High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
High Court Judges : హైకోర్టులో జడ్జీలు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారని సంచలన కామెంట్స్ చేశారు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి. రాష్ట్ర ప్రభుత్వాన్ని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు కాపాడుకోవాలని ఆయన ఉద్యోగులకు పిలుపునిచ్చారు.
High Court Judges : హైకోర్టులోని కొందరు జడ్జీలు ఏపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి. అంతకు ముందు ఎస్ఈసీ, ఇప్పుడు హైకోర్టు జడ్జీలు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. హైకోర్టులో కొందరు జడ్జీలు ప్రభుత్వాన్ని ఇబ్బందిపెడుతున్నారని, హైకోర్టు వ్యవహారశైలిపై న్యాయనిపుణులే విమర్శలు చేశారని వెంకట్రామిరెడ్డి అన్నారు. హైకోర్టు జడ్జీలను విమర్శిస్తే మూడు నెలలైనా బెయిల్ రాలేదని, కానీ సీఎం జగన్ ను తిడితే గంటలోనే బెయిల్ ఇచ్చారని ఆయన అన్నారు. హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడకుండా డిగ్నిఫైడ్‌గా వ్యవహరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠను కాపాడుకోవాల్సిన బాధ్యత గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులపై ఉందని వెంకట్రామిరెడ్డి చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి
సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రాష్ట్ర స్థాయి సభ నిర్వహిస్తామని వెంకట్రామిరెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు కాపాడుకోవాలని ఆయన ఉద్యోగులకు పిలుపునిచ్చారు. సచివాలయాల ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తమ వంతుగా కృషి చేస్తామన్నారు. కొన్ని మీడియా సంస్థలు ప్రభుత్వంపై బురద జల్లుతున్నాయని విమర్శించారు. కొన్ని వ్యవస్థలు ప్రభుత్వాన్ని కంట్రోల్ చేయాలని చూస్తున్నాయని ఆరోపించారు. గతంలో నిమ్మగడ్డ రమేష్ ఎలా వ్యవహరించారో అందరికీ తెలుసన్నారు. జడ్జీలను ఎవరో దూషించారని మూడు నెలలు బెయిల్ ఇవ్వకుండా చేశారని, మరి రోజూ సీఎం జగన్ ను దూషించే వారిపై కోర్టులు ఎందుకు స్పందించటంలేదని ప్రశ్నించారు. జూన్ 30 నాటికి అర్హత ఉన్న ఉద్యోగులందరికీ సర్వీసులు పర్మినెంట్ చేయాలని సీఎం జగన్ ఆదేశించారని తెలిపారు.
విజయవాడలో భారీ సభ
జులై 1వ తేదీ తర్వాత అర్హత పొందిన ఉద్యోగుల సర్వీసులను కూడా పర్మినెంట్ చేయాలని సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారని వెంకట్రామిరెడ్డి తెలిపారు. సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో విజయవాడలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల భారీ సభ నిర్వహిస్తామని సభలో సీఎం జగన్ ను ఘనంగా సన్మానించాలని నిర్ణయించామన్నారు. బదిలీలపై సీఎం జగన్ సానుకూలంగా ఉన్నారన్నారు. సచివాలయ ఉద్యోగులు కరోనా టైంలో ఎంతో కష్టపడి పనిచేశారని, 196 మంది కరోనాతో చనిపోయారన్నారు. వారందరికీ ప్రభుత్వ సాయం అందించేందుకు సీఎం జగన్ అంగీకరించారన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు సీఎం జగన్ కి మానసపుత్రిక లాంటివని వెంకట్రామిరెడ్డి అన్నారు. ఈ ఉద్యోగులకు ఏ సమస్య వచ్చినా వెంటనే ప్రభుత్వం స్పందిస్తుందన్నారు. అయితే వెంకట్రామిరెడ్డి అంతకు ముందు ఎన్నికల నిర్వహణ విధులపై ఎస్ఈసీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు సంచలనం అవ్వడంతో తన కామెంట్స్ వక్రీకరించారని చెప్పుకొచ్చారు.
Also Read : MP Raghu Rama Krishna Raju : ఆర్ఆర్ఆర్ సినిమా స్టోరీ చెప్పిన సీఐడీ బాస్, ఎంపీ రఘురామ సెటైర్లు
Also Read : Dirty Politics : మాధవ్ వీడియో చుట్టే ఏపీ రాజకీయాలు ! ఇంతకీ తప్పెవరు చేస్తున్నారు?