Sajjala On Mlc Elections : ఎమ్మెల్సీ ఫలితాలను హెచ్చరికగా భావించడంలేదు, కౌంటింగ్ లో అవకతవకలు జరిగాయ్ - సజ్జల
Sajjala On Mlc Elections : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను హెచ్చరికగా భావించడంలేదని సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు.
Sajjala On Mlc Elections : ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. శనివారం అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లన్నీ టీడీపీవి కావన్నారు. పీడీఎఫ్, వామపక్షాలకు చెందిన ఓట్లు టీడీపీకి పడ్డాయన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వ వ్యతిరేకతను సూచించమన్నారు. మొత్తం అన్ని స్థానాలతో కలిపి ఫలితాలు చూడాలన్నారు. టీడీపీ సంబరాలు చేసుకోవడంతోనే అంతా అయిపోలేదన్నారు. ఎమ్మెల్సీ ఫలితాలను హెచ్చరికగా భావించడం లేదని సజ్జల స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయులు వైసీపీని బాగా ఆదరించారన్నారు. ఈ ఫలితాలతో టీడీపీ బలం పెరిగిందనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలతోనే ఏదో అయిపోయిందనుకోవడం సరికాదన్నారు.
సంక్షేమ పథకాల పరిధిలో పట్టభద్రులు లేరు
ఎమ్మెల్సీ ఓట్ల బండిల్ లో ఏదో గందరగోళం జరిగిందని సజ్జల అన్నారు. కౌంటింగ్‌లో అవకతవకలు జరిగాయని, వీటిపై ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. ఈ ఎన్నికల్లో ఓట్లు సమాజంలోని చిన్న సెక్షన్ మాత్రమేనని సజ్జల అన్నారు. ఈ ఫలితాలు మొత్తం సొసైటీని ప్రతిబింబిచవన్నారు. ఒక వర్గం ఓటర్లను రాష్ట్రం మొత్తానికి ఎలా ఆపాదిస్తారని సజ్జల ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల పరిధిలో పట్టభద్రుల ఓటర్లు లేరన్నారు. యువతకు భారీగా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లు జారీ చేశామన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంఖ్యాబలం లేకపోయినా టీడీపీ పోటీ చేసిందన్నారు. తెలంగాణ తరహాలోనే టీడీపీ ప్రయత్నాలు చేయొచ్చునని ఎద్దేవా చేశారు. అనంతపురంలో రీకౌంటింగ్ చేయాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వ వ్యతిరేకతను ప్రతిఫలించవని సజ్జల అన్నారు. ఈ ఫలితాలను మేము హెచ్చరికగా భావించడంలేదన్నారు. ఈ ఓటర్లు మొత్తం సమాజాన్ని రిప్రజెంట్ చేయడంలేదన్నారు. మొదటిసారి ఉపాధ్యాయుల స్థానాలు గెల్చుకున్నామని సజ్జల తెలిపారు. ఉపాధ్యాయులు వైసీపీ ప్రభుత్వాన్ని ఆదరించారని చెప్పుకొచ్చారు.
రెండు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది. మూడు పట్టభద్రులు నియోకవర్గాల్లో ఎన్నికలు జరిగితే రెండింటిని కైవశం చేసుకుంది టీడీపీ. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో కోటాకు అనుకూలంగా ఓట్ల శాతం రాకపోవడంతో.. ఎలిమినేషన్ ప్రకారం విజేతను ప్రకటించారు. ఎలిమినేషన్ రౌండ్‌లో తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని పోటీ నుంచి తప్పిస్తారు. వాళ్లకు వచ్చిన రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించి ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయో వాళ్లకు కలుపుతారు. ఇలా రెండో ప్రాధాన్యత ఓట్లతో టీడీపీకి చెందిన ఇద్దరు అభ్యర్థులు విజయం సాధించారు. తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం అంటే ఉమ్మడి ప్రకాశం – నెల్లూరు – చిత్తూరు నియోజకవర్గ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ విజయకేతనం ఎగరేశారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో గెలుపొందదారు. కంచర్ల శ్రీకాంత్ 34,108 ఓట్లతో ఘన విజయం సాధించారు. ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు తెలుగుదేశం అభ్యరర్థికి 11,511 రాగా... వైసీపీ అభ్యర్థికి 3,900 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్ధికి 50%+1 ఓట్లు రావడంతో విజేతగా ప్రకటించారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవి రావు వైసీపీ తరపున పోటీ చేసిన శీతంరాజు సుధాకర్ పై భారీ మెజారిటీతో గెలుపొందారు. 11,551 రెండో ప్రాధాన్యత కోటా ఓట్లను వేపాడ చిరంజీవి సాధించినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. దాంతో విజయానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ను వేపాడ రెండో ప్రాధాన్యత ఓట్లతో సాధించినట్టు అధికారులు తెలిపారు.