల్లో మర్రి రాజశేఖర్ ఒకరు. ఇన్నాళ్లకు ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఆయన్ని ఈ దఫా మంత్రిని చేస్తారా లేకుంటే వచ్చే టెర్మ్‌కు వాయిదా వేస్తారా అనేది సస్పెన్స్.
నేటి గవర్నర్‌తో భేటీలో మాత్రం మంత్రివర్గం అంశంపై చర్చకు వచ్చే ఛాన్స్ ఉందంటున్నాయి పార్టీ వర్గాలు. దీంతోపాటు అసెంబ్లీ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, ఆమోదించిన బిల్లపై గవర్నర్‌తో చర్చించనున్నారు.