Repalle: రేపల్లెపై మనసుపడ్డ సినీ హీరో, టికెట్ కోసం తహతహ! కానీ సీఎం అపాయింట్‌మెంటే కరువు!
ఆ సినీ హీరోకి రేపల్లెపై మనసు పడింది. అయితే ఆ నియోజకవర్గంలో కీలక నేత ఉండటంతో కనీసం ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ కూడా దక్కలేదని పార్టీ వర్గాల టాక్.
సినీ హీరో, సుమన్ కు రాజకీయాలపై ఆసక్తి ఏర్పడింది. అయితే ఆయన అధికార పార్టీ నుంచే రంగంలోకి దిగాలని భావిస్తున్నారు. కాబట్టి, గుంటూరు జిల్లాలోని రేపల్లె నుండి ఆయన అరగ్రేటం చేయాలని ఆశిస్తున్నారని పార్టీలో టాక్ నడుస్తోంది. దీంతో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులకు కూడా టచ్ లోకి వెళ్లారంట.. అంతే కాదు వ్యక్తి గతంగా వారి ఇళ్ళకు వెళ్ళి, మరి తన అభిప్రాయాలను షేర్ చేసుకున్నారంట. ఇక అదే సమయంలో గుంటూరు జిల్లాలోని కీలక నాయకులతో కూడా హీరో సుమన్ టచ్ లోకి వెళ్లారని అంటున్నారు. అయితే ఆయన రేపల్లె నియోజకవర్గం పేరు చెప్పటంతో అంతా సైలెంట్ అయిపోతున్నారని అంటున్నారు.
రేపల్లె వైఎస్ఆర్ సీపీ టిక్కెట్ అంత ఈజీ కాదుగా..
రేపల్లె నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీటు విషయం పై సుమన్ పార్టీలోని సీనియర్ నేతలను కలిసిన సమయంలో అంతా ఆశ్చర్యానికి గురవుతున్నారని చెబుతున్నారు. రాజకీయాల్లోకి రావటం అందులోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావటం శుభపరిణామం అయినప్పటికి ఆదే నియోజకవర్గం కోసం ఆసక్తి చూపించటం అంటే కష్టమని నాయకులు అంటున్నారంట. రాజకీయాల్లోకి రండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రండి కానీ, నియోజకవర్గాలు, పదవులు కోసం ముందే కర్ఫీఫ్ వేసుకోవటం వంటి పరిస్థితులు ఉంటే కష్టమని కొందరు నేతలు ముఖం ముందే చెప్పేస్తున్నారట, మరి కొందరు కీలక నేతలు అయితే ముందు పార్టీలోకి రావాలి కదా మీరు. అంటున్నారని టాక్...
రేపల్లెలో మోపిదేవి పాగా..
రేపల్లె నియోజకవర్గంలో ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంచార్జ్ గా మోపిదేవి వెంకట రమణ ఉన్నారు. ఆయనే గత ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసి తెలుగు దేశం అభ్యర్థి అనగాని సత్య ప్రసాద్ చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే ఆ తరువాత ఆయనకు జగన్ ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. ఎమ్మెల్సీ రద్దు విషయంలో తెర మీదకు రావటంతో అంతటితో ఆగకుండా జగన్ ఏకంగా రాజ్య సభ సీట్ ను కూడా మోపిదేవికి కట్టబెట్టారు. దీంతో జగన్ కోటరిలో మోపిదేవికి ఎంతటి ప్రాధాన్యం ఉంటుందనేది ఎవ్వరికి ప్రత్యేకంగా చెప్సాల్పిన అవసరం లేకుండా పోయింది. అయితే ఇప్పుడు అదే నియోజకవర్గం నుండి సినీ నటుడు సుమన్ రాజకీయ ఎంట్రీ కోరుకోవటంపై కూడా సందిగ్ధత ఏర్పడింది. మోపిదేవి లాంటి వ్యక్తిని కాదని ఎట్టి పరిస్థితుల్లోనూ మరొకరికి నియోజకవర్గంలో ఛాన్స్ ఇచ్చే అవకాశం లేదని కొందరు నాయకులు, సుమన్ కు ముఖం మీదనే చెప్పేసినప్పటికి ఆయనకు రాజ్యసభ స్థానం కల్పించినందున తన అభ్యర్దిత్వాన్ని పరిశీలించమని అడగటంలో తప్పేమి లేదని సుమన్ అంటున్నారట.
అందుకే సీఎం అపాయింట్ మెంట్ కరువు..
దీని కోసం ఎన్నో సార్లు హీరో సుమన్ ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నించారని చెబుతున్నారు. ఆయన మనస్సు రేపల్లె పై ఉందన్న సమాచారం ముఖ్యమంత్రి జగన్ చెవిలో పడటంతో ఆయన కూడా కలిసేందుకు సుముఖుత చూపించలేదని చెబుతున్నారు. రేపల్లె సీట్ ను ఆశిస్తున్న విషయం తెలిసి కూడా అటు సుమన్ కు అపాయింట్ మెంట్ ఇవ్వటం అంటే, మోపిదేవిని కూడా ఇబ్బందికి గురి చేసినట్లు అవుతుందనే అభిప్రాయంలో జగన్ ఉన్నారని అంటున్నారు. దీంతో సుమన్ కు కనీసం ముఖ్యమంత్రిని కలిసేందుకు కూడా ఛాన్స్ దక్కలేదని పార్టీలో ప్రచారం ఉంది.