Minister Roja : అన్నదమ్ముల్లాంటి సమైక్య రాష్ట్రాన్ని విడగొట్టారు, ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీపై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు
Minister Roja : పబ్లిసిటీ పిచ్చితో చంద్రబాబు అమాయకుల ప్రాణాలతో చెలగాటం అడుతున్నారని మంత్రి రోజా విమర్శించారు. పవన్ ప్యాకేజీలకు తప్ప పాలిటిక్స్ కు పనికిరారని మండిపడ్డారు.
Minister Roja : టీడీపీ అధినేత చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితో అమాయకుల ప్రాణాలు తీస్తున్నారని మంత్రి రోజా విమర్శించారు. చంద్రబాబు సభలకు జనం రావడంలేదని చీరలిస్తాం, నిత్యావసర సరుకులు ఇస్తామని మభ్యపెట్టి ప్రజలను సభలకు తరలిస్తున్నారని ఆరోపించారు. గుంటూరు తొక్కిసలాటకు చంద్రబాబే కారణమని మండిపడ్డారు. చందన్న కానుక పేరుతో ప్రజలను మభ్యపెట్టి సభకు తరలించారన్నారు. ముందు 30 వేల మందికి నిత్యావసరాలు ఇస్తామని చెప్పి, కొంతమందికి ఇచ్చి మిగిలిన వాళ్లను ఇంటికి పంపిస్తామని చెప్పడంతో ఆందోళన చెందారన్నారు. లక్షల మందికి ఇళ్ల పట్టాలిచ్చామని ఎక్కడా ఒక్క దుర్ఘటన జరగలేదన్నారు. జగన్ మోహన్ రెడ్డి లక్షల కిలోమీటర్లు పాదయాత్ర చేశారని, ఎక్కడా ఒక్క చిన్న తొక్కిసలాట జరగలేదన్నారు. ఒక మీటింగ్ పెడుతున్నప్పుడు పార్టీ బాధ్యత కూడా ఉంటుందని, ఎక్కడ మీటింగ్ పెడితే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుందో చూసుకోవాలన్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే కనీస జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కానీ గుంటూరు సభలో ఇలాంటి జాగ్రత్తలు లేవని ఆరోపించారు.
పవన్ పాలిటిక్స్ కు పలికిరారు
"ఈ సభకు పర్మిషన్ తీసుకున్న వాళ్లపై చర్యలు తీసుకుంటాం. మంచి చేస్తే ప్రజలు మీ వెంట వస్తారు. కానీ సభలు పెట్టి చంపేస్తుంటే మేం ఊరుకే చూస్తూ ఊరుకోం. సీఎం జగన్ తో చర్చించి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. పవన్ కల్యాణ్ కూడా ఈ ఘటనపై స్పందించాలి. ప్రభుత్వంతో విరుచుకుపడే పవన్.. ఈ ఘటనపై ఎందుకు నోరుమెదపడంలేదు. ఏపీ ప్రజలు ప్రాణాలు మీకు పట్టదా? పవన్ ప్యాకేజీలకు తప్ప పాలిటిక్స్ కు పనికిరారు అనే స్పష్టమైంది. జనసేనకు డిపాజిట్లు కూడా వచ్చేది కష్టమే. కులం పేరుతో వచ్చినా, కార్లపై కూర్చొని వచ్చినా ప్రజలకు బుద్ధి చెబుతారు. ప్రజలు సీఎం జగన్ వెంట ఉన్నారు. 2023లో కూడా సీఎం జగన్ ప్రజల చేత శేభాష్ అనిపించుకుంటారు. "- మంత్రి రోజా
సన్నబడడం కోసమే లోకేశ్ పాదయాత్ర
పవన్ కల్యాణ్ ప్యాకేజీకి తప్ప రాజకీయాలకు పనిచేయరని మంత్రి రోజా ఆరోపించారు. గుంటూరు ఘటనపై స్పందించకుండా పవన్ నోటికి హెరిటేజ్ ప్లాస్టర్ వేసుకున్నారా? అని మండిపడ్డారు. చంద్రబాబు పబ్లిసిటీ కోసం అమాయకులు బలితీసుకుంటున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ వల్ల అమాయకులు చనిపోతున్నా పవన్‌కు కనిపించడం లేదా అని మండిపడ్డారు. కందుకూరు, గుంటూరు ఘటనలపై పవన్ ఎందుకు స్పందించలేదని నిలదీశారు. కందుకూరులో చంద్రబాబు ఇరుకు రోడ్డులో సభలో పెట్టి జనాన్ని చంపేశారని మంత్రి రోజా మండిపడ్డారు. పేదవాళ్ల ప్రాణాలంటే చంద్రబాబుకు అంత చులకనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి పుష్కరాల సమయంలో 29 మందిని పొట్టన పెట్టుకున్నారన్నారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు 40 మందిని చంపాడని ఆరోపించారు. లోకేశ్ పాదయాత్ర ఆపాల్సిన పని వైసీపీ ప్రభుత్వానికి లేదన్నారు. లోకేశ్ సన్నబడడం కోసమే పాదయాత్ర చేపట్టారని విమర్శించారు. ఆయన పాదయాత్ర చేస్తే టీడీపీకే నష్టమన్నారు. లోకేశ్ పాదయాత్రకు టీడీపీ నేతలే భయపడుతున్నారని మంత్రి రోజా విమర్శించారు.
బీఆర్ఎస్ పై మంత్రి రోజా స్పందన
"ఎవరైనా ఎక్కడైనా రాజకీయ పార్టీ పెట్టుకోవచ్చు. అందరూ అన్నదమ్ముల్లాగా ఉన్న సమయంలో మాకు రాష్ట్రం కావాలని చెప్పి ఏపీ, తెలంగాణను విడగొట్టారు. ఇప్పుడు ఏపీకి వచ్చి బీఆర్ఎస్ నేతలు ఏం సమాధానం చెబుతారో వాళ్లు నిర్ణయించుకోవాలి. విభజన చట్టంలోని న్యాయపరంగా ఏపీకి రావాల్సిన వాటిని తెలంగాణ అడ్డుకుంది. చంద్రబాబు ఓటుకు నోటు కేసును అడ్డుపెట్టుకుని ఏపీ అన్యాయం చేశారు. బీఆర్ఎస్ లో చేరిన వాళ్లు, పార్టీ పెట్టిన వాళ్లు ఏం సమాధానం చెబుతారో చూద్దాం" - మంత్రి రోజా