Andhra Pradesh CM Chandra Babu: ఆలోచించేది లేదు, తొక్కుకుంటూ పోతాం- చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Andhra Pradesh CM Chandra Babu: ఆంధ్రప్రదేశ్‌లో డ్రగ్స్ పేరు వినిపించడానికి లేదని ముఖ్యమంత్రి శపథం చేశారు. ప్రజల భాగస్వామ్యంతో తొక్కి పెడతామని వార్నింగ్ ఇచ్చారు.

Andhra Pradesh CM Chandra Babu: రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్‌పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యుద్ధం ప్రకటిస్తున్నట్టు వెల్లడించారు. ఎవరైనా అడ్డదారులు తొక్కి అడ్డంకులు సృష్టిస్తే తొక్కుకుంటూ వెళ్తామని గుంటూరులో జరిగిన కార్యక్రమంలో హెచ్చరించారు. ఏటా జూన్ 26న నిర్వహించే అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని గుంటూరులో నిర్వహించారు. యువతతో కలిసి వాకథాన్‌లో పాల్గొన్నారు. చంద్రబాబు సుమారు అర కిలోమీటరు దూరం వారితో కలిసి నడిచి, డ్రగ్స్ రహిత రాష్ట్ర నిర్మాణానికి యువత సహకరించాలని సూచించారు.
వాక్‌థాన్ అనంతరం నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు యువతతో కలిసి డ్రగ్స్, గంజాయి జోలికి పోమని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం గంజాయి అరికట్టడంపై శ్రద్ధ పెట్టలేదని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై తాము ఆందోళన వ్యక్తం చేసినా పట్టనట్టు వ్యవహరించారని అన్నారు. ఆ పోరాటాలకు ప్రతిస్పందనగా తమ కార్యాలయంపై దాడులు చేయించారని అన్నారు. నాడు గంజాయి ఉత్పతికి సహకరించిన వాళ్లే ఇప్పుడు కూడా అదే పంథా కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల గంజాయి బ్యాచ్‌పై పోలీసులు చర్యలు తీసుకుంటే వారికి మద్దతుగా వందలాది మంది ర్యాలీలు ఏర్పాటు చేసి గొడవలకు పాల్పడ్డారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అలాంటి వారిని వదిలేద్దామా అని ప్రశ్నించారు.
రాజకీయ ముసుగులులో ఉన్న గంజాయి బ్యాచ్‌లు, వారి వెనక ఉన్న శక్తులకు బుద్ధి చెప్పే టైం వచ్చిందన్నారు సీఎం చంద్రబాబు. తప్పుడు పనులతో రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే సాధ్యం కాదని హెచ్చరించారు. మాదకద్రవ్యాలతో మానవత్వాన్ని కోల్పోయి మృగాల్లా ప్రవర్తిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గంజాయి మత్తులో అత్యాచారాలు హత్యలు చేస్తున్నారని వాపోయారు. అలాంటి నేరస్థులను క్షమించాలా? అని ఆయన క్వశ్చన్ చేశారు.
అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవంలో సందర్భంగా నేడు గుంటూరు శ్రీ కన్వెన్షన్‌లో జరిగిన కార్యక్రమం లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.#AndhraPradesh pic.twitter.com/jMTkLxrI7q
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) June 26, 2025
గంజాయి, డ్రగ్స్ నిర్మూలన ఒక్క ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని ప్రజలు కూడా కలిసి రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. గంజాయి బ్యాచ్‌లను ప్రోత్సహించే వారిని దూరం పెట్టాలని అన్నారు. గంజాయిని పండిచేవాళ్లు, సరఫరా చేసే వాళ్లు మారాలని లేకుంటే రాష్ట్రంలో ఉండే అర్హత కోల్పోతారని హెచ్చరించారు. టెక్నాలజీతో ఎక్కడ పండించినా దొరికిపోతారని అన్నారు. ఉపగ్రహ చిత్రాలు, గూగుల్ మ్యాప్స్, డ్రోన్లు ఉపయోగించి కట్టడి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ‘ఈగల్’ పేరుతో శక్తివంతమైన పర్యవేక్షణ ఏర్పాటు చేశామన్నారు. మాదకద్రవ్యాలపై మా మూడో కన్ను ఎప్పటికీ తిరుగుతూనే ఉంటుందని వివరించారు. అన్నింటి కంటే ప్రజా పోలీసింగ్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు. మాదక ద్రవ్యాలు జోలికి వెళ్లిన వాళ్లు ఎవరైనా సరే తొక్కుకుంటూ వెళ్లిపోతామని హెచ్చరించారు. ఏ స్థాయిలో ఉన్న వదిలిపెట్టబోమని అన్నారు.
మీ ప్రాంతాల్లో ఎక్కడైనా మాదకద్రవ్యాలు కనిపించిననా ఎవరైనా వాడుతున్నట్టు అనిపించినా 1972కి ఫోన్ చేసి లేదా సమాచారం అందించాలన్నారు. 89777 81972 వాట్సాప్ నంబర్‌కు కూడా సమాచారం షేర్ చేయవచ్చని పేర్కొన్నారు. ఈ వివరాలు చాలా గోప్యంగా ఉంటాయని తెలిపారు.





















