Amaravati-Hyderabad:అమరావతి-హైదరాబాద్ రైల్వే లైన్ పనుల్లో మరో ముందడుగు- టెండర్లు ఆహ్వానిస్తున్న అధికారులు!
Amaravati-Hyderabad:అమరావతి-హైదరాబాద్ మధ్య మరో రైల్వే లైన్ పనులు ఊపందుకుంటున్నాయి. భూసేకరణ పూర్తి చేస్తున్న అధికారులు ఇప్పుడు పనులకు టెండర్లు పిలవబోతున్నారు. డిసెంబర్ నుంచి పనులు ప్రారంభంకానున్నాయి.

Amaravati-Hyderabad: తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ మధ్య రైల్వే కనెక్టివిటీ మరింత పెంచేందుకు కీలకమైన ముందడుగు పడింది. రెండు తెలుగు రాష్ట్రాల రాజధానులను కలుపుతూ కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు రాష్ట్రాల మధ్య ఆర్థిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక అనుసంధానాన్ని బలపరచేందుకు ఒక ముఖ్యమైన స్టెప్‌గా భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు భూసేకరణ ప్రక్రియ దాదాపు పూర్తి అయ్యింది. ఇప్పుడు పనులకు టెండర్లు పిలిచేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.
హైదరాబాద్- అమరావతి మధ్య ఏర్పాటు చేసే రైల్వే లైన్ ప్రాజెక్టులో భాగంగా, కృష్ణా నదిపై భారీ వంతెన నిర్మించాల్సి ఉంది. దీని కోసం విడివిడగా టెండర్లు పిలవనున్నారు. ఈ టెండర్ల ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తి చేసి డిసెంబర్ 2025 నాటికి పనులు ప్రారంభించాలని చూస్తున్నారు. 2025లో ప్రారంభించే ప్రాజెక్టును ఐదేళ్లలో పూర్తి చేయనున్నారు.
ఈ లైన్‌ను పిడుగురాళ్ల మీదుగా నిర్మించే ఆలోచన చేశారు. కానీ తాజాగా రైల్వే నిపుణుల సలహాల కాజీపేట-విజయవాడ ముఖ్య రైల్వే లైన్‌తో అనుసంధానం చేసేందుకు నిర్ణయించారు. ఈ కొత్త మార్గం ఎర్రుపాలెం స్టేషన్ నుంచి ప్రారంభమై, పెద్దాపురం, పరిటాల,చెన్నారావుపాలెం, అమరావతి, కొప్పురావూరు గ్రామాల మీదుగా చివరిగా నంబూరు స్టేషన్‌లో గుంటూరు-విజయవాడ లైన్‌తో అనుసంధానమవుతుంది. దీని విస్తీర్ణం సుమారు 58 కిలోమీటర్ల వరకు విస్తరిస్తుంది.
రాజధాని అమరావతి మీదగా వేస్తున్న సరికొత్త రైల్వే లైన్ కి ₹2,245 కోట్లు అప్రూవ్ చేసిన కేంద్ర ప్రభుత్వం 🙏
— Srikanth (@yskanth) October 24, 2024
From: Errupalem to Namburu
Via: Amaravati Capital City
Total Distance: 56.53 KM
Railway Bridge: 3.2 KM
Stations: 9 (Paritala, Vaddamanu, Amaravati, Tadikonda, etc) pic.twitter.com/LRk732rNyB
ఈ రైలు మార్గం పూర్తైతే సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరే రైలు, కాజీపేట, ఖమ్మం, ఎర్రుపాలెం వరకు ప్రస్తుత లైన్‌లో పయనించి, అక్కడి నుంచి కొత్త మార్గంలోకి మారి, పెద్దాపురం, పరిటాల గ్రామాల మీదుగా అమరావతి చేరుకుంటుంది. ఈ మార్గం నంబూరు వద్ద గుంటూరు-విజయవాడ లైన్‌తో కలిసిపోయి, విజయవాడ వరకు సాగుతుంది.
కృష్ణా నదిపై వంతెన: ఈ రైల్వే మార్గంలో కృష్ణా నదిపై భారీ వంతెన నిర్మించనున్నారు. ఈ వంతెన అమరావతి- పరిటాల సెక్షన్ మధ్య నిర్మిస్తారు. ఇది సుమారు 3.5 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. సుమారు 600 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ వంతెన 60 స్పాన్స్‌తో రూపొందుతుంది.
ఈ కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి మొత్తం రూ.2400 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టును రెండు దశల్లో పూర్తి చేసేందుకు రైల్వే శాఖ ప్లాన్‌లు సిద్ధం చేసింది. ఫేజ్-1 దశలో నంబూరు నుంచి కొప్పురావూరు వరకు 6 కిలోమీటర్ల మార్గం, కొప్పురావూరు నుంచి అమరావతి వరకు 14 కిలోమీటర్ల మార్గం నిర్మించనున్నారు.
ఫేజ్-2 దశలో ఎర్రుపాలెం నుంచి పెద్దాపురం వరకు 5.5 కిలోమీటర్లు, పెద్దాపురం నుంచి చెన్నరావుపాలెం వరకు 5 కిలోమీటర్లు, చెన్నరావుపాలెం నుంచి పరిటాల, అక్కడి నుంచి అమరావతి వరకు 22 కిలోమీటర్ల మార్గం నిర్మాణం జరుగుతుంది.
ఈ మార్గంలో 35 పెద్ద వంతెనలు, 95 చిన్న వంతెనలు, మూడు రోడ్‌ఓవర్ బ్రిడ్జెస్ (ఆర్‌ఓబీలు), 12 రోడ్‌అండర్ బ్రిడ్జెస్ (ఆర్‌యూబీలు) నిర్మించాలని భావిస్తున్నారు. దేశంలో రైల్వే లెవల్ క్రాసింగ్‌లను తొలగించే లక్ష్యంతో, ఈ మార్గంలో ఎక్కడా లెవల్ క్రాసింగ్‌లు ఉండకుండా చూసేందుకు రైల్వే శాఖ ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది.





















