Chandrababu : ఎమ్మెల్సీ అనంతబాబు పెళ్లిళ్లు, పేరంటాలకు తిరుగుతున్నా అరెస్టు చేయడంలేదు, చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Chandrababu On Mlc Anantababu : కాకినాడలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకేసులో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు బహిరంగంగా తిరుగుతున్నా అరెస్టు చెయ్యకపోవడంపై చంద్రబాబు విస్మయం వ్యక్తం చేశారు.
Chandrababu On Mlc Anantababu : కాకినాడలో హత్యకు గురైన డ్రైవర్ సుబ్రహ్మణ్యం సతీమణి అపర్ణను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫోన్ లో పరామర్శించారు. గర్భవతిగా ఉన్న అపర్ణకు వచ్చిన కష్టంపై చంద్రబాబు తీవ్ర అవేదన వ్యక్తం చేశారు. సుబ్రహ్మణ్యం హత్యకు అనంతబాబే కారణమని అపర్ణ చంద్రబాబుకు వివరించారు. తెలుగుదేశంతో పాటు దళిత సంఘాలు చేసిన పోరాటం వల్లనే పోలీసులు చివరికి హత్య కేసుగా నమోదు చేశారని అపర్ణ చంద్రబాబుతో అన్నారు. తనను పోలీసులు తీవ్రంగా వేధించారని, కేసును నీరు గార్చేందుకు ప్రయత్నం చేశారని ఆమె ఆరోపించింది. ఈ సమయంలో తన తరపున పోరాటం చేసిన తెలుగుదేశం నేతలకు అపర్ణ ధన్యవాదాలు తెలియజేసింది. తన భర్త హత్య కేసును సీబీఐతో విచారణ జరిపించాలని అపర్ణ డిమాండ్ చేసింది. ధైర్యంగా ఉండాలని, అన్ని విధాలా పార్టీ తరపున అండగా ఉంటామని చంద్రబాబు అపర్ణకు హామీ ఇచ్చారు. నిందితుడు ఎమ్మెల్సీ అనంతబాబు బహిరంగంగా తిరుగుతున్నా పోలీసులు అరెస్టు చెయ్యకపోవడాన్ని చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టారు. కళ్లముందు పెళ్లిళ్లకు, పేరంటాలకు నిందితుడు వెళుతుంటే ఇప్పటికీ అరెస్టు చెయ్యకపోవడం బాధితుల అనుమానాలను బలపరిచేలా ఉందని చంద్రబాబు అన్నారు. సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితులకు శిక్ష పడేవరకు టీడీపీ పోరాటం కొనసాగిస్తుందని చంద్రబాబు అపర్ణకు హామీ ఇచ్చారు.
అసలేం జరిగింది?
కాకినాడి జిల్లాలో వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ బాబు కారులో మృతదేహం కలకలం సృష్టిస్తోంది. ఆ మృతదేహం ఎమ్మెల్సీ దగ్గర పనిచేసే డ్రైవర్ సుబ్రమణ్యందని తెలుస్తోంది. డ్రైవర్ సుబ్రమణ్యాన్ని గురువారం ఉదయం ఎమ్మెల్సీ ఉదయ్ బాబు తనతో తీసుకెళ్లారు. ఆ తర్వాత ప్రమాదం జరిగిందని డ్రైవర్ చనిపోయాడని, డ్రైవర్ తమ్ముడికి సమాచారమిచ్చారు. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటలకు ఎమ్మెల్సీ తన కారులోనే డ్రైవర్ మృతదేహాన్ని తీసుకొచ్చి అతడి తల్లిదండ్రులకు అప్పగించారు. ఆ కారు అక్కడే వదిలేసి వేరే కారులో ఎమ్మెల్సీ వెళ్లిపోయారు. మృతదేహాన్ని కిందకు దించాలని సుబ్రమణ్యం తల్లిదండ్రులపై ఎమ్మెల్సీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం జరిగిందని ఆరాతీసిన తల్లిదండ్రులకు సమాధానం చెప్పకుండా ఎమ్మెల్సీ వేరే కారులో వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులు పనిచేస్తున్న అపార్ట్మెంట్ ఎదుట ఎమ్మెల్సీ కారులో డ్రైవర్ మృతదేహం ఉంది. ఈ ఘటనపై బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ సుబ్రమణ్యం ఐదేళ్లుగా ఎమ్మెల్సీ దగ్గరే పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. డ్రైవర్‌ను ఎమ్మెల్సీ హత్య చేశారంటూ ఆయన కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
అయితే గురువారం అనంతబాబు పుట్టిన రోజు కావడంతో ఆయన అనుచరులంతా పార్టీ చేసుకున్నారు. ఆ పార్టీలో ఏమైనా జరిగిందా? మరేదైనా కారణముందా అనేది పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. డ్రైవర్ ను స్వయంగా ఎమ్మెల్సీనే వచ్చి తీసుకెళ్లడం, ఆ తర్వాత రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని చెప్పడం అనుమానాస్పదంగా ఉందని కుటుంబ సభ్యులు అంటున్నారు. పార్టీ జరుగుతుండగా టిఫిన్ కోసం సుబ్రమణ్యం బయటకు వెళ్లాడని, అప్పుడు బైక్ యాక్సిడెంట్ జరిగిందని ఎమ్మెల్సీ చెబుతున్నారు. పార్టీ జరుగుతున్నప్పుడు టిఫిన్ కోసం బయటకు వెళ్లాడని చెప్పడం కూడా అనుమానాలకు తావిస్తోంది.